డీపీఆర్ లేకుండానే రూ. 25 వేల 49 కోట్లు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కడిగేసిన కాగ్

డీపీఆర్ లేకుండానే  రూ. 25 వేల 49 కోట్లు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కడిగేసిన కాగ్
  •  కాళేశ్వరంతో 50 వేల ఎకరాల ఆయకట్టు తగ్గింది
  • భూకంప జోన్ లో మల్లన్న సాగర్ నిర్మాణం
  • డీపీఆర్ లో 63,352 కోట్లు చూపి 1,06,000 కోట్ల కు అంచనా వ్యయం పెంపు
  • ప్రాజెక్టు పూర్తయ్యే వరకు 1,47,427 కోట్ల ఖర్చు
  • ప్రాజెక్టు వార్షిక ఖర్చులనూ తక్కువ  చూపారు
  • కాళేశ్వరం నీళ్ల అమ్మకం పేరుతో 15 బ్యాంకుల నుంచి 87 వేల కోట్ల అప్పునకు ఒప్పందం
  • అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టిన సర్కారు

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ లేకుండానే గత ప్రభుత్వం  రూ. 25,049 కోట్లును నిర్మాణ సంస్థకు అప్పగించిందని కాగ్ పేర్కొంది. ఇవాళ అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాళేశ్వరంలోని లోపాలపై కాగ్ అక్షింతలు వేసింది. ప్రాజెక్టు ద్వారా లాభం జరగకపోగా 50 వేల ఎకరాల ఆయకట్టు తగ్గిందని పేర్కొన్నది. డీపీఆర్ లో 63,352 కోట్లు ఖర్చవుతుందని చెప్పిన గత ప్రభుత్వం.. దానిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోయిందని, 1,06,000 కోట్ల రూపాయల అంచనా వ్యయం వరకూ తీసుకెళ్లిందని తెలిపింది. ప్రాజెక్టు మొత్తం పూర్త్యే వరకు 1,47,427 కోట్ల ఖర్చవుతుందని పేర్కొంది. ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించిన వార్షిక వ్యయాలను తక్కువగా చూపిందని తెలిపింది. 

కాళేశ్వరం నీళ్లు అమ్ముతామని అప్పులు

కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని అమ్మడం ద్వారా ప్రభుత్వం ఏటా 1,019 కోట్ల ఆదాయాన్ని అర్జిస్తుందని పేర్కొన్నారని నివేదిక తెలిపింది. అప్పుల రీ పేమెంట్ కు ఇండస్ట్రీస్, తాగునీరు, ఫిషరీస్ ద్వారా ఆదాయం వస్తుందని చెబుతూ.. 15 బ్యాంకుల నుంచి 87 వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొనేందుకు ఒప్పందం కుదుర్చుకుందని వివరించింది. ప్రస్తుతం ఈ అప్పులు, తీర్చేందుకు కొత్తగా రుణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. 

ఏటా 14 ,462 కోట్ల వడ్డీ

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కో సం ప్రభుత్వం 87,449 కోట్లు అప్పుగా తీసుకొందని కాగ్ తెలిపింది. డీపీఆర్ తర్వాత కూడా మార్పులు చేశారని చెప్పింది.  ఒక్కో పనికి అనుమతి ఇస్తూ పోయిందని, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పోరేషన్ పేరుతో అప్పులు తెచ్చిందని వివరించింది. 87,449 కోట్ల రుణాలు తెచ్చింది ప్రభుత్వం..  బడ్జెట్ నుండి వచ్చింది కేవలం 27 శాతం మాత్రమే కేటాయింపులు చేసిందని చెప్పింది. ఒక టీఎంసీ నీటితో సాధారణంగా 10 వేల ఎకరాల్లో పంట సాగు చేయవచ్చు. కానీ కాళేశ్వరం నీటితో 17668 ఎకరాల ఆయకట్టు వస్తుందని అంచనా వేసిందని వివరించింది.   కాళేశ్వరం పనుల్లో 56 పనుల్లో 13 పూర్తి అయ్యాయని, వీటి ద్వారా 14 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చిందని చూపిందని తెలిపినట్టు కాగ్ పేర్కొంది. 

9 అగ్రిమెంట్లు వాయిదా.. ఫండ్స్ డైవర్షన్

కాళేశ్వరం రుణాల చెల్పింపు వాస్తవానికి 2020–2021లో ప్రారంభం కావాల్సి ఉంది. వాటితో 9 అగ్రిమెంట్లను వాయిదా వేయాలని కోరిందని కాగ్  తెలిపింది. దీంతో వడ్డీల భారం 8182 కోట్లు అదనంగా పడిందని వివరించింది. కాళేశ్వరం పేరిట తెచ్చిన 1690 కోట్ల అప్పును వేరే పథకాలకు మళ్లించిందని తెలిపింది. ఈ కారణంగా 587 కోట్ల రూపాయల భారం పడిందని వివరించింది.  

కాళేశ్వరం బాకీ 2036లో తీరుతది

కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను రూ. 63,352 కోట్ల నుంచి 1.06 లక్షల కోట్లకు పెంచారని, కాగ్ వెల్లడించింది. ప్రాజెక్టుకోసం భారీగా అప్పులు తీసుకొన్నారన్న కాగ్ వీటిని తీర్చడానికి కొత్త అప్పులు చేయల్సిన  పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. ఈ అప్పు 2036లో కాళేశ్వరం కోసం తీసుకున్న తీరుతుందని తెలిపింది. 

భూకంప జోన్ లో మల్లన్న సాగర్

50 టీఎంసీల కెపాసిటీ తో నిర్మించిన మల్లన్నసాగర్ భూకంప జోన్ లో ఉన్నట్టు కాగ్ పేర్కొంది. ఆ ప్రాంతంలో ఎన్ జీఆర్ఐ ప్రాథమిక సర్వేలో డీప్ సీటెడ్ వెర్టికల్ ఫాల్ట్ (లోతులో నిటారు పగుళ్లు) ఉన్నట్టుగా తేలిందని,  ఇక్కడ భూపంక ప్రభావంపై స్టడీ చేయకుండానే రూ.6,126.80 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు కట్టారని తెలిపింది.