మిషన్ భగీరథ వాటర్ సరఫరాలో లోపాలు : ఎమ్మెల్యే వివేక్

మిషన్ భగీరథ వాటర్ సరఫరాలో లోపాలు : ఎమ్మెల్యే వివేక్

లబ్దిదారులకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తుందని చెప్పారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చారని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ ను సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారని అన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో రోజుకు గంటసేపు ప్రజలను కలిసేవారని చెప్పారు. 

సింగరేణి కాంట్రాక్టు ఉద్యోగాల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరానని, అందుకు సీఎం కూడా ఒప్పుకుని సీఎండీకి వెంటనే ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఈ మధ్యే తాను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కారులో వెళ్లానని, ఆ సమయంలో ఆయనతో పలు విషయాలు పంచుకున్నానని చెప్పారు. బయటకు వెళ్లిన సమయంలో ట్రాఫిక్ కు ఇబ్బందులు వస్తున్నాయని, దీంతో పబ్లిక్ వాహనాలను రోడ్డుపైనే నిలిపివేయిస్తున్నారని రేవంత్ తో చెప్పానని అన్నారు. దీంతో సీఎం కాన్వాయ్ కూడా తగ్గించారని చెప్పారు. 

మిషన్ భగీరథ అధికారులు శుక్రవారం (డిసెంబర్ 22న) ఇచ్చిన రిపోర్టు ప్రకారం గ్రామాలకు నీళ్లు వస్తున్నాయని, కానీ.. శనివారం (డిసెంబర్ 23న) తాను పర్యటించిన గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని తేలిందని చెప్పారు. మిషన్ భగీరథ వాటర్ సరఫరాలో చాలా లోపాలు ఉన్నాయన్నారు. మిషన్ భగీరథ పథకంలో అవినీతి జరిగిందని తాను మొదటి నుంచి చెబుతున్నానని గుర్తు చేశారు. చెన్నూరు నియోజకవర్గం వ్యాప్తంగా నెల రోజుల్లో ఇంటింటికీ నీళ్లు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

గ్రామసభలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వ పథకాల కోసం అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వలన ముంపు రాకుండా కరకట్ట నిర్మాణాం కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. మందమర్రి మున్సిపాలిటీలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటు మంచిర్యాల జెడ్పీ చైర్​పర్సన్​ భాగ్యలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.