హుజూరాబాద్ బీఆర్ఎస్ క్యాడర్​లో గందరగోళం

హుజూరాబాద్ బీఆర్ఎస్ క్యాడర్​లో గందరగోళం

కరీంనగర్, వెలుగు: స్థానిక ఎమ్మెల్సీతో వెళ్లాలో.. పార్టీ ఇన్​చార్జీతో నడవాలో తెలియక హుజూరాబాద్ బీఆర్ఎస్ క్యాడర్​లో గందరగోళం నెలకొంది. బై ఎలక్షన్స్ లో అధికార పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఈటల రాజేందర్​పై ఓడిపోయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ నియోజవర్గం ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయనకు పార్టీలో ప్రయార్టీ తగ్గినట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు నెలల నుంచి పాడి కౌశిక్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో దూకుడు పెంచడం, తన అనుచరులతో మీటింగులు నిర్వహిస్తుండడం గెల్లు శ్రీనివాస్​ను ఆత్మరక్షణలో పడేసింది. గెల్లుకు ఇన్ చార్జి బాధ్యతలు ఇచ్చినట్లే ఇచ్చి.. అధిష్టానం ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ఎంకరేజ్ చేయడం పార్టీ శ్రేణుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. తాజాగా మంత్రి, అధికార పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్ హుజూరాబాద్​పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లను కౌశిక్​రెడ్డి అంతా తానై చూసుకోవడం గెల్లు శ్రీనివాస్ అనుచరులకు మింగుడు పడడం లేదు. ఇరువర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. 

రెండు గ్రూపులు.. రహస్య సమావేశాలు

కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరుతో కేడర్ కు నామినేటెడ్ పోస్టులు దక్కడం లేదు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఇచ్చిన హామీలతో చాలా మంది లీడర్లు ఈటల వెంట వెళ్లకుండా పార్టీలోనే ఉండిపోయారు. బై ఎలక్షన్స్​టైంలో చాలా మందికి మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీలు, కోఆప్షన్ మెంబర్లు తదితర నామినేటెడ్ పోస్టులు ఇస్తామని ఆశ చూపారు. గతేడాది మార్చి 23న ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి సూచించిన వారితో దేవస్థానం కమిటీని నియమించి, అందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ చేతుల మీదుగా అందజేశారు. దీనిపై నియోజకవర్గ ఇన్‌చార్జి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో నియామక ప్రక్రియ వాయిదాపడింది. తర్వాత అధికార పార్టీ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి రహస్య సమావేశాలు నిర్వహించారు. దీంతో పార్టీ అధిష్టానం నామినేటెడ్ పోస్టుల భర్తీ జోలికెళ్లడం లేదు. జమ్మికుంట, హుజూరాబాద్ మార్కెట్ కమిటీలు, దుబ్బ మల్లన్న టెంపుల్ కమిటీలు, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎంపిక నిలిచిపోయాయి. ఆధిపత్య పోరు కారణంగా తమకు పదవులు రాకుండాపోతున్నాయని సెకండరీ లీడర్ షిప్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఏడాది ముందే ఎన్నికల ప్రచారం

ఈటల రాజేందర్ రాజీనామాతో 2021 అక్టోబర్ లో హుజూరాబాద్ బై ఎలక్షన్స్​జరిగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సుమారు ఆర్నెళ్లపాటు నియోజకవర్గంలో వాడీవేడి ప్రచారం కొనసాగింది. ఏడాది తిరగకముందే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఎమ్మెల్సీ అయినా తనకు తృప్తి లేదని, వచ్చే హుజూరాబాద్ ఎన్నికల్లో ఎమ్మెల్యే అయినప్పుడే తనకు తృప్తి అని, ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ వీణవంక మండలం కొండపాకలో చేసిన కామెంట్స్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి. పార్టీ మీటింగ్ జరిగినా, ప్రెస్ మీట్ పెట్టినా కౌశిక్ రెడ్డి వచ్చే ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు. మంగళవారం నిర్వహిస్తున్న బహిరంగ సభతో బలప్రదర్శనకు దిగుతున్నట్లు తెలుస్తోంది. సభను సక్సెస్ చేసి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తనకే కన్ఫాం అనే మెసేజ్ జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా స్థానికంగా పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ మెడికల్ ట్రీట్ మెంట్ కోసం ఎన్వోసీలు, సీఎం రిలీఫ్ ఫండ్, ఆర్థిక పరమైన చెక్కులు ఇప్పించడం, పార్టీ కార్యకర్తల కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే పరామర్శించడం, పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్లి కలిసిరావడం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయాననే సానుభూతి ప్రజల్లో ఉందని, ఉద్యమకారుడిగా సీఎం కేసీఆర్ తనకే టికెట్ ఇస్తారని ఆయన ధీమాతో ఉన్నారు.

కౌశిక్​రెడ్డి సారథ్యంలో కేటీఆర్ సభ

ఇవాళ జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీ గ్రౌండ్​లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారు. సభకు నియోజకవర్గంలోని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, హుజూరాబాద్, కమలాపూర్ మండలాల నుంచి 50 వేల మంది జనాన్ని తరలించాలని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. సభకు సంబంధించి మండలాల్లో ఆయన నిర్వహిస్తున్న ప్రెస్ మీట్లు, సమావేశాల్లో ఎక్కడా గెల్లు శ్రీనివాస్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. జమ్మికుంటలోని అంబేద్కర్ సెంటర్, గాంధీ సెంటర్ తోపాటు బహిరంగ సభా స్థలి వద్ద కౌశిక్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో గెల్లు శ్రీనివాస్ ఫొటో గుర్తుపట్టలేనంత చిన్నసైజ్ లో వేయడం గమనార్హం. ఉద్దేశపూర్వకంగానే గెల్లును కౌశిక్ రెడ్డి దూరం పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన 10 రోజుల్లోనే ఎమ్మెల్సీ పదవి పొందిన కౌశిక్ రెడ్డి పెత్తనం.. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ లో పనిచేస్తున్న పలువురు నాయకులు, కార్యకర్తలకు రుచించడం లేదని తెలుస్తోంది.

తరచూ కౌశిక్​ కాంట్రవర్సీ కామెంట్స్

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రతిపక్ష నాయకుల దగ్గరి నుంచి గవర్నర్ వరకు తరచూ అందరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన కామెంట్స్ విపక్షాలకు ఆగ్రహం తెప్పిస్తుండగా.. బీఆర్ఎస్ నేతలు కూడా సమర్థించుకోలేని పరిస్థితి నెలకొంది. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారని, అసెంబ్లీ, కౌన్సిల్ లో పాస్ చేసిన బిల్లులు ఎందుకు దాస్తున్నారంటూ ఒక మహిళ అని కూడా చూడకుండా చేసిన అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిన దుమారం ఇంకా చల్లారలేదు. కౌశిక్​ను ఎమ్మెల్సీగా భర్తరఫ్ చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. జెండాను మోసేవాళ్లకే సంక్షేమ పథకాలు అంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మికుంటలో దళితబంధు పథకానికి ఇచ్చిన భూమి విషయంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఇబ్బందులు పెడుతున్నారని జెడ్పీ చైర్మన్ కనిమెళ్ల విజయ కన్నీరు పెట్టడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.