గ్రామ గ్రామానికి కాంగ్రెస్ ఇంచార్జీల నియామకం

 గ్రామ గ్రామానికి కాంగ్రెస్ ఇంచార్జీల నియామకం
  • ఇంచార్జీల వివరాలు వెల్లడించిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్
  • ఇంచార్జీల ఆధ్వర్యంలో రేపు గ్రామ గ్రామాన రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
  • మునుగోడులో గ్రామ గ్రామానికి తరలిరానున్న కాంగ్రెస్ ముఖ్య నేతలు
  • వాడవాడలా ప్రచార శంఖం పూరించనున్న కాంగ్రెస్ నేతలు

త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచార భేరిని మోగించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని గ్రామ గ్రామానికి ఇంచార్జీలను నియమించింది. కాంగ్రెస్ ఇంచార్జీల ఆధ్వర్యంలో రేపు రాజీవ్ జయంతి ఉత్సవాలు జరుగుతాయని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ప్రకటించారు. 

రాజీవ్ జయంతి సందర్భంగా మోగించనున్న ప్రచార భేరి కార్యక్రమం కోసం మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రుల స్థాయి నేతలు తరలివెళ్లనున్నారు. భారతరత్న రాజీవ్ గాంధి జయంతి వేడుకలను మునుగోడు నియోజకవర్గంలోని ఊరూరా నిర్వహించనున్నారు. 

మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నికలపై స్పష్టత వచ్చిన వెంటనే పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మణిక్కం ఠాగూర్ రాష్ట్ర నేతలందరితో పలుమారు సమీక్షించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికకు పార్టీ కేడర్ ను సమాయాత్తం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రేపు రాజీవ్ గాంధీ జయంతి నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు వ్యూహరచన చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం రేపు  మునుగోడు నియోజకవర్గంలో పర్యటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మన మునుగోడు - మన కాంగ్రెస్..హస్తం గుర్తుకే మన ఓటు అనే నినాదంతో రూపొందించిన లోగోను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఒక వైపు సోనియాగాంధీ, మరోవైపు రాహుల్ గాంధీ ఫోటోలతో రూపొందించిన లోగోను మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఇంటిపై ఉండేలా చూడాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఒకవైపు సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభతో ప్రచారాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఢీ అంటే ఢీ అనేలా మునుగోడు నియోజకవర్గంలో దూసుకెళ్లేందుకు వ్యూహరచన చేశారు. రేపు శనివారం మునుగోడు నియోజకవర్గంలో జరగనున్న బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.