ముడా కుర్చీ కోసం పోటాపోటీ .. రేసులో ముగ్గురు కాంగ్రెస్​ లీడర్లు

ముడా కుర్చీ కోసం పోటాపోటీ .. రేసులో ముగ్గురు కాంగ్రెస్​ లీడర్లు
  • మున్సిపాల్టీల్లోనూ అవిశ్వాసాలకు ముహూర్తాలు చూసుకుంటున్న నాయకులు
  • సంక్రాంతి తర్వాత తీర్మానాలు పెట్టే చాన్స్​

మహబూబ్​నగర్, వెలుగు: నామినేటెడ్​  పోస్టులు హాట్  కేకుల్లా మారాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ ప్రభుత్వం మారి కాంగ్రెస్​ రూలింగ్​లోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10న జీవో 1624ను జారీ చేసింది. దీంతో నామినేటెడ్​ పదవులు అన్నీ  రద్దయ్యాయి. అయితే ఈ పోస్టులను దక్కించుకునేందుకు కాంగ్రెస్​ పార్టీలో   పోటీ పెరుగుతోంది. ప్రధానంగా మహబూబ్​నగర్​ అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ (ముడా) కుర్చీ కోసం పోటాపోటీ నెలకొంది.

ముడా సీట్​ కోసం డిమాండ్..​

మహబూబ్​నగర్​ను అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ ఏప్రిల్​ 4, 2022న ఏర్పడింది. 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మహబూబ్​నగర్, జడ్చర్ల, భూత్పూర్​ మున్సిపాల్టీలతో పాటు 12 మండలాలు, 140కి పైగా గ్రామాలను ఇందులో చేర్చారు. చైర్మన్, వైస్​ చైర్మన్, 15   డైరెక్టర్​ పోస్టులు ఉండగా  వైస్​ చైర్మన్​గా మహబూబ్​నగర్ మున్సిపల్​ కమిషనర్​ వ్యవహరిస్తారు. ముడా ఏర్పడిన తర్వాత మొదటి చైర్మన్​గా గంజి వెంకన్నను గత ప్రభుత్వం నియమించింది. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రావడంతో కొత్త చైర్మన్​ ఎవరు అవుతారనే చర్చ జోరుగా సాగుతోంది.

చైర్మన్​ పదవి కోసం కాంగ్రెస్​లో పోటీ నెలకొన్నట్లు తెలిసింది. మూడు నియోజకవర్గాలతో చైర్మన్​ పదవి ముడిపడి ఉండడంతో చాలా మంది ఈ కుర్చీ కోసం పైరవీలు షురూ చేశారు. మార్కెట్​ కమిటీ మాజీ చైర్మన్​ అమరేందర్​ రాజు ఈ కుర్చీ కోసం పట్టుబడుతున్నట్లు  తెలిసింది. ఆయన భార్యా  కూడా మహబూబ్​నగర్​ మున్సిపల్​ చైర్​పర్సన్​గా పని చేశారు. దీంతో ముడా చైర్మన్​ కుర్చీని తమ ఫ్యామిలీకి కేటాయించాలనే డిమాండ్​ చేస్తున్నట్లు సమాచారం. అలాగే మహబూబ్​నగర్​ మున్సిపల్​ కౌన్సిలర్​ ఆనంద్​ గౌడ్​ కూడా ఈ పదవిని ఆశిస్తున్నట్లు తెలిసింది. మరో మున్సిపల్​ కౌన్సిలర్​ భర్త లక్ష్మణ్​ యాదవ్ కూడా చాలా కాలంగా పార్టీనే నమ్ముకొని ఉండడంతో తనకే పదవి ఇవ్వాలని కోరుతున్నట్టు చెప్పుతున్నారు. 

మున్సిపాల్టీల్లో అవిశ్వాసాలు..

జిల్లాలోని మూడు మున్సిపాల్టీల్లో అవిశ్వాసాల రచ్చ సాగుతోంది. మహబూబ్​నగర్​ మున్సిపాల్టీలో చైర్మన్​పై అవిశ్వాసం పెట్టేందుకు కౌన్సిలర్లు చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్​ పార్టీకి చెందిన కౌన్సిలర్​ ఒకరికి చైర్మన్​ సీట్​ ఇప్పించాలనే యోచనలో మిగతా కౌన్సిలర్లు ఉన్నట్లు సమాచారం. భూత్పూర్ మున్సిపాలిటీలోనూ అవిశ్వాస తీర్మానానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పాలకమండలిలోని సభ్యులు ఇతర దందాలు చేయడం వల్లే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్  పార్టీకి నష్టం జరిగిందని టాక్ నడుస్తోంది.

ఈ క్రమంలో కొందరు అసంతృప్త కౌన్సిలర్లు పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్లాలని చూస్తున్నట్టు తెలిసింది. ఇందులో కొందరు  కాంగ్రెస్ పార్టీ నుంచి  కౌన్సిలర్లుగా గెలుపొందిన వారున్నారు.  వారు తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు మంతనాలు జరుగుతున్నట్టు సమాచారం. వారితోపాటు మెజార్టీ కౌన్సిలర్లను కాంగ్రెస్​లోకి తీసుకెళ్లేందుకు పార్టీ లీడర్లు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. జడ్చర్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. కొద్ది రోజుల కింద అవిశ్వాసంపై కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డితో చర్చించినట్లు తెలిసింది. కానీ, ఆయన ఇందుకు ఒప్పుకోకపోవడంతో వారు పార్టీ మారైనా సరే అవిశ్వాసం పెట్టాలనే ప్లాన్​లో ఉన్నారు. దీనికితోడు లక్ష్మారెడ్డి ఓడిపోవడానికి కొందరు కౌన్సిలర్లే కారణమనే టాక్​ నడుస్తోంది.

సంక్రాంతి తర్వాతే ముహూర్తం..

ప్రస్తుతం ముహూర్తాలు సరిగా లేకపోవడంతో అవిశ్వాస తీర్మానాలు పెట్టడానికి లీడర్లు ముందుకు రావడం లేదు. ఈ నెలతో పాటు జనవరి వరకు మూఢం ఉండడంతో కౌన్సిలర్లతో చర్చలు మాత్రమే జరుపుతున్నారు. అవిశ్వాసం ప్రవేశపెట్టినప్పుడు తమకు సపోర్ట్​గా ఉండాలని కౌన్సిలర్లతో హామీలు తీసుకుంటున్నారు. మూఢం ముగిశాక అవిశ్వాస తీర్మానాలు పెట్టేందుకు కొందరు లీడర్లు తేదీలు వెతుకుతున్నట్లు తెలిసింది.