
న్యూఢిల్లీ, వెలుగు: లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు కొనసాగుతున్నది. సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) భేటీ జరిగింది. ఇందులో పార్టీ అగ్రనేత సోనియా, నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, సీఈసీ మెంబర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉత్తరాదికి చెందిన మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, నార్త్ ఈస్ట్ లోని అస్సాం రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు.
ఈ రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులతో సెకండ్ లిస్ట్ మంగళవారం రిలీజ్ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ లిస్ట్ లో తెలంగాణ అభ్యర్థుల పేర్లు ఉండకపోవచ్చని సమాచారం. అలాగే, ఈ నెల 13 న తెలంగాణలో మిగిలిన స్థానాలతోపాటు పలు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై సీఈసీ భేటీ కానున్నట్టు తెలిసింది.