బయటకు చెప్పుకోవట్లేదు.. డబ్ల్యూహెచ్​వో ఏం చెప్పిందంటే...

బయటకు చెప్పుకోవట్లేదు.. డబ్ల్యూహెచ్​వో ఏం చెప్పిందంటే...

మనకు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే వెంటనే గుర్తిస్తాం. డాక్టర్ దగ్గరికి పరిగెడతాం. అవసరమైన ట్రీట్​మెంట్ తీసుకుంటాం. చిన్న చిన్న జ్వరాల నుంచి నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద జబ్బుల వరకు కాస్త ముందుగానే గుర్తిస్తాం. మనకు ఏదో అవుతుందని ముందుగానే తెలిసిపోతుంది. కానీ మానసిక సమస్యల దగ్గరకు వచ్చేటప్పటికి అవి మనకున్నాయని గ్రహించడం కష్టమే. చూసే వాళ్లకూ తెలియదు. బాగానే ఉన్నారు కదా అనుకుంటారు. ఒకవేళ ఒక వ్యక్తి తనకో మెంటల్ హెల్త్ ఇష్యూ ఉందని గుర్తించి చెప్పినా ఎదుటి వాళ్లు పట్టించుకోరు. కానీ.. ఇది లైట్​ తీసుకోవాల్సిన సమస్య కాదంటున్నారు సైకియాట్రిస్ట్​లు. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్​ నుంచి బయటపడేదెలా?
 
మెంటల్ హెల్త్ ఇష్యూస్ వ్యక్తిగతమైనవి. బయటకు చెప్తే తప్ప తెలిసేవి కావు. కొందరికి చెప్పుకోవాలని కూడా తెలియదు. తమకు సమస్య ఉన్నట్లే కొందరు గుర్తించరు. డాక్టర్లు, సైకాలజీ ఎక్స్​పర్ట్​లకి తప్ప ఈ సమస్యలు ఎవరికీ అర్థం కావు. కానీ మామూలు రోగాలకన్నా మానసిక సమస్యలే తీవ్రంగా ఉంటాయి. అవి ఆత్మహత్యలకు పురికొల్పుతాయి. అందుకే ఈ సమస్యను సీరియస్​గా తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. కరోనా మహమ్మారి తర్వాత మెంటల్ ఇష్యూస్ మరింత పెరగడంతో ఇప్పుడు దాన్ని ఇంకా సీరియస్​గా తీసుకుంటోంది.

డబ్ల్యూహెచ్​వో ఏం చెప్పిందంటే...

నిజానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) ‘‘కాంప్రెహెన్సివ్ మెంటల్ హెల్త్ యాక్షన్ ప్లాన్ 2013–2030” పేరుతో మెంటల్ హెల్త్​పై ఒక కార్యక్రమం మొదలుపెట్టింది. సభ్య దేశాలు దాన్ని అమలు చేసేలా ప్రోత్సహిస్తోంది. అయితే.. 2019 కరోనా ప్యాండమిక్ తర్వాత  మెంటల్ హెల్త్ ఇంపార్టెన్స్​ పెరిగింది. మెంటల్ హెల్త్ డిజార్డర్లు ఎంత పెద్ద సమస్యో అందరికీ అర్థం అయ్యింది. లాక్​డౌన్, ఐసోలేషన్ వల్ల ప్రజల లైఫ్​స్టైల్​లో చాలా మార్పులు వచ్చాయి. కుటుంబాలపై రకరకాల ఒత్తిళ్లు పెరిగాయి. ఆరోగ్యం కాపాడుకోవడం పెద్ద సమస్య అయ్యింది. ఉద్యోగాలు పోయాయి. కొందరికి ఆదాయాలు తగ్గాయి. ఆన్​లైన్ పాఠాల వల్ల పిల్లలకు సెల్​ఫోన్ ఎడిక్షన్​ పెరిగింది. పెద్ద వాళ్ల నుంచి మొదలుపెడితే యూత్, చిన్న పిల్లల్లో కూడా అనేక రకాల మానసిక సమస్యలు తలెత్తాయి. ప్యాండమిక్ వల్ల పెరిగిన ఆల్కహాల్, డ్రగ్స్, పొగాకు వాడకం, ఆన్​లైన్ గేమ్స్ ఎడిక్షన్లు మానసిక సమస్యల్ని మరింత పెంచాయి. ప్యాండమిక్ వల్ల చాలామందిలో స్ట్రెస్​ పెరిగింది. ప్యాండమిక్ మొదటి సంవత్సరంలో యాంగ్జైటీ, డిప్రెసివ్ డిజార్డర్లు 25 శాతం పెరిగాయని డబ్ల్యూహెచ్​వో చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి మెంటల్ డిజార్డర్ ఉందని అంటోంది. మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకునే వాళ్లు అంతకుముందు 20 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశారని మెంటల్ హెల్త్ రిపోర్టులో డబ్ల్యూహెచ్​వో చెప్పింది. అంతేకాదు.. ఈ రిపోర్ట్​ ప్రకారం ప్రతి వంద మరణాల్లో ఒకటి సూసైడ్​గా తెలుస్తోంది. 

హెల్దీ లైఫ్ అంటే.. 

