పిచ్చోళ్ల వ్యాఖ్యలపై స్పందించాల్సిన పనిలేదు

పిచ్చోళ్ల వ్యాఖ్యలపై స్పందించాల్సిన పనిలేదు
  • దీదీ కామెంట్స్ పై అదిర్ రంజన్ కౌంటర్

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. బీజేపీ ఏజెంట్ అంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అదిర్ రంజన్ ధ్వజమెత్తారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆ పార్టీ విశ్వసనీయతను కోల్పోయిందని, బీజేపీపై పోరాడేందుకు కాంగ్రెస్ పై ఆధారపడలేమని దీదీ (మమత) చేసిన కామెంట్స్ కు అదిర్ రంజన్ కౌంటర్ ఇచ్చారు. పిచ్చోళ్ల కామెంట్స్ పై స్పందిచండం సరికాదంటూనే కాంగ్రెస్ బలం గురించి చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 700 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, దీదీకి ఆ బలం ఉందా అని ప్రశ్నించారు. దేశంలోని అన్ని ప్రతిపక్షాలకు ఉన్న ఓట్ షేర్ లో ఒక్క కాంగ్రెస్ కే 20 శాతం ఉందని, ఇంత ఓటింగ్ శాతం ఆమెకు ఉందా అని అదిర్ రంజన్ నిలదీశారు. బీజేపీని మెప్పించేందుకే మమత మాట్లాడుతున్నారని, ఆమె ఆ పార్టీకి ఓ ఏజెంట్ లా ప్రవర్తిస్తున్నారని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ లేకుండా మమతా బెనర్జీ లాంటి వాళ్లు లేరని, ఈ విషయాన్ని ఆమె గుర్తుంచుకోవాలని అదిర్ రంజన్ అన్నారు. గోవాలో తృణమూల్ పోటీ చేసిందే బీజేపీ కోసమని, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసి బీజేపీ మెప్పు పొందడమే దీదీ లక్ష్యమని అన్నారు. తృణమూల్ కారణంగానే గోవాలో కాంగ్రెస్ నష్టపోయిందని, ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు.

 

కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింట బీజేపీ గెలవగా, మరో రాష్ట్రంలో ఆప్ విజయం సాధించింది. దీనిపై నిన్న మమతా బెనర్జీ మాట్లాడుతూ.. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు ఆ పార్టీకే పెద్ద నష్టమన్నారు. ఈ ఎన్నికల ప్రభావం 2024 పార్లమెంట్ ఎన్నికలపై ఉంటుందనుకోవడం భ్రమేనని అన్నారు. ఈవీఎంల చోరీలు, అక్రమాలు చాలా జరిగాయని, సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ బాధపడాల్సిన పని లేదని, ఆయన ఈవీఎం ఫోరెన్సిక్ టెస్టింగ్ కోరాలని సూచించారు. సమాజ్ వాదీ ఓటింగ్ షేర్ 20 శాతం నుంచి 37 శాతానికి పెరిగిందని దీదీ చెప్పారు. బీజేపీపై పోరాడాలనుకునే పార్టీలన్నీ ఏకతాటిపై నడవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతను కోల్పోతోందని, ఆ పార్టీపై ఆధారపడలేమని దీదీ అభిప్రాయపడ్డారు. తృణమూల్ పార్టీ గోవాలో తొలిసారి పోటీ చేస్తూనే 6 శాతం ఓట్లు సాధించిందని, మూడు నెలల వ్యవధిలోనే ఈ మాత్రం సాధించడమే గొప్ప అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా

ఉద్యోగులకు షాకిచ్చిన ఈపీఎఫ్ఓ

బీబీనగర్ ఎయిమ్స్ తెలంగాణ గౌరవ చిహ్నం