అంబర్ పేట​లో టఫ్ ఫైట్  .. ఈసారైనా ఖాతా తెరవాలని కాంగ్రెస్  ప్రయత్నాలు

అంబర్ పేట​లో టఫ్ ఫైట్  .. ఈసారైనా ఖాతా తెరవాలని కాంగ్రెస్  ప్రయత్నాలు
  • సిట్టింగ్ స్థానం కాపాడుకునేందుకు బీఆర్ఎస్.. 
  • చేజారిన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ..

హైదరాబాద్, వెలుగు: అంబర్​పేటలో ఈసారి టఫ్​ఫైట్​కనిపిస్తున్నది. సిట్టింగ్​స్థానం కాపాడుకోవాలని బీఆర్ఎస్, చేజారిన స్థానాన్ని మళ్లీ దక్కించుకోవాలని బీజేపీ, ఈసారైనా ఖాతా తెరవాలని కాంగ్రెస్​ప్రయత్నాలు చేస్తున్నాయి. హైదరాబాద్​లోని ప్రధాన అసెంబ్లీ సెగ్మెంట్లలో అంబర్​పేట్ ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి కేంద్రమంత్రి గంగాపురం కిషన్​రెడ్డి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ఎన్నికల్లో కిషన్​రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ విజయం సాధించారు.

దీంతో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి బీజేపీకి కంచుకోటగా ఉన్న అంబర్​పేట్ బీఆర్ఎస్ చేతిలోకి వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ నుంచి చివరి సారిగా1989లో పూర్వ నియోజకవర్గమైన హిమాయత్ నగర్ లో వి. హనుమంతరావు గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు, మూడో స్థానాలకే పరిమితమవుతూ వస్తున్నది. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాలేరు వెంకటేష్, బీజేపీ నుంచి మాజీ మంత్రి కృష్ణ యాదవ్, కాంగ్రెస్ నుంచి రోహిన్ రెడ్డి బరిలో ఉన్నారు. అంబర్ పేట్​అభివృద్ధి, ఆయా వర్గాల ఓట్లే లక్ష్యంగా ఈ మూడు పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

కాలేరుకు ఇంటిపోరు...

2018 ఎన్నికల్లో కాలేరు వెంకటేష్ కిషన్​రెడ్డిపై అతిస్వల్ప మెజారిటీతో గెలిచారు. కాలేరుకు 61,558 ఓట్లు వస్తే, కిషన్ రెడ్డికి 60, 542 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఎంఐఎం బీఆర్ఎస్​కు మద్దతు ఇవ్వడం, కాంగ్రెస్ టీజేఎస్​కు మద్దతు ఇవ్వడంతో కాలేరు గెలుపు సులభమైంది. ప్రస్తుతం కాలేరుకు ఇంటిపోరు ఎక్కువైంది. సొంతపార్టీ నాయకులే కాలేరుకు సహకరించడం లేదనే ప్రచారం జరుగుతోంది.

నియోజకవర్గ ఇన్​చార్జి ఎడ్ల సుధాకర్ రెడ్డి, గోల్నాక కార్పొరేటర్ లావణ్య భర్త దూసరి శ్రీనివాస్ గౌడ్, నల్లకుంట మాజీ కార్పొరేటర్ భర్త గరిగంటి రమేశ్  మరికొందరు కాలేరును వ్యతిరేకిస్తున్నారు. వీరు పూర్తి స్థాయి ప్రచారంలో పాల్గొంటారా లేదా అనే అనుమానం కార్యకర్తల్లో నెలకొంది. అయితే ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వీళ్ల పంచాయితీ మంత్రి కేటీఆర్ దాకా పోయినట్లు సమాచారం. చే నంబర్ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా కాలేరుకు కంటిలో నలుసుగా మారింది. సంవత్సరాలు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో స్థానికులు అసహనానికి లోనవుతున్నారు. 

అయితే నియోజకవర్గంలో తనదైన ముద్ర వేయడానికి కాలేరు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని అస్త్రంగా చేసుకొని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారు. గెలుపే లక్ష్యంగా ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నారు. ఇటీవల అంబర్​పేట్​శంకర్, పలువురు బీజేపీ నేతలను బీఆర్ఎస్​లో చేర్చుకున్నారు.  అయితే గత ఎన్నికల్లో మైనారిటీలు, కాంగ్రెస్ ఓట్లతో నెట్టుకొచ్చిన కాలేరుకు ఈ సారి బీజేపీ, కాంగ్రెస్ నుంచి  గట్టిపోటీ తప్పేలా లేదు.

గెలుపుపై ధీమాగా బీజేపీ

బీజేపీ నుంచి మాజీ మంత్రి  కృష్ణ యాదవ్ బరిలో ఉన్నారు. 20 ఏండ్ల తర్వాత ఆయన మళ్లీ రాజకీయాల్లోకి ప్రవేశం చేస్తున్నారు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కంచుకోటగా ఉన్న బీజేపీకి సాంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. దీంతో ఆపార్టీ గెలుపుపై ధీమాగా ఉంది. అయితే కృష్ణ యాదవ్  ఆ ఓటు బ్యాంకుకు గండిపడకుండా చూసుకుంటారా అనేది కీలకంగా మారింది. సెగ్మెంట్​లోని సొంత పార్టీ నేతలే అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు, మాజీ కార్పోరేటర్ వనం రమేశ్ తదితరులు అంబర్​పేట్ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ   పార్టీలో చేరిన కృష్ణ యాదవ్ కే అధిష్టానం టికెట్ ఇచ్చింది. దీంతో వారు హైకమాండ్ పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

అసమ్మతులను కలుపుకొని, ఆయన గెలుపు కోసం కాస్త కష్టపడితే ఫలితం ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈసారి బీజేపీ సాంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు బీసీ ఓట్లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఓసీ నేతలను పక్కన పెట్టి బలమైన బీసీ నేతగా పేరున్న కృష్ణ యాదవ్ కు టికెల్ ఇచ్చింది. ఈ సెగ్మెంట్​లో బీసీల జనాభా ఎక్కువే ఉండటంతో బీజేపీ గెలుపుపై ఆశలు పెట్టుకుంది. బీజేపీ సాంప్రదాయ ఓటు బ్యాంకు, బీసీలు, సెగ్మెంట్​లో కుంటుపడిన అభివృద్ధి బీజేపీకి ప్లస్ పాయింట్స్ గా చెప్పొచ్చు.

అయితే 2009, 2014 ఎన్నికల్లో కిషన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచి తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. 2014లో ఎంఐఎం, కాంగ్రెస్ బరిలో ఉన్నప్పటికీ 60 వేలకు పైగా మెజారిటీతో కిషన్ రెడ్డి గెలుపొందారు. కానీ 2018లో అతి స్వల్ప తేడాతో కాలేరు చేతిలో ఓడారు. అనంతరం సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేసి గెలిచి, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఈసారి కిషన్ రెడ్డి అసెంబ్లీకి పోటీ చేయనని ప్రకటించడంతో కృష్ణ యాదవ్ కు టికెట్ దక్కింది. 

కాంగ్రెస్ బోణి కొడుతుందా?

అంబర్​పేట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రోహిన్ రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్​లో బలమైన నేతగా రోహిన్​ కు పేరుంది.  కానీ నియోజకవర్గానికి మాత్రం ఆయనది కొత్త మొహం. సెగ్మెంట్ లో ప్రతి ఎన్నికల్లో రెండు, మూడు స్థానాల్లో నిలుస్తూ వస్తున్న కాంగ్రెస్​ఈ సారి ఇక్కడ పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్​నుంచి పోటీ చేసిన వీహెచ్ కు 16 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం కాంగ్రెస్​కు వీస్తున్న సానుకూల పవనాలతో పాటు, సెగ్మెంట్​లో బీఆర్ఎస్​, బీజేపీలపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్​కు కలిసొచ్చే అంశాలుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 

అయితే రోహిన్​రెడ్డి స్థానికుడు కాకపోవడం, స్థానిక నేతలు గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ నిర్మాణాన్ని గాలికి వదిలేయడం మైనస్​పాయింట్లుగా చెప్పవచ్చు. పార్టీలోని కొందరు అసంతృప్తులు రోహిన్​కు కంటిలో నలుసుగా మారగా, రోహిన్​మాత్రం వీహెచ్, రోహిత్​ లాంటి నాయకులను కలుపుకొని ప్రచారంలో దూసుకుపోతున్నారు.