ఏ ఇబ్బంది లేకుండా, డాక్టర్ల అవసరం లేకుండా జీవించడం ఆరోగ్యవంతుల లక్షణం అనుకుంటాం. ఎప్పుడైనా చిన్న జ్వరమో, జలుబో తప్ప ఏ రకమైన ఇతర ఆరోగ్య సమస్యలు లేకపోవడం కూడా హెల్దీ లైఫ్ అనుకుంటూ ఉంటాం. కానీ.. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం హెల్దీగా ఉన్నట్టు అంటున్నారు ఎక్స్​పర్ట్స్. మరి మానసిక ఆరోగ్యం అంటే ఏంటి?  అది ఎలా ఉంటుంది? అంటే.. మనం ఆలోచించే పద్ధతి, ఒక విషయాన్ని ఎలా అవగాహన చేసుకుంటాం, విశ్లేషించుకుంటాం, ఎలా రిసీవ్​ చేసుకుంటాం... అనే అంశాలపై అది ఆధారపడి ఉంటుంది. మెంటల్​ హెల్త్​పై బయటి అంశాలు ప్రభావం చూపించవని చెప్పలేం. కానీ.. బయట జరిగిన కొన్ని సంఘటనలు కూడా మైండ్​పై విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. ఆ ఎఫెక్ట్​ మానసిక సమస్యలకు దారి తీయొచ్చు. చిన్నప్పుడు భయంకరమైన యాక్సిడెంట్ లేదా ఏదైనా సంఘటన చూసినప్పుడు అది మనసులో నాటుకుపోయి భవిష్యత్తులో ఎఫెక్ట్​ చూపించొచ్చు. మెంటల్ హెల్త్ లేదా న్యూరొలాజికల్ డిజార్డర్లు ప్రజల ఆలోచనల మీద ఎఫెక్ట్​ చూపిస్తాయి. దాంతో వాళ్ల భావోద్వేగాలు, ప్రవర్తన, పరస్పర సంబంధాలపై నెగెటివ్​ ఎఫెక్ట్​ పడుతుంది. మానసిక అనారోగ్యాల్లో  స్కిజోఫ్రీనియా, డిమెన్షియా, అల్జీమర్స్, యాంగ్జైటీ వంటివి ముఖ్యమైనవి. 

ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది మానసికమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు డబ్ల్యూహెచ్​వో చెప్తోంది. ఈ సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూ వస్తోంది అని అంటోంది. ప్రపంచవ్యాప్తంగా పది నుంచి ఇరవై శాతం మంది పిల్లలు మానసిక సమస్యలకు గురవుతున్నారు. ఇందులో సగం మంది పద్నాలుగు సంవత్సరాల లోపువాళ్లే. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఐదున్నర కోట్ల మంది డిమెన్షియాతో బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం పది లక్షల మంది దీనికి అదనంగా వచ్చి చేరుతున్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 7.5 కోట్లకు, 2050 నాటికి 13.9 కోట్లకు చేరుకుంటుందని అంచనా.

మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఉన్నట్లు గుర్తించిన 76 నుంచి 85 శాతం మందికి ఎలాంటి ట్రీట్​మెంట్ దొరకడం లేదు. ధనిక దేశాల్లో కూడా 35 నుంచి 50 శాతం మందికి ట్రీట్​మెంట్ అందడం లేదు. మనదేశంలో పాతిక కోట్ల మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఇందులో మెజారిటీ జనానికి మెంటల్ హెల్త్ కేర్ అందడం లేదు. దీనికి కారణం మెంటల్ హెల్త్​పై ప్రభుత్వాలు కేటాయిస్తున్న బడ్జెట్ చాలా తక్కువ. చాలా దేశాలు తమ హెల్త్ బడ్జెట్​లో మెంటల్ హెల్త్​కి రెండు శాతం మాత్రమే కేటాయిస్తున్నాయి. అంతర్జాతీయంగా అందే సాయం కూడా ఒక్క శాతానికి మించడంలేదు. దీనికితోడు మన దేశంలో చికిత్స కూడా ఎక్కువ ఖర్చుతో కూడిన పనే. అంతేకాదు, డాక్టర్ల సంఖ్య కూడా తక్కువే. నిజం చెప్పాలంటే.. రెండు లక్షల మందికి ఒక్క డాక్టర్ కూడా లేరని నివేదికలు చెప్తున్నాయి. 

పిల్లల్లో పెరుగుతున్న సమస్య..

మన దేశంలో ఐదు కోట్ల మంది పిల్లలు మెంటల్ డిజార్డర్లతో బాధపడుతున్నట్లు ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ’ చెప్తోంది. మరో స్టడీ ప్రకారం 23.3 శాతం మంది స్కూల్​ పిల్లలు ఏదో ఒక రకమైన మానసిక సమస్యతో బాధపడుతున్నారు. కరోనా ప్యాండెమిక్ వల్ల మానసికంగా ఎక్కువ ఎఫెక్ట్​ అయ్యింది పిల్లలే అని చెప్పుకోవచ్చు. లేత వయసులో ఒక్కసారి ప్రపంచం తలకిందులైనట్లు వచ్చిన మార్పుల్ని జీర్ణించుకోవడం పిల్లల వల్ల కాలేదని డాక్టర్ నవీన చెప్పారు. ‘‘తల్లిదండ్రులకు కూడా పిల్లలకు ఎలా నచ్చ జెప్పాలో, సర్దిచెప్పాలో అర్థం కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే.. వాళ్లు కూడా షాక్​లో ఉన్నార’’న్నారు. తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. స్కూళ్లు మూతపడ్డాయి. పిల్లలు ఇళ్లకే పరిమితమయ్యారు. కొన్ని రోజులకు ఆన్​లైన్ పాఠాలు వచ్చాయి. అప్పటివరకు పేరెంట్స్ వద్దని వారించిన మొబైల్స్, ట్యాబ్​లు పిల్లల చేతిలోకి వచ్చాయి. క్లాస్ రూం ఇంటరాక్షన్ లేకపోవడం, సోషల్ మూవ్​మెంట్ రిస్ట్రిక్ట్ కావడంతో పిల్లల మీద విపరీతమైన మానసిక ప్రభావం చూపిందని ఆమె చెప్పారు. సాధారణ పరిస్థితులు వస్తున్న సమయంలో పేరెంట్స్ పిల్లలకు అయిన కొత్త అలవాట్లు మాన్పించే ప్రయత్నం చేస్తే వయలెంట్​గా రియాక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. సెల్ ఫోన్ వద్దంటే ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు కూడా ఉన్నారు. ఇంకొందరు తమ విపరీతమైన ప్రవర్తనతో తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేశారు. విపరీతమైన కోపం, ఆవేశంతో ఊగిపోయారు. కొందరిలో స్కిజోఫ్రీనిక్ ప్రవర్తన కూడా కనిపించింది. ప్యాండమిక్​ గ్యాప్ వల్ల క్లాసులో చెప్పిన పాఠాలు అర్థం కాక డిప్రెషన్​కు గురైన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. తల్లిదండ్రుల మాట వినకపోవడం, క్లాసు రూంలో డిఫరెంట్​గా ప్రవర్తించడం, తోటి పిల్లలతో గొడవలు పడడం లాంటి ఎన్నో సమస్యలు వచ్చాయి. అయితే ఇందులో చాలా సమస్యలకు మానసిక అనారోగ్యమే కారణమని పేరెంట్స్ కూడా గుర్తించలేకపోయారు. కొందరు మాత్రం గుర్తించి, సమయానికి సైకియాట్రిస్ట్​లు, సైకాలజిస్టులను కలిసి సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు. 

మెజారిటీ యూత్​లో డిప్రెషన్

మానసిక సమస్యలతో బాధ పడుతున్న వాళ్లలో యువత సంఖ్య ఎక్కువే. కొంత కాలం కిందట ఒక ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ చేసిన సర్వేలో 65 శాతం మంది యూత్ (25–50 ఏళ్లు)  డిప్రెషన్​తో బాధపడుతున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 26.4 కోట్ల మంది డిప్రెషన్​తో బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్​వో చెప్తోంది. కాగా ఇతర సైకలాజికల్ సమస్యలతో బాధపడుతున్న వాళ్లు కూడా ఉన్నారు. యాంగ్జైటీ, స్లీప్ డిజార్డర్స్ వీళ్లను పట్టి పీడిస్తున్న సమస్య. యూత్​లో మానసిక సమస్యలు వల్ల ఉద్యోగ జీవితంపై నెగెటివ్​ ఎఫెక్ట్​ పడుతోంది. వాటివల్లే పనిలో రాణించలేకపోతున్నామని 55 శాతం మంది చెప్తున్నారు. అంతేకాదు పనిచేసే పరిస్థితులు కూడా తమ మానసిక స్థితిపై ఎఫెక్ట్​ చూపుతున్నాయి అంటున్నారు. తక్కువ వేతనం, పనిలో పోటీ, పని నాణ్యతపై అంచనాలు వంటివి మానసిక ఆందోళనకు గురి చేస్తున్నాయి అంటున్నారు. ప్యాండమిక్ తర్వాత ఇలాంటి ఆందోళనలు ఏ స్థాయిలో పెరిగాయో చెప్పనవసరం లేదు. ఆ సమయంలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. జీతాల్లో కోతలు, భద్రత లేని ఉద్యోగాలతో సతమతమయ్యారు. చాలా మందికి కుటుంబాల్ని ఎలా పోషించుకోవాలో అంతుపట్టని పరిస్థితి. దీనికి తోడు పెరిగిన ధరలు బరువు బాధ్యతలు మోసే యువతను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ సమస్యల నుంచి బయటపడడం తెలియక చాలామంది మద్యానికి బానిసయ్యారు. గంజాయి తీసుకోవడం, ఇతర వ్యసనాలు పెరిగాయి. కొందరు ఆన్​లైన్ గేమ్స్​కి అలవాటు పడ్డారు. వీటి ద్వారా వాళ్ల మానసిక, శారీరక ఆరోగ్యం విపరీతంగా దెబ్బతిన్నది. కొందరు బయటపడే మార్గాలు వెతుక్కోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే ఈ సమస్య ఇంకా సమసిపోలేదు. కొనసాగుతూనే ఉంది. 

ఆడవాళ్లలో ఆందోళనకర స్థాయిలో...

మానసిక ఆరోగ్యం బాగుంటే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టే. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మానసిక సమస్యల తీవ్రత ఈమధ్యకాలంలో మరింత ఎక్కువైంది. అందులోనూ మహిళలు, సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా వీటి బారిన పడుతున్నారు. పోస్ట్ కొవిడ్ తర్వాత ఈ సమస్యల తీవ్రత ఆందోళనకర స్థాయిలో ఉంటోంది. కరోనా ప్యాండమిక్ టైంలో ఆడవాళ్లే ఎక్కువగా మానసిక సమస్యలకు గురయ్యారు. మనదేశంలో మామూలు వైద్య సదుపాయాల విషయంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యసేవలు ఉన్నా, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వైద్య సిబ్బంది, వైద్య సేవల విషయంలో బాగా వెనుకబడి ఉండడం వల్ల కూడా మానసిక ఆరోగ్య ప్రమాణాలు మనదేశంలో అసంతృప్తికరంగా ఉన్నాయి. ఆ ఉన్న అరకొర మానసిక వైద్య సౌకర్యాలు కూడా పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితులు చూస్తున్నాం. దీనికి తోడు పురుషాధిక్య సమాజం, స్త్రీ పురుషుల మధ్య ఉన్న లైంగిక అసమానతలు, మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వేగవంతమైన టెక్నాలజీ వంటివి కూడా స్త్రీలలో మానసిక అనారోగ్య తీవ్రతను మరింతగా పెంచుతున్నాయి. మనదేశంలో జరిగిన కొన్ని స్టడీల్లో మధ్యవయస్కులైన ఆడవాళ్లు ఎక్కువగా మానసిక సమస్యలకు గురవుతున్నారని తేలింది. అంతేకాదు, వైద్య సంబంధమైన సమస్యలు కూడా మగవాళ్ల కన్నా ఆడవాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయని తేలింది. నైతికస్థైర్యం విషయంలో కూడా మహిళల పరిస్థితి బాగాలేదని స్టడీలు చెప్తున్నాయి. మగవాళ్ల కన్నా ఆడవాళ్లలో రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా యాంగ్జైటీ, డిప్రెషన్లు, లక్షణాలు లేని మానసిక అనారోగ్యాలు  ఎక్కువగా ఉంటున్నాయని తేలింది. మరింత దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. తమకు మానసిక సమస్యలున్నాయన్న విషయమే తెలియని ఆడవాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఆడవాళ్లలో మానసిక సమస్యలకు జెండర్ కూడా ముఖ్య అంశమే. దీనివల్ల ఆడవాళ్లు ఎదుర్కొంటున్న మానసిక అనారోగ్యం మగవాళ్ల కన్నా కాస్త భిన్నంగా ఉంటోంది. కుటుంబ హింస, మానసిక, శారీరక హింసలు పెండ్లైన ఆడవాళ్లను ఎక్కువ డిప్రెషన్​కు గురిచేస్తున్నాయి. ఒక స్టడీ ప్రకారం దేశంలో 2/3 వంతు మహిళలు గృహ హింసకు గురవుతున్నారని తేలింది. చిన్న వయసులోనే పెండ్లి అయిన వాళ్లు, న్యూక్లియర్ కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలు   డిప్రెషన్​తో ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితులు ఈమధ్య ఎక్కువయ్యాయి. డిప్రెషన్​తో వాళ్లు తమను తాము మానసికంగా హింసించుకుంటున్న సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి. వీటితోపాటు పలు సామాజిక అంశాలు కూడా ఆడవాళ్ల మానసిక ఆరోగ్యం దృఢంగా లేకపోవడానికి కారణాలు అవుతున్నాయి. తమకున్న అనారోగ్య సమస్యలకు చికిత్స తీసుకుంటున్న మహిళలు తక్కువగా ఉంటున్నారు. తమ మానసిక అనారోగ్యం గురించి అవగాహన లేకపోవడం, దీని పట్ల సమాజంలో ఉన్న స్టిగ్మా, సామాజిక భయాలు కూడా మహిళల మానసిక ఆరోగ్యాన్ని మరింత ప్రమాదపు అంచులకు తీసుకెళ్తున్నాయి. వీటితోపాటు మానసిక ఆరోగ్య సేవలకు అవసరమైన వనరులు పట్టణాల్లో ఉన్నంత పాటి కూడా గ్రామీణ ప్రాంతాల్లో లేని దుస్థితి. సామాజిక, రాజకీయ, ఆర్థిక, న్యాయపరమైన కృషి ద్వారా దేశంలోని మహిళల పరిస్థితుల్లో మార్పులు సాధ్యమవుతాయని, అప్పుడు ఆడవాళ్ల మెంటల్​ హెల్త్ కూడా బాగుంటుందని సోషలిస్ట్​లు చెప్తున్నారు. ఆడవాళ్లలో చూస్తున్న డిప్రెషన్, యాంగ్జైటీ, శారీరక సమస్యలతో పాటు గ్లోబల్ స్థాయిలో రెండో పెద్ద డిజబిలిటీ బర్డెన్​గా గుర్తించిన ‘యూనిపోలార్ డిప్రెషన్’ కూడా వీళ్లలో ఎక్కువగా ఉంటోంది. డిప్రెషన్ మగవాళ్లలో కూడా ఉన్నా, ఆడవాళ్లలో మాత్రం ఈ సమస్య వదలకుండా నిరంతరాయంగా కనిపిస్తోంది. మానసిక సమస్యలు ఆడవాళ్లలో ఎక్కువగా కనిపించడానికి పేదరికం కూడా ఒక ముఖ్య కారణం. అలాగే పునరుత్పత్తికి సంబంధించిన హార్మోనల్ అంశాలు కూడా మానసిక సమస్యలు పెరగడానికి కారణం అవుతున్నాయి. భర్త తాగుడుకు బానిస కావడం, వాళ్ల చేతుల్లో నిత్యం శారీరక, మానసిక హింసకు గురికావడం, వితంతువులు అవడం, భార్యాభర్తలు విడిపోవడం, కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, స్త్రీలకు ఏ విషయంలోనూ నిర్ణయం తీసుకునే అధికారం లేకపోవడం, స్వంతంగా వ్యవహరించే స్వేచ్ఛ, ఆత్మ విశ్వాసాలు లేకపోవడం, ఫ్యామిలీ సపోర్ట్, సమాజం మద్దతు, తరచూ మానసికంగా, ఆర్థికంగా తీవ్ర డిప్రెషన్​కు గురికావడం, పిల్లల పెంపకం, తల్లి బాధ్యతలు, వృద్ధాప్యంలో నిర్లక్ష్యానికి గురవడం లాంటివి  ఆడవాళ్ల మానసిక ఆరోగ్య ప్రమాణాలను దిగజారుస్తున్నాయి. వీటికి తోడు విద్య, ఉపాధి అవకాశాలకు దూరం కావడం కూడా ఆడవాళ్లను మానసిక అనారోగ్యాలపాలు చేస్తున్నాయి. లైంగిక, శారీరక హింసకు గురవడంతో పాటు మానసిక అనారోగ్యాల తీవ్రత వాళ్లలో ఎక్కువగా కనిపిస్తోంది. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కూడా ఆడవాళ్లను తీవ్రంగా వేధిస్తున్న మరో మానసిక సమస్య. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్.. మానసిక ప్రవర్తన, భావోద్వేగాలు, కాగ్నిటివ్ పరంగా తీవ్ర ప్రభావాలను చూపుతుంది. ఈ పరిణామాలు వాళ్ల పిల్లలై కూడా పడే ప్రమాదం ఉంది. దీనికి తోడు యాంగ్జైటీ, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు కూడా ఆడవాళ్లలో తలెత్తుతాయి. ప్రపంచవ్యాప్తంగా10 శాతం మంది ప్రెగ్నెంట్స్, 13 శాతం మంది డెలివరీ తర్వాత డిప్రెషన్​కు గురవుతున్నారని అంచనా. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది కొంచెం ఎక్కువగా15.6,19.8 శాతంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే సామాజిక మార్పు, లింగవివక్ష, సామాజికంగా వెలివేత, ఆడవాళ్లకు చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేయడం, వితంతు జీవితాలు, ఒంటరి జీవనం, గృహహింస, యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ సంక్షోభాలతో ఏర్పడే సామాజిక పరిస్థితులు ఆడవాళ్లలో మానసిక సమస్యలను మరింత పెంచుతున్నాయి. వాళ్ల తెలివితేటలు, సామర్థ్యాన్ని, నాయకత్వ లక్షణాలను పనికిరాకుండా చేస్తున్నాయి. అందుకే ఆడవాళ్లు తమ చుట్టూ ఉన్న పరిస్థితులపై పోరాటం చేయగలిగేలా ఆరోగ్యంగా, ఆత్మస్థైర్యంతో నిలబడాలి. ఆర్థిక, సామాజిక సాధికారులుగా కీలకపాత్ర పోషించాలి. అందుకు కుటుంబాలు, సమాజం, ప్రభుత్వాలు కలిసికట్టుగా స్త్రీ శక్తికి అండగా నిలబడాలి అంటున్నారు సామాజిక నిపుణులు, మానసిక వైద్యులు.

పెద్దల్లోనూ ఈ సమస్య ఎక్కువే

సీనియర్ సిటిజన్స్ విషయానికి వస్తే వాళ్లలో కూడా వృద్ధాప్యం, ఆర్థిక, సామాజిక, కుటుంబ పరమైన పలు అంశాల వల్ల తీవ్ర మానసిక అనారోగ్యాలు తలెత్తుతున్నాయి. ముసలితనంలో పునరావాసం లేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పెద్దవాళ్లకు మానసిక అనారోగ్యానికి అందే ఆరోగ్య సేవలు కూడా శూన్యమనే చెప్పాలి. ప్రభుత్వాలు వీరికి మెంటల్ హెల్త్ సర్వీస్​లను అందించడంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. పెరుగుతున్న జనాభా, సామాజిక మార్పులు, ఆరోగ్య పథకాలు, సేవల ప్రణాళికలు, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సేవలు వంటి విషయాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మన దేశంలో 2026 నాటికి సీనియర్ సిటిజన్ల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని లెక్కలు చెప్తున్నాయి. మారుతున్న సోషల్ లైఫ్​స్టైల్​ కూడా సీనియర్ సిటిజన్లను ఒత్తిడికి, మానసిక అనారోగ్యాలకు గురిచేస్తోంది. ఒకప్పటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయి న్యూక్లియర్ కుటుంబాలను నేడు చూస్తున్నాం. అలాగే పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, సాంకేతికీకరణలు కూడా మనిషి లైఫ్​స్టైల్​లో మార్పులకు కారణం అవుతున్నాయి. పిల్లలు విదేశాలకు వెళ్లడం, అక్కడే స్థిరపడడంతో సీనియర్ సిటిజన్లు ఒంటరవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైగా సామాజిక, ఆర్థిక, భావోద్వేగ, కుటుంబ సంరక్షణ లేకపోవడం కూడా వాళ్ల జీవితాలను అభద్రతా వాతావరణంలో పడేస్తున్నాయి. మోడ్రనైజేషన్, వేగవంతమైన లైఫ్​స్టైల్​ వల్ల సంప్రదాయ కుటుంబ వ్యవస్థ, సంబంధాలు విచ్ఛిన్నం చేస్తున్నాయి. దీంతో రకరకాల మెంటల్ డిజార్డర్లు వృద్ధులను వెంటాడుతున్నాయి. మనదేశంలో నిర్వహించిన పలు స్టడీల్లో ఎందరో వృద్ధులు ఏదో ఒకరకమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని కూడా వెల్లడైంది. వృద్ధుల్లో చాలామంది డిమెన్షియా, డిప్రెషన్లతో బాధపడుతున్నట్టు స్టడీలు చెప్తున్నాయి. అరవై ఏండ్లు నిండిన వృద్ధులు చాలామందిలో మూడు రెట్ల దాకా డిప్రెషన్ ఉంటున్నట్టు తెలుస్తోంది. ఊళ్లలో ఉండే వృద్ధుల్లో న్యూరోటిక్ డిప్రెషన్, శారీరకపరమైన, ఒత్తిడితో కూడిన డిప్రెషన్లు కనిపిస్తున్నాయి. మనదేశంలో పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పెరిగిన సీనియర్ సిటిజన్స్​లో సైకలాజికల్ డిజార్డర్లతో పాటు మానసిక రోగాల తీవ్రత బాగా పెరుగుతూ వస్తోంది. సాధారణ వృద్ధులతో పాటు పెద్దవాళ్లైన లెస్బియన్, ట్రాన్స్ జండర్లు, బైసెక్సువల్స్, గేలు కూడా కొన్ని మానసిక రుగ్మతలతో, సామాజిక సమస్యలతో జీవిస్తున్నారు. వృద్ధ మహిళలైతే ఆర్థిక, సామాజిక అభద్రతల మధ్య జీవిస్తున్నారు. తీవ్ర ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్నారు. భావోద్వేగపరమైన, ఆర్థికపరమైన అభద్రతలతో, లింగవివక్ష సమస్యలతో వృద్ధాప్యంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నారు. చదువు లేకపోవడంతో వీళ్ల పరిస్థితి మరింత బాధాకరంగా ఉంది. డిప్రెషన్, డిమెన్షియా వంటివి వీళ్లలో ఎక్కువగా ఉంటున్నాయి. 

శారీరక సమస్యలకు ఏమాత్రం తీసిపోని రీతిలో మానసిక అనారోగ్యం నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా అభివృద్ధి దశలో ఉన్న మనలాంటి దేశంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. మానసికంగా ఆరోగ్యంగా లేని దేశంలో పురోభివృద్ధి సాధ్యం కాదు. ఇలాంటి ఆరోగ్యాన్ని సాధించాలంటే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించాలి. మెంటల్ హెల్త్ ప్రాధాన్యం గుర్తించి ప్రభుత్వాలు తగిన బడ్జెట్ కేటాయింపులు జరపాలి. మానసిక చికిత్సా కేంద్రాల సంఖ్య పెంచాలి. మానసిక సమస్యలు గుర్తించేలా అన్ని స్థాయిల్లో శిక్షణ ఇవ్వాలి. ఇంట్లో తల్లిదండ్రులు, స్కూళ్లలో టీచర్స్ ఇలాంటి సమస్యలను తొందరగా పసిగట్టేలా వాళ్లలో అవగాహన పెంచాలి. కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. తీవ్రమైన సమస్యల పరిష్కారానికి హాస్పిటళ్లు స్థాపించాలి. మానసిక ఆరోగ్యం మనిషికి ఎంత ముఖ్యమో గుర్తించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. 

–పి.శశికాంత్, డేగ కుమార్

దీపిక: తాను మెంటల్​గా కుంగిపోయానని, అందులో నుంచి బయటకు రావడానికి చాలా టైమ్ పట్టిందని బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొణె పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. స్ట్రెస్ వల్ల అలా అవుతుందేమోనని తొలుత భావించినా.. సమస్య ఇంకా తీవ్రంగా ఉన్నట్టు తర్వాత తెలుసుకోగలిగానని ఆమె తెలిపారు. తన సమస్య వల్ల పని మీద ఫోకస్ చేయలేకపోయానని, సరిగా శ్వాస తీసుకోలేకపోయానని ఆమె తెలిపారు. ఈ సమస్య నుంచి బయటపడిన తర్వాత మెంటల్ ఇల్​నెస్ ఉన్న వారికి ట్రీట్​మెంట్ అందించేందుకు ఆమె ఓ స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించారు.

బయటకు చెప్పుకుంటే నయం

కొవిడ్ వల్ల జరిగిన ఆర్థిక, ప్రాణ నష్టం వల్ల చాలా మంది డిప్రెషన్‌‌‌‌లోకి వెళ్లిపోయారు. ఇప్పుడిప్పుడే ఆ సమస్య నుంచి కొంత మంది బయటపడుతుంటే, ఇంకా చాలామంది అదే డిప్రెషన్‌‌‌‌లో ఉన్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకూ అనేక మంది డిప్రెషన్, యాంగ్జైటీ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కానీ, బయటకు చెప్పుకోకుండా తమలో తామే కుంగిపోతున్నారు. అలాంటి వాళ్లను గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తే తక్కువ సమయంలో పూర్తిస్థాయిలో కోరుకుంటారు. మన దేశంలో ఇప్పటికీ సైకియాట్రిస్ట్​నో, సైకాలజిస్ట్​నో కలవాలంటే జనం భయపడతారు. చుట్టాలు, స్నేహితులు తమను పిచ్చోళ్లలా చూస్తారని సందేహిస్తారు. ఈ స్టిగ్మా వల్లే తమ మానసిక స్థితిని చెప్పుకోవడానికి ఎవరైనా వెనకాడతారు. ఈ స్టిగ్మా నుంచి బయటపడి తమ పరిస్థితిని షేర్ చేసుకోగలిగితే సమస్య నుంచి వీలైనంత తొందరగా బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడిప్పుడే కొంతమంది తాము ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను ధైర్యంగా షేర్ చేసుకుంటున్నారు. ఇది మంచి పరిణామం. టెలీ మానస్ పేరిట మానసిక సమస్యలను చెప్పుకోవడానికి దేశవ్యాప్తంగా ఓ టోల్‌‌‌‌ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌ను కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీనిపై జనాల్లో అవేర్‌‌‌‌‌‌‌‌నెస్ లేకపోవడం వల్ల, టెలీ మానస్‌‌‌‌కు కూడా ఆశించిన స్థాయిలో కాల్స్ రావడం లేదు.  
–డాక్టర్ ఉమా శంకర్‌‌‌‌‌‌‌‌, సూపరింటెండెంట్, మెంటల్ హెల్త్ హాస్పిటల్, ఎర్రగడ్డ

కోహ్లి: కోట్ల మంది ఆరాధించే క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా మెంటల్ ఇల్​నెస్​ను ఎదుర్కొన్నాడు. మానసిక సమస్యల వల్ల ఆస్ట్రేలియా ఆల్రౌండర్​ మాక్స్​వెల్ 2019లో క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. ఆ సమయంలో కోహ్లి మాక్స్​కు మద్దుతగా నిలవడంతో పాటు, 2014 ఇంగ్లాండ్ టూర్ టైమ్​లో తన మానసిక పరిస్థితి కూడా బాలేదని వెల్లడించారు. ఆ సమయంలో ప్రపంచం అంతమైపోయింది అనేలా తన ఆలోచనలు ఉండేవని చెప్పాడు. అయితే ఈ విషయం బయటకు ఎలా చెప్పాలో, ఎవరికి చెప్పాలో తనకు తెలియలేదన్నాడు. ‘‘రంగమేదైనా అందరూ మనసు పెట్టి తమ బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. కానీ, ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో ఎవ్వరూ కనిపెట్టలేరు. తన పరిస్థితిని బయటకు చెప్పి మాక్స్​వెల్​ క్రికెటర్లందరికి ఉదాహరణగా నిలిచాడు. మైండ్​సెట్ ​సరిగా లేనప్పుడు ఒక్కోసారి ఎన్నిసార్లు ప్రయత్నించినా చివరికి ఏం చేయాలో తెలియని స్థితికి చేరుతాం. గ్లెన్​ పరిస్థితి కూడా ఇదే. ఎవరు ఔనన్నా కాదన్నా ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే మీరు మెంటల్​గా సిద్ధంగా లేరా? ఆట నుంచి బ్రేక్​ కావాలా? అని నన్ను అడిగితే నేను సరైన సమాధానం చెప్పలేను. ఎవరైనా మానసికంగా ఇబ్బంది పడుతుంటే అన్నీ వదిలేసుకోవాలని నేను చెప్పడం లేదు. కొంత విశ్రాంతి తీసుకుని, చేసే పనిపై క్లారిటీ తెచ్చుకోవాలి. ఈ టెన్షన్​ నా వల్ల కాదు అని ఎవరైనా చెబితే, వారి అభిప్రాయాన్ని గౌరవించాలి. మైండ్​సెట్​ సరిగా లేదంటే దాన్ని చేతకానితనంలా చూడకూడదు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఇబ్బందిగా భావించాలి’’ అని కోహ్లి వివరించాడు.

అనుష్కశర్మ: విరాట్ భార్య, సినీ స్టార్ అనుష్కశర్మ కూడా యాంగ్జైటీతో బాధపడుతున్నారు. 2015లో తాను తీవ్ర యాంగ్జైటీతో బాధపడిందని, ఆ సమస్య నుంచి బయటపడేందుకు ట్రీట్​మెంట్ తీసుకున్నట్టు, మెడిసిన్ కూడా వాడిందని చెప్పారు. ఇలా మానసిక సమస్యలతో ఇబ్బంది పడడం సహజం అని చెప్పడానికే తాను ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెట్టిందని అనుష్క తెలిపారు. తమ కుటుంబంలో చాలామంది మానసిక సమస్యలను ఎదుర్కొన్నారన్నారు. ఈ విషయంలో దాచుకోవడానికి, సిగ్గుపడడానికి ఏమీ లేదని.. అందరూ మెంటల్ ఇల్​నెస్​పై ఓపెన్​గా మాట్లాడాలని ఆమె కోరారు.

అమలాపాల్: డిప్రెషన్, యాంగ్జైటీతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఓపెన్​గా బయటకు చెప్పాలని, ఇతరుల సాయం తీసుకోవాలని సినీ నటి అమలపాల్ తన అనుభవాలను చెప్పారు. తన కెరీర్​లో ఒకానొక సందర్భంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఆ సమయంలో తాను చాలా ఒత్తిడికి గురయ్యానని తెలిపింది. తాను అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నట్టుగా, రిక్వెస్ట్ చేస్తున్నాట్టుగా తనకు అనిపించేందని ఆమె చెప్పింది. అలాగే అందరికీ దూరంగా ఉంటున్నట్టుగా అనిపించేదట. తన తండ్రి చనిపోయినప్పుడు కూడా తాను మానసికంగా కుంగిపోయానని వెల్లడించింది. తనను మోటివేట్ చేసుకుంటూ, ఇతరుల సహాయం తీసుకుంటూ ఆ పరిస్థితుల నుంచి బయటపడగలిగానని చెప్పింది.

భవిష్యత్​ గురించిన బెంగ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం, చేయగలమో, లేదోనన్న అపనమ్మకం, చిన్న చిన్న విషయాలకే డిప్రెస్ అవడం, జీవితం పట్ల నిర్దిష్టమైన లక్ష్యం లేకపోవడం, ఫెయిల్యూర్స్​ను యాక్సెప్ట్ చేయలేకపోవడం, డ్రగ్స్, ఆల్కహాల్​కు అలవాటు పడడం, వర్క్ స్ట్రెస్​, ఎగ్జామ్స్ ప్రెజర్ వంటివి యువతలో మానసిక సమస్యలకు ప్రధాన కారణాలు. ఆర్థిక, ఆరోగ్యపరమైన సమస్యలు, కుటుంబ పరిస్థితులు వంటివి కూడా మెంటల్ ఇల్​నెస్​కు దారితీస్తున్నాయి. తమ ఫీలింగ్స్​ను ఇతరులతో షేర్ చేసుకోకుండా చాలా మంది తమలో తామే కుంగిపోతున్నారు. కొంత మంది బయటకు చెప్పుకోవడానికి ఎవరూ లేరనే భావనలో ఉంటున్నారు. పిల్లలతో మాట్లాడి ధైర్యం, భరోసా ఇచ్చే వారు లేకపోవడం కూడా ఓ సమస్యగా ఉంది. జీవితం పట్ల సానుకూల దృక్పథం పెంచుకోవడం, పాజిటివ్ థింకింగ్, ఇతరులతో మాట్లాడడం వంటివి డిప్రెషన్, యాంగ్జైటీ నుంచి బయటపడేందుకు హెల్ప్అవుతాయి.
- డాక్టర్ హరీశ్ పిన్నోజు, కన్సల్టెంట్​ సైకియాట్రిస్ట్, హైదరాబాద్

ఆదిలోనే గుర్తించకపోతే ప్రమాదం

పిల్లల్లో మానసిక సమస్యలు రెండు దశాబ్దాలుగా పెరుగుతున్నాయి. పేరెంటింగ్‌‌, ఫ్యామిలీ లైఫ్‌‌స్టైల్‌‌లో వచ్చిన మార్పులు, టెక్నాలజీ ఎడిక్షన్ వంటి అనేక అంశాలు ఇందుకు కారణాలు అవుతున్నాయి. ప్రారంభ దశలోనే వీటిని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తే పిల్లలు మళ్లీ నార్మల్ స్థితిలోకి వచ్చేస్తారు. పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులు, చెప్పిన మాట వినకపోవడం, తరచూ అబద్ధాలు చెప్పడం, దొంగతనం చేయడం, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఇష్టపడకపోవడం, ఒంటరిగా ఉండడం, స్కూల్‌‌ లేదా కాలేజీకి వెళ్లడానికి ఇష్టపడకపోవడం వంటివన్నీ పిల్లల్లో మానసిక సమస్యలను గుర్తించే లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే పిల్లలపై కోపగించుకోకుండా, వారి సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కౌన్సెలింగ్ ఇప్పించాలి. మొబైల్, గేమింగ్ ఎడిక్షన్ కూడా మానసిక సమస్యలకు, న్యూరోలాజికల్ డిజార్డర్లకు దారి తీస్తాయి. వీటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.
–డాక్టర్ ఎంహెచ్‌‌ గిరి ప్రసాద్‌‌, అసోసియేట్‌‌ ప్రొఫెసర్, నీలోఫర్ హాస్పిటల్

మన రాష్ట్రంలో కూడా ప్యాండమిక్ తర్వాతే మెంటల్ హెల్త్ మీద ఫోకస్ పెరిగింది. చాలామంది వయసుతో సంబంధం లేకుండా డిప్రెషన్, యాంగ్జైటీకి గురి కావడం ఆందోళనకు గురిచేసింది. పిల్లలు, యుక్త వయసు వాళ్లు, యువకులు, ఉద్యోగులు, పెద్ద వయసు వాళ్లు ఇలా ఎవరికి వాళ్లు రకరకాల సమస్యలకు గురవుతూ వచ్చారు. ప్యాండమిక్ సృష్టించిన రకరకాల భయాలు, అపోహలు, అతి జాగ్రత్తలు కూడా జనం మెంటల్ డిజార్డర్లకు గురయ్యేందుకు కారణమయ్యాయి. అంతేకాక కరోనా సోకిన వాళ్లకు కొన్ని మానసిక సమస్యలు కూడా తలెత్తాయి. దాంతో ఒక్కసారిగా అందరూ ఈ సమస్యపై దృష్టి సారించక తప్పలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో సైకియాట్రిస్టులు, సైకాలజిస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉందని తేలింది. రాష్ట్ర రాజధానిలో తప్ప జిల్లాల్లో ఈ కొరత విపరీతంగా ఉందని అర్థం అయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్లకు అసలు ఇలాంటి సమస్యలకు చికిత్సే అందని పరిస్థితి ఉందని అర్థమైంది. దాంతో ఆరోగ్య శాఖ హైదరాబాద్​లోని మెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కొందరు సాధారణ డాక్టర్లకు మానసిక సమస్యలపై పట్ల అవగాహన పెంచడం, వాటిని గుర్తించడం ఎలాగో నేర్పడం, ప్రాథమిక స్థాయి చికిత్స అందించడంలో ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఇది ఆచరణ రూపం దాల్చకుండానే ఆగిపోయింది. తర్వాత మానసిక సమస్యలకు చెక్ పెట్టేందుకు సర్కార్ టెలీ మానస్ అని ఒక సర్వీసు ప్రవేశపెట్టింది. ఎవరైనా మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్లు టెలీమానస్ టోల్ ఫ్రీ నెంబర్​కు ఫోన్ చేసి సలహా తీసుకోవచ్చు. తమ సమస్య తీవ్రతను తెలుసుకోవచ్చు. ట్రీట్​మెంట్ ఎలా పొందాలో సమాచారం తెలుసుకోవచ్చు. అయితే ఇది కూడా ఆశించినంత స్థాయిలో సక్సెస్ కావడం లేదు.