ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన్రు.. ఎంపీల సస్పెన్షన్ పై కాంగ్రెస్, లెఫ్ట్​ పార్టీల ఆందోళన

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన్రు.. ఎంపీల సస్పెన్షన్ పై కాంగ్రెస్, లెఫ్ట్​ పార్టీల ఆందోళన

పాలమూరు, వెలుగు: పార్లమెంట్​లో ఎంపీలను సస్పెన్షన్​ చేయడాన్ని కాంగ్రెస్, లెఫ్ట్​ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి కేంద్ర సర్కారు తీరును ఎండగట్టారు. పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీల ఎంపీలను సస్పెండ్  చేయడాన్ని నిరసిస్తూ మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో కాంగ్రెస్​ పార్టీ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్  మాట్లాడుతూ ప్రశ్నించే వారి గొంతు నొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని ఎన్డీఏ కూటమి ఖూనీ చేస్తోందన్నారు. 

దేశ చరిత్రలో పార్లమెంట్​లో ఒకేసారి 146  మంది ఎంపీలను బహిష్కరించిన ఘటన జరగలేదన్నారు. అప్రజాస్వామిక విధానాలు అవలంభిస్తున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని హెచ్చరించారు. ఎన్పీ వెంకటేశ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, లీడర్లు సీజే బెనహర్, వసంత, అమరేందర్​రాజు, సిరాజ్ ఖాద్రి, సాయిబాబా, రాములు యాదవ్, రాఘవేందర్ రాజు, లక్ష్మణ్ యాదవ్, సీపీఎం, సీపీఐ  లీడర్లు బాలకిషన్, రాములు, కురుమూర్తి, పరమేశ్వర్ గౌడ్  పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ టౌన్: బీజేపీ ఆప్రజాసామిక విధానాలను ఖండించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్  చేశారు. నాగర్ కర్నూల్  జిల్లా కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ చర్యలకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఏకం కావాలన్నారు. స్మోక్​ బాంబు ఘటనపై చర్చ జరగాలని, దోషులను శిక్షించాలని, దేశ భద్రతను కాపాడాలని ప్రతిపక్షాలు కోరుతున్నా సమాధానం ఇవ్వకుండా ప్రతిపక్షాల నోర్లు మూసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఆర్ శ్రీనివాస్, అశోక్, రామయ్య, తారాసింగ్, సత్యనారాయణ, శివ కురుమయ్య, శివరాం, రాఘవేందర్, మధు పాల్గొన్నారు.

పెబ్బేరు: పార్లమెంటులో ఎంపీల సస్పన్షన్​ను వ్యతిరేకిస్తూ యూత్  కాంగ్రెస్  ఆధ్వర్యంలో పట్టణంలోని సుభాష్​ చౌరస్తాలో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బ్లాక్  కాంగ్రెస్  అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ పార్లమెంట్ లో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యంపై బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. విజయవర్ధన్ రెడ్డి, వెంకట్రాములు, సాయితేజ, రాజు, సత్యనారాయణ, సర్వేశ్, వెంకటేశ్, సాగర్, సురేందర్ గౌడ్, శివ పాల్గొన్నారు.