కాగ్ రిపోర్టుపై సర్కార్ యాక్షన్!

కాగ్ రిపోర్టుపై సర్కార్ యాక్షన్!
  • కాగ్ రిపోర్టుపై సర్కార్ యాక్షన్!
  • నివేదికలో పేర్కొన్న అంశాలపై చర్యలు తీసుకోవాలని యోచన
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఎత్తిచూపిన కాగ్
  • ప్రతి అంశంపై పక్కాగా లెక్కలతో రిపోర్టు 
  • వాటినే ఆధారాలుగా తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం
  • ఇప్పటికే అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు  

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొన్ని శాఖల్లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్​ఎంక్వైరీకి ఆదేశించింది. మరికొన్ని శాఖల్లో జరిగిన వ్యవహారాలపై ఇంటర్నల్​రిపోర్టులు తెప్పించుకుంటున్నది. తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇచ్చిన రిపోర్టుపై దృష్టిపెట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను కాగ్ ఎత్తిచూపగా... ఆ రిపోర్టును ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇప్పుడా నివేదికలో పేర్కొన్న అంశాలపై పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకుంటున్నది. గతంలో కాగ్ ఇచ్చిన రిపోర్టులను కూడా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. వీటి ఆధారంగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది.

కాగ్ వెల్లడించే అంశాలు పూర్తిగా పక్కా ఆధారాలతో ఉంటాయి కాబట్టి.. త్వరగా యాక్షన్​ తీసుకోవడంతో పాటు న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఒక్కో డిపార్ట్​మెంట్​కు సంబంధించి కాగ్ ఏమేం గుర్తించింది? నిధుల దుర్వినియోగం ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అందులో ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రమేయం ఎంత వరకు ఉన్నది? అనే దానిపై నివేదికలు సిద్ధం చేస్తున్నది. నిధుల మళ్లింపు, దుర్వినియోగం ఏ రకంగా జరిగిందనేది గుర్తిస్తున్నది.​ కాగ్ రిపోర్టును కేవలం అసెంబ్లీలో పెట్టి వదిలేయడం కాదని, అందులో పేర్కొన్న ప్రతిదానిపైనా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. 

ప్రాజెక్టులపై ఫోకస్.. 

ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు, వివిధ నిర్మాణాలు, పథకాల అమలు, రోడ్ల కాంట్రాక్టులు తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటికే కాళేశ్వరంపై విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తున్నది. మిషన్​ భగీరథపైనా విచారణ చేయిస్తున్నట్టు తెలిసింది. కాళేశ్వరంపై కాగ్​ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడా రిపోర్టులోని వివరాలను ఆధారాలుగా తీసుకోవాలని నిర్ణయించింది. చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కాగ్​రిపోర్ట్​పక్కా ఎవిడెన్స్​గా ఉంటుందని భావిస్తున్నది.

ఇక రోడ్ల కాంట్రాక్టులు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, సెక్రటేరియెట్, యా దాద్రి టెంపుల్, జిల్లా సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం తదితర అంశాలపైనా నివేదికలు తెప్పించుకుంటున్నది. ఆసరా, డబుల్​బెడ్రూం ఇండ్లు, గొర్రెల పంపిణీ, మైనింగ్​దందా, మున్సిపల్​అడ్మినిస్ర్టేషన్ అండ్​అర్బన్​డెవలప్​మెంట్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలలో జరిగిన అవినీతి అక్రమాలపైనా ఫోకస్ పెట్టింది. అందులో గత ప్రభుత్వంలోని పెద్దలు ఎవరెవరు ఉన్నారనే దానిపై వివరాలు సేకరిస్తున్నది. కాగ్​రిపోర్టును సమగ్రంగా అధ్యయనం చేసి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నది.