లెఫ్ట్ పార్టీలకు 4 సీట్లు.. మరో 33 సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులు ఫైనల్!

లెఫ్ట్ పార్టీలకు 4 సీట్లు..  మరో 33 సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులు ఫైనల్!

న్యూఢిల్లీ, వెలుగు: మరో 33 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఫైనల్ అయినట్టు తెలిసింది. బుధవారం ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ ఆఫీసులో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) మీటింగ్ జరిగింది. ఇందులో పార్టీ అగ్ర నేతలు సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, మెంబర్లు మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క,ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12:45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన మీటింగ్ లో తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై కీలకంగా చర్చించారు. ఈ భేటీలో దాదాపు 33 స్థానాలపై క్లారిటీ వచ్చినట్టు తెలిసింది. అలాగే పొత్తులో భాగంగా సీపీఎం, సీపీఐకి చెరో రెండు సీట్లు కేటాయించాలని నిర్ణయించినట్టు సమాచారం. 

ఇందులో వైరాతో పాటు గతంలో రెండు, మూడుసార్లు లెఫ్ట్ పార్టీలు విజయం సాధించిన స్థానాలు ఉన్నట్టు తెలిసింది. కాగా, ఈ నెల 15న 55 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. ఇప్పుడు మరో 33 స్థానాలు, లెఫ్ట్ పార్టీలకు ఇచ్చే 4 సీట్లపై క్లారిటీ రావడంతో మొత్తం 92 స్థానాలకు అభ్యర్థులు ఫైనల్ అయినట్టేనని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. మిగిలిన 27 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు గురువారం ఉదయం 10 గంటలకు సీఈసీ మరోసారి భేటీ కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం కేసీ వేణుగోపాల్ నివాసంలో స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ 27 స్థానాలపై నేతలు చర్చించి, తుది జాబితాను తయారు చేసినట్టు సమాచారం. ఈ సీట్లపైనా క్లారిటీ వస్తే మొత్తం 60 మంది అభ్యర్థులతో గురువారం సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే కొన్ని స్థానాలు ఆపి, మిగతా స్థానాలకు ప్రకటించే చాన్స్ ఉంది.

తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్సే: ఖర్గే 

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ ను ఎన్నుకునేందుకు సిద్ధమయ్యారని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. దీనికి సీఈసీ మీటింగ్ వీడియోను జత చేశారు. ‘‘ఓటమి ఖాయం కావడంతో బీఆర్‌‌‌‌ఎస్ నేతలు కాంగ్రెస్ లీడర్లపై దాడులు చేస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం నేరాల్లో భాగస్వాములు. అబద్ధాలు, దోపిడీ, కమీషన్లు తప్ప.. ఆ పార్టీలు చేసిందేమీ లేదు” అని విమర్శించారు.