కాళేశ్వరం పనికే వస్తలేదు.. కిస్తీలు ఎట్ల కడ్తం!

కాళేశ్వరం పనికే వస్తలేదు.. కిస్తీలు ఎట్ల కడ్తం!
  •     ప్రాజెక్టు దుస్థితిపై రుణ సంస్థలకు తెలియజేయాలని నిర్ణయం
  •     దీని ద్వారా ఇచ్చే నీళ్లకు పన్నులు వసూలు చేసే ఆలోచన లేదని స్పష్టం 
  •     చెల్లింపుల కోసం కొన్ని రోజులు వెసులుబాటు ఇవ్వాలని రుణ సంస్థలను అడగనున్న సర్కార్ 

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెచ్చిన అప్పులకు కిస్తీలు కట్టడంపై రాష్ట్ర సర్కార్​పునరాలోచిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ సంస్థల నుంచి రూ.వేల కోట్లు అప్పు తీసుకుని ప్రాజెక్టును నిర్మించడంతో.. ఆ అప్పులకు కిస్తీలు కట్టడం ప్రభుత్వానికి భారంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు బుంగలు పడ్డాయి. దీంతో కాళేశ్వరమే పనికిరాని స్థితిలో ఉండగా, దానికోసం తెచ్చిన అప్పులు మాత్రం కట్టుకుంటూ పోవాలా? అని ప్రభుత్వం ఆలోచనలో పడింది.

కిస్తీలు, వడ్డీల చెల్లింపులను కొంతకాలం ఆపే యోచనలో ఉన్నది. ప్రాజెక్టు ఇంకా పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదనే విషయాన్ని కూడా రుణ సంస్థలకు తెలియజేయాలని భావిస్తున్నది. ఫలితంగా గత బీఆర్ఎస్​ప్రభుత్వం ప్రజలపై ఎంత భారం మోపిందో? ఎంత దోపిడీకి పాల్పడిందో? అన్న విషయాలు తెలుస్తాయని అనుకుంటున్నది. అదే సమయంలో వడ్డీలపై పునఃసమీక్షించుకోవాలని కూడా రుణ సంస్థలను ప్రభుత్వం కోరనున్నట్టు తెలిసింది. సాధ్యమయ్యే పరిస్థితి కాకపోయినా ప్రత్యేక సందర్భాల్లో ఆ వెసులుబాటు ఉంటుందని అధికారులు అంటున్నారు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కిస్తీలు చెల్లించలేదు. దీనిపై ప్రభుత్వానికి ఆర్ఈసీ నుంచి నోటీసులు అందాయి. 

పన్నులు వసూలు చేయలేం.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పంప్‌హౌస్‌ల నిర్మాణానికి పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ), రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్ఈసీ) నుంచి దాదాపు రూ.69 వేల కోట్లు అప్పు తీసుకున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వ్యవసాయానికి ఇచ్చే సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు ఇచ్చే నీళ్లు, ప్రజలకు అందించే తాగునీటికి పన్నులు వసూలు చేసి అప్పులు కడుతామని రుణసంస్థలకు అప్పటి బీఆర్ఎస్ సర్కార్ చెప్పింది. కానీ కాళేశ్వరం నీళ్లతో ఇప్పటి వరకు నయా పైసా రాలేదు. అసలు ప్రాజెక్టు బ్యారేజీలే కూలిపోయే స్థితిలో ఉన్నప్పుడు.. వాటి ద్వారా ఇచ్చే నీళ్లకు పన్నులు వసూలు చేసే ఆలోచన లేదని ప్రభుత్వం స్పష్టం చేసినట్టు తెలిసింది.

ఒకవేళ మేడిగడ్డ బ్యారేజీని రిపేర్​ చేసి నీళ్లు తీసుకున్నా పన్నుల జోలికి వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది. అయితే ప్రతినెలా కట్టాల్సిన కిస్తీలకు రాష్ట్ర ఖజానా నుంచే జమ చేయాల్సి ఉన్నది. ఇప్పటికే రాష్ట్ర అప్పులు రూ.7 లక్షల కోట్లకు చేరడం, ఈ అప్పులకు సంబంధించి కిస్తీలు, వడ్డీల చెల్లింపులకే ఏటా దాదాపు రూ.70 వేల కోట్లు కట్టాల్సి వస్తున్నది. దీంతో కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున తీసుకున్న అప్పులు, వాటి వడ్డీ రేట్లపై పునఃసమీక్ష చేయాలని ఆర్ఈసీ, పీఎఫ్​సీతో పాటు ఇతర రుణ సంస్థలకు విజ్ఞప్తి చేయాలని సర్కార్ ఆలోచన చేస్తున్నది. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున భారం లేకుండా చెల్లింపులకు ఇతర మార్గాలు ఏమున్నాయనే దానిపైనా ఆర్థిక నిపుణలతో సంప్రదింపులు జరుపుతున్నది. కాగా, పీఎఫ్‌సీ అప్పులకు కిస్తీల చెల్లింపు ప్రక్రియ 2022 అక్టోబర్ నుంచి, ఆర్‌ఈసీకి 2023 జూన్‌ నుంచి ప్రారంభమైంది. 

రుణ సంస్థలకు కాళేశ్వరం డ్యామేజీ వివరాలు.. 

గత బీఆర్ఎస్​ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో ప్రజలపై మోపిన భారాన్ని అందరికీ తెలియజేయాలని సర్కార్ భావిస్తున్నది. ఈ అప్పుల వల్ల రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో తెలియజేస్తూ, ప్రతి అంశాన్ని పబ్లిక్​ డొమైన్ లో పెట్టనున్నట్టు చెబుతున్నది. అసలు కాళేశ్వరం నిర్మాణం శాస్ర్తీయంగా చేపట్టకపోగా, యుద్ధ ప్రాతిపదికన పనులు చేసినట్టు బిల్డప్​ఇచ్చి..  నిర్మాణం పూర్తికాకముందే ఓపెనింగ్​చేశారని పేర్కొంటున్నది. అప్పులు ఇచ్చిన సంస్థలకు కూడా ఈ విషయాలన్నీ తెలియజేయాలని భావిస్తున్నది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండా, పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాకుండా కిస్తీల చెల్లింపు సాధ్యమయ్యే పని కాదని చెప్పనున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కొంతకాలం పాటు వెసులుబాటు ఇవ్వాలని కోరే అవకాశం ఉందని సమాచారం. అదే విధంగా మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ, దానిపై జ్యుడీషియల్​ఎంక్వైరీ తదితర అంశాలను కూడా రుణ సంస్థల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిసింది.