కాంగ్రెస్‌ చీఫ్‌గా గాంధీ కుటుంబీకులే ఉండాలి.. కార్యకర్తల డిమాండ్

కాంగ్రెస్‌ చీఫ్‌గా గాంధీ కుటుంబీకులే ఉండాలి.. కార్యకర్తల డిమాండ్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పుపై తీవ్ర చర్చ జరుగుతోంది. నాయకత్వ మార్పును కోరుతూ సీనియర్ లీడర్లు సోనియాకు లేఖ రాయడం వివాదాస్పదం అవుతోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో భాగంగా అధినేత్రి సోనియా పార్టీ నేతలతో వర్చువల్‌ కాన్ఫరెన్స్‌లో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో పలువరు సీనియర్ నేతలు బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారని సమాచారం. రాహుల్ వ్యాఖ్యలకు వివరణగా ఆరోపణలను నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని లేఖ రాసిన నేతల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్ బదులిచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా గాంధీ కుటుంబానికి చెందిన వారే ఉండాలని సోమవారం కొందరు పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేయడం గమనార్హం.

ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం ఎదుట పార్టీ కార్యకర్తలు గుమిగూడి గాంధీ స్లోగన్స్ చేశారు. ‘గాంధీ కుటుంబానికి చెందిన వారే ప్రెసిడెంట్‌గా ఉండాలని మేం కోరుకుంటున్నాం. ఇతరులు ఎవరైనా అధ్యక్షుడిగా ఉంటే పార్టీ ముక్కలుగా విడిపోయి నాశనమవుతుంది’ అని కాంగ్రెస్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న వారిలో ఒకరైన జగదీశ్ శర్మ చెప్పారు. ప్రెసిడెంట్‌ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, పార్టీకి కొత్త చీఫ్​ను మీరే కనుగొనాలని సదరు లేఖ రాసిన సీనియర్స్‌కు సోనియా చెప్పారని సమాచారం.