పాక్ డ్రోన్లకు ఇక చుక్కలే.. స్వదేశీ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గవస్త్ర ప్రయోగం సక్సెస్

పాక్ డ్రోన్లకు ఇక చుక్కలే.. స్వదేశీ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గవస్త్ర ప్రయోగం సక్సెస్

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ తర్వాత దాయాది పాక్ దేశం భారత్‎పై వందల సంఖ్యలో డ్రోన్లు, పదుల సంఖ్యలో మిసైళ్లతో దాడులకు ప్రయత్నించింది. పాక్ దాడులను భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే.. పాక్ భారీగా డ్రోన్ల దాడులకు ప్రయత్నిస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో స్వదేశీ కౌంటర్ డ్రోన్ వ్యవస్థను విజయవంతంగా భారత్ ప్రయోగించింది. హార్డ్ కిల్ మోడ్‌లో తక్కువ ఖర్చుతో సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (SDAL) రూపొందించిన స్వదేశీ కౌంటర్-డ్రోన్ వ్యవస్థ భార్గవస్త్రను 2025, మే 13న భారత్ పరీక్షించింది. 

ఒడిశాలోని గోపాల్‌పూర్‌లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ (AAD) సీనియర్ అధికారుల సమక్షంలో ఈ రాకెట్ కోసం మూడు పరీక్షలు నిర్వహించారు. రెండు ప్రయోగాల్లో ఒకొక్క రాకెట్‎ను పరీక్షించగా.. మరో ప్రయోగంలో 2 సెకన్లలోపు సాల్వో మోడ్‌లో రెండు రాకెట్‌లను టెస్ట్ చేశారు. మొత్తం నాలుగు రాకెట్లు నిర్దేశించిన లక్ష్యాలను అత్యంత కచ్చిత్వంతో సాధించాయని.. భార్గవస్త్ర కౌంటర్-డ్రోన్ వ్యవస్థ పరీక్షలు విజయవంతమైనట్లు అధికారులు బుధవారం (మే 14) వెల్లడించారు. ఇది డ్రోన్ సమూహాల ముప్పును గణనీయంగా ఎదుర్కొంటుందని తెలిపారు. 

భార్గవాస్త్ర ప్రత్యేకతలు:

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిన భార్గవాస్త్ర 2.5 కి.మీ దూరంలో ఉన్న చిన్న, ఇన్‌కమింగ్ డ్రోన్‌లను గుర్తించి ధ్వంసం చేయగలదు. ఇది 20 మీటర్ల రేడియస్‎లో డ్రోన్‌ల సమూహాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మొదటి రక్షణ పొరగా గైడెడ్ మైక్రో రాకెట్‌లను కలిగి ఉంది. రెండవ పొరగా గైడెడ్ మైక్రో-క్షిపణిని ఉపయోగిస్తూ అత్యంత ఖచ్చిత్వంతో శత్రువుల డ్రోన్లను నేలకూల్చగలదు.  సముద్ర మట్టానికి 5000 మీటర్ల ఎత్తులో ఉన్న ఎత్తైన ప్రాంతాలతో సహా విభిన్న ప్రాంతాల్లో సులభంగా మోహరించేలా ఈ వ్యవస్థ రూపొందించబడింది. 

ఈ వ్యవస్థ మాడ్యులర్ అన్ని సాయుధ దళాల విభాగాలకు సమగ్ర కవచాన్ని అందించడానికి జామింగ్, స్పూఫింగ్‌ను చేర్చడానికి అదనపు సాఫ్ట్-కిల్ పొరను కలిగి ఉంటుంది. భార్గవాస్త్ర సెన్సార్లు (రాడార్, EO & RF రిసీవర్) మాడ్యులర్‌గా ఉంటాయి. లేయర్డ్, టైర్డ్ ఏడీ కవర్ కోసం ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో పనిచేసేలా ఉపయోగించవచ్చు. అధునాతన C4I (కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్ మరియు ఇంటెలిజెన్స్) సాంకేతికతను కలిగి ఉన్న అధునాతన కమాండ్-అండ్-కంట్రోల్ సెంటర్‌తో అమర్చబడిన భార్గవాస్త్ర రాడార్ 6 నుంచి 10 కి.మీ దూరంలో ఉన్న వైమానిక ముప్పులను పసిగట్టగలదు. 

దీని ఎలక్ట్రో-ఆప్టికల్/ఇన్‌ఫ్రారెడ్ (EO/IR) సెన్సార్ సూట్ తక్కువ రాడార్ క్రాస్-సెక్షన్ (LRCS) లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించడానికి సహయపడుతోంది. విదేశాల నుంచి తెచ్చుకున్న అత్యాధునిక డ్రోన్లతో పాక్ దాడులకు పాల్పడుతోన్న వేళ.. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్వదేశీ కౌంటర్ డ్రోన్ వ్యవస్థను భారత్ విజయవంతంగా పరీక్షించడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరీక్షల ద్వారా పాక్ కు భారత్ పరోక్ష హెచ్చరికలు పంపిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.