పెద్దపల్లిలో కాంగ్రెస్​ దూకుడు... భారీ మెజార్టీ వస్తుందని కాంగ్రెస్​ ధీమా

 పెద్దపల్లిలో కాంగ్రెస్​ దూకుడు... భారీ మెజార్టీ వస్తుందని కాంగ్రెస్​ ధీమా
  • గడ్డం వంశీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి శ్రీధర్​బాబు, ఎమ్మెల్యేలు
  • భారీ మెజార్టీ వస్తుందని కాంగ్రెస్​ ధీమా
  • ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఓడి డీలా పడిన బీఆర్ఎస్​
  • క్యాడర్​ చేజారడంతో ఆశలు వదిలేసుకున్న ‘కొప్పుల’ 
  • గ్రూపు తగాదాలతో వెనకబడిన బీజేపీ

పెద్దపల్లి, వెలుగు :  పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ జోష్​ కనిపిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ గెలుపును  మంత్రి శ్రీధర్​బాబు, ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన నియోజకవర్గ మీటింగులు సక్సెస్​కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏడింటికి ఏడు సెగ్మెంట్లను క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్, ఈ సారి భారీ విజయంపై కన్నేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏడింటికి గాను ఆరు సెగ్మెంట్లను గెలుచుకున్న  బీఆర్ఎస్ అదే ఊపులో 2019 పార్లమెంట్​ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ సీటు తన ఖాతాలో వేసుకుంది. కానీ, ప్రస్తుతం ఏడు ఆసెంబ్లీ స్థానాలను కోల్పోయిన గులాబీ పార్టీ పూర్తిగా డీలా పడింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ కాంగ్రెస్ పార్టీలో చేర డంతో పార్లమెంట్​ స్థానంపై ఆశలు దాదాపు వదిలేసుకుంది. ఇక బలమైన క్యాడర్ లేకపోవడం, గ్రూపు తగాదాలు బీజేపీకి మైనస్​గా మారాయి. 

మంత్రి సారథ్యంలో జోరుగా ప్రచారం..

కాంగ్రెస్​ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపును మంత్రి శ్రీధర్​బాబు, ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీలో సీనియర్​గా, రాజకీయ చతురత ఉన్న నేతగా పేరున్న శ్రీధర్​బాబు పక్కా వ్యూహం ప్రకారం ప్రచారం చేస్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పోయిస్తున్నారు.  ముందుగా నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో శ్రీధర్​బాబు సక్సెస్ అయ్యారు. ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు,  చింతకుంట విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్​కుమార్​,  గడ్డం వినోద్, వివేక్ వెంకటస్వామి, మక్కాన్​సింగ్ ​ఠాకూర్​లతో  హైదరాబాద్​లోని  ప్రేమ్​సాగర్​రావు ఇంట్లో భేటీ ఏర్పాటు చేశారు. హైకమాండ్ ఆదేశాలు అందరికీ శిరోధార్యమని ప్రకటించి, తామంతా ఏకతాటిపై ఉన్నామన్న  సంకేతాలు పంపారు. దీంతో స్థానికంగా ఉన్న నేతలు, కార్యకర్తల్లో అప్పటివరకున్న అపోహలు తొలగిపోయాయి. ఆ వెంటనే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేశారు. ముందుగా ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు ఆధ్వర్యంలో మంచిర్యాలలో  పెట్టిన మీటింగ్ గ్రాండ్ సక్సెస్ కావడంతో నాయకులు, కార్యకర్తలకు బూస్టింగ్ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా మిగతా నియోజకవర్గాల్లో నిర్వహించిన మీటింగులు విజయవంతమయ్యాయి. గోదావరిఖనిలో జరిగిన ఐఎన్టీయూసీ మీటింగ్​లో సింగరేణి కార్మికులు హస్తానికి జై కొట్టారు. కోల్​బెల్ట్​లో ప్రభావం కలిగిన వామపక్ష పార్టీలు, అనుబంధ సంఘాలు సైతం అసెంబ్లీ ఎన్నికల నాటి అవగాహనకే కట్టుబడి ఉన్నామని ప్రకటించడం విశేషం. దీంతో కాంగ్రెస్ ​శ్రేణులు సమరోత్సాహంతో ఏడు నియోజకవర్గాల్లో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. 

వివిధ కులసంఘాల మద్దతు.. 

 గడ్డం వంశీ కృష్ణను కాంగ్రెస్​అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి వివిధ ప్రజా, కులసంఘాలు ఆయనకు మద్దతు పలుకుతున్నాయి. ఇటీవల మందమర్రి, బెల్లంపల్లి, మంచిర్యాల, పెద్దపల్లిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాల్లో మాదిగ, మాల, నేతకాని సంఘాల నాయకులు  గడ్డం వంశీకృష్ణకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పెద్దపల్లి నుంచి ‘మహనీయుల ఆశయ సాధన సంఘం’ వ్యవస్థాపక అధ్యక్షుడు బొంకూరు కైలాసం నేతృత్వంలో ఆ సంఘంతో పాటు అనుబంధ విభాగాలు, మాల, మాదిగ , నేతకాని సంఘాల ప్రతినిధులు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు  మూకుమ్మడిగా గడ్డం వంశీతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. నేతకాని కార్పొరేషన్​ ఏర్పాటు, హైదరాబాద్​లో నేతకాని భవన్​ నిర్మాణం కోసం ఎమ్మెల్యే వివేక్​ సీఎం రేవంత్​ను ఒప్పించడంతో ఆ సామాజికవర్గం ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్​కు పడ్తాయని భావిస్తున్నారు. అటు సింగరేణి, దాని అనుబంధ సంస్థల్లో కొత్త ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తానని, పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తానని హామీ ఇస్తున్న వంశీకృష్ణకు నిరుద్యోగులు, యువత, సింగరేణి కార్మికుల నుంచి మంచి స్పందన వస్తోంది. 

ఓటమి నుంచి తేరుకోని బీఆర్ఎస్​..

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి బీఆర్​ఎస్​ ఇంకా తేరుకోలేదు. ఓటమి తర్వాత పెద్ద ఎత్తున గులాబీ క్యాడర్ కారు దిగడంతో ఆ పార్టీ డీలా పడింది. ఉన్న కొద్దిపాటి క్యాడర్ కు మనోధైర్యం కల్పించాల్సిన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలంతా మొహం చాటేశారు. కాంగ్రెస్​ దూకుడుకు గెలుపుపై ఆశలు వదిలేసుకున్న బీఆర్ఎస్​ నేతలు సొంత కార్యకలాపాల్లో మునిగి, క్యాడర్​కు కనీసం టచ్ లోకి కూడా రావడం లేదు. దీంతో బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ​దాదాపు ఒంటరి పోరాటం చేస్తున్నారు. సీనియర్​ నేత కావడం, కోల్​బెల్ట్​లోని కార్మిక సంఘాల నేతలతో మంచి పరిచయాలు ఉండడం ఆయనకు ప్లస్​. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రిగా ఉండి కూడా సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం మైనస్​.

బీజేపీ ప్రభావం అంతంతే.. 

పెద్దపల్లి నియోజకవర్గంలో బీజేపీ ప్రభావం అంతంతే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మంచిర్యాలలో తప్ప ఎక్కడా ఆ పార్టీకి డిపాజిట్ ​దక్కలేదు. నియోజకవర్గం మొత్తం మీద ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 6.5 శాతం మాత్రమే. సంస్థాగతంగా బలంగా లేకపోవడం ఆ పార్టీకి ప్రతికూలాంశం. కాకపోతే మోదీ ఇమేజ్, హిందూత్వ, అయోధ్య రామాలయ నిర్మాణం, ఇతరత్రా జాతీయ అంశాలు కలిసివస్తాయని  బీజేపీ నేతలు ఆశిస్తున్నారు.  కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన గోమాస శ్రీనివాస్​కు బీజేపీ హైకమాండ్​ టికెట్​ ఇచ్చింది. కానీ, పార్టీలో ఉన్న వర్గ పోరు శ్రీనివాస్ కు తలనొప్పిగా తయారైంది.