కాంగ్రెస్​లో కొత్తోళ్లకు పెద్దపీట.. పొంగులేటి నుంచి మైనంపల్లి వరకు ఇంతే

కాంగ్రెస్​లో కొత్తోళ్లకు పెద్దపీట.. పొంగులేటి నుంచి మైనంపల్లి వరకు ఇంతే
  • పొంగులేటి నుంచి మైనంపల్లి వరకు ఇంతే
  • 15 కీలక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి

హైదరాబాద్, వెలుగు : పార్టీలోకి కొత్తగా వస్తున్న లీడర్లకు కాంగ్రెస్​ రెడ్​ కార్పెట్​ పరుస్తున్నది. పలువురు నేతల ఇండ్లకు వెళ్లి మరీ పార్టీ​ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. ఎమ్మెల్యే టికెట్​ హామీతో వారికి సాదర స్వాగతం పలుకుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి మొదలు మైనంపల్లి హన్మంతరావు ఎపిసోడ్​ వరకు ఇదే నడుస్తున్నది. ప్రస్తుతం 15 కీలక నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొంది. 

టికెట్ల విషయం మొత్తం సెంట్రల్​ ఎలక్షన్​ కమిటీ చేతుల్లోనే ఉందని నేతలