కరీంనగర్​పై కాంగ్రెస్​ కన్ను.. లోక్​సభ స్థానాన్ని చేజిక్కించుకోవాలని అడుగులు

కరీంనగర్​పై కాంగ్రెస్​ కన్ను.. లోక్​సభ స్థానాన్ని చేజిక్కించుకోవాలని అడుగులు
  • ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగింటిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
  • అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్
  • కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో చేజారుతున్న క్యాడర్
  • కాంగ్రెస్ లోకి పెరిగిన వలసలు
  • ప్రజాహిత యాత్రతో సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ జోరుగా ప్రచారం
  • పార్టీ పునర్ వైభవంపై మంత్రి పొన్నం ఫోకస్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ పార్లమెంట్​సెగ్మెంట్​పై అధికార కాంగ్రెస్​పార్టీ కన్నేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగింటిని కైవసం చేసుకున్న కాంగ్రెస్.. అదే ఉత్సాహంతో లోక్ సభ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు అడుగులు వేస్తోంది. మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించినప్పటికీ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో క్రమంగా ఆ పార్టీ క్యాడర్​చేజారుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్​గ్రాఫ్​అమాంతం పడిపోయింది.

పైగా బీఆర్ఎస్ ​ఎంపీ అభ్యర్థి ఎప్పుడూ ప్రజల్లో ఉండడనే అపవాదు, నాన్ లోకల్ అని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం తలనొప్పిగా మారింది. పదేండ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ నేతలు, శ్రేణులు లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయిన్​పల్లి వినోద్ కుమార్ పేరును ప్రకటించగా, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ పేరు దాదాపు ఖాయమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి పేరు ప్రకటించాల్సి ఉంది. సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇప్పటికే  ప్రజాహిత యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. 

బీఆర్ఎస్ కు తలనొప్పిగా అసంతృప్తులు

బోయిన్ పల్లి వినోద్ కుమార్ కు గత ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే హ్యాండ్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే పలు సభల్లో స్వయంగా చెప్పారు. మరోసారి అదే పరిస్థితి రిపీట్​అయ్యేలా కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికలు దగ్గరపడే కొద్ది బీఆర్ఎస్ శ్రేణులు రోజుకోచోట అధిష్ఠానానికి షాక్ ఇస్తున్నాయి. నేతల తీరును బహిరంగంగా విమర్శిస్తూ కొందరు పార్టీని వీడుతుండగా, మరికొందరు నేరుగా పార్టీ సమావేశాల్లోనే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఇటీవల నిర్వహించిన కరీంనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ‘చెంచాలకు పదవులు ఇచ్చి, కార్యకర్తలను పట్టించుకోలేదు.

అందుకే మొన్న బీఆర్ఎస్ ఓడిపోయింది’ అంటూ శ్యామ్ అనే ఉద్యమకారుడు చేసిన కామెంట్లు గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇన్నాళ్లు అధిష్ఠానానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు జంకిన కార్యకర్తలు.. ఇప్పుడు ఓపెన్ గా విమర్శలు చేస్తుండడం పార్టీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల కాంగ్రెస్​ఇన్​చార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు.

బీఆర్ఎస్ క్యాడర్ ను ఖాళీ చేసేలా పావులు కదుపుతున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఆరుగురు సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. ఇటీవల జమ్మికుంట మున్సిపాలిటీలోని 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో హస్తం గూటికి చేరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు వందలాదిగా కాంగ్రెస్ పార్టీ ఇన్​చార్జి ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

కాంగ్రెస్ టికెట్ కు ఫుల్ డిమాండ్

కరీంనగర్​కాంగ్రెస్​టికెట్​కు ఫుల్ డిమాండ్ ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన, ఇతరుల కోసం త్యాగం చేసిన లీడర్లు ఎంపీ టికెట్​కోసం పోటీపడుతున్నారు. అధిష్ఠానం ఎలాంటి ప్రయోగాలు చేయకుండా గెలిచే అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ పోటీచేసి గెలిచారు. తర్వాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది.

తొలుత ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోటీ చేయించాలని పార్టీ భావించినప్పటికీ.. ఆయన నిజామాబాద్​లో పోటీకి మొగ్గు చూపడంతో మరో బలమైన అభ్యర్థి కోసం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. హుస్నాబాద్ టికెట్ ను త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, కరీంనగర్ టికెట్ ఆశించి భంగపడిన పీసీసీ అధికార ప్రతినిధి, ఎమ్మెస్సార్ మనవడు మేనేని రోహిత్ రావు, ఏఐసీసీ మెంబర్ కొనగాల మహేశ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తమ్ముడు శ్రీనుబాబుతోపాటు వెలిచాల రాజేందర్ రావు, రుద్ర సంతోశ్, నేరేళ్ల శారద కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు.

సంజయ్ స్పెషల్​ ఫోకస్

అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్.. మరోసారి ఎంపీగా గెలవాలని చూస్తున్నారు. ఈ నెల 10న మేడిపల్లి నుంచి తొలివిడత ప్రజాహిత యాత్రను ప్రారంభించి సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాలు, 81 గ్రామాల్లో పర్యటించారు. అగ్రహారంలో యాత్రను ముగించారు. అయోధ్య రామమందిరం, గ్రామాల్లో కేంద్రం అమలు చేస్తున్న స్కీములు, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జాతీయ రహదారుల నిర్మాణానికి తాను తీసుకొచ్చిన నిధులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీఆర్ఎస్ సర్కార్ పై తాను చేసిన పోరాటం, తనమీద గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ప్రచారాస్త్రాలుగా ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీలకు పోలైన ఓట్లు

నియోజకవర్గం    పోలైన ఓట్లు    కాంగ్రెస్    బీఆర్ఎస్    బీజేపీ 
కరీంనగర్    2,29,774    40,057    92,179    89,016
చొప్పదండి    1,82,168    90,395    52,956    26,669 
మానకొండూరు    1,85,829    96,773    64,408    14,879 
హుస్నాబాద్    2,06,698    1,00,955    81,611    8,338
హుజురాబాద్    2,09,311    53,164    80,333    63,460 
సిరిసిల్ల    1,88,740    59,557    89,244    18,328
వేములవాడ    1,74,145    71,451    56,870    29,710 
మొత్తం    13,76,665    5,12,352    5,17,601    2,50,400