రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ ధర్నా

రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ ధర్నా

రంగారెడ్డి జిల్లా : రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. పార్టీ ఇన్ చార్జ్ జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలియజేశారు. ధరణి పోర్టల్, పోడు భూములు, రైతు రుణమాఫీ, రైతుబంధు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ధర్నా చేపట్టారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు రాజేంద్రనగర్ కాంగ్రెస్ నాయకులు ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

తమది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్..అందుకు భిన్నంగా రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని కాంగ్రెస్ నేత జ్ఞానేశ్వర్ ఆరోపించారు. ధరణి పోర్టల్ కారణంగా ఇప్పటికే చాలామంది రైతులు గుండెపోటుతో మృతి చెందారని చెప్పారు. 

ఎల్బీనగర్ లో కాంగ్రెస్ నేతల నిరసన

ఇటు ఎల్బీనగర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ ప్రక్రియను రద్దు చేయకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో నిత్యవసర ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.