కాంగ్రెస్ కు మళ్లీ ఝలక్.. జమ్మూలో అసమ్మతి నేతల భేటి

కాంగ్రెస్ కు మళ్లీ ఝలక్.. జమ్మూలో అసమ్మతి నేతల భేటి

దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగిన కొన్ని రోజులకే కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలు ఝలక్ ఇచ్చారు. గతంలో పార్టీని ప్రక్షాళన చేయాలని సోనియా గాంధీకి లేఖ రాసిన G-23 నేతల్లో కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్, భూపీందర్ సింగ్ హుడా, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ లాంటి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తామంతా కలసి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు కపిల్ సిబల్. గులాం నబీ ఆజాద్ కు మరోసారి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు నేతలు. ఆజాద్ అనుభవాన్ని కాంగ్రెస్  ఎందుకు ఉపయోగించుకోవడంలేదో అర్థం కావడంలేదన్నారు సిబల్. 1950 తర్వాత జమ్మూకశ్మీర్ నుంచి రాజ్యసభ  రిప్రజేంటేషన్ లేకపోవడం ఇదే ఫస్ట్ టైమ్ అన్నారు ఆనంద్ శర్మ.  పార్టీ బలపడాలనే ఉద్దేశంతోనే తాము గొంతెత్తామన్నారు. పార్టీకి కొత్త జనరేషన్ కనెక్ట్ కావాలన్నారు. పార్టీ బలహీనం కావడం తాము చూడలేమన్నారు.

జమ్మూకశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా తీసుకురావడానికి పోరాటం కొనసాగిస్తామన్నారు గులాం నబీ ఆజాద్. తాను రాజ్యసభ నుంచి రిటైర్ అయినా… రాజకీయాల నుంచి రిటైర్ కాలేదని చెప్పారు. కాంగ్రెస్ బలంగా ఉండాలని G-23 కోరుకుంటోందన్నారు రాజ్ బబ్బర్. మహాత్మా గాంధీ ఆలోచనలకు అనుగుణంగా దేశం, రాజ్యాంగం ఏర్పడిందని… దానిని కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్లాలన్నారు.

G-23 లీడర్లపై సెటైర్లేశారు కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారు పార్టీకి హెల్ప్ చేస్తే బాగుంటుందన్నారు సింఘ్వీ. గులాం నబీ ఆజాద్ 7 సార్లు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారని… ఆయన్ని సోనియా గాంధీనే ముఖ్యమంత్రిని చేశారని, పార్టీ జనరల్ సెక్రటరీగా 20 రాష్ట్రాల ఎన్నికలను ఆజాద్ పర్యవేక్షించారని చెప్పారు.

కాంగ్రెస్ అసంతృప్త నేతలపై మండిపడ్డారు పొలిటికల్ ఎనలిస్ట్ తెహసీన్ పూనావాలా. దశాబ్ధాల పాటు అధికారాన్ని అనుభవించినవారు… ఎన్నడూ పార్టీలో ఎన్నికలు డిమాండ్ చేయలేదని… వారు ఇన్ ఛార్జ్ గా ఉన్న రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి ఏమి చేశారని ప్రశ్నించారు. వారిలో ఎవరైనా వారి నియోజకవర్గాల నుంచి నిరంతరం గెలవగలరా అని ప్రశ్నించారు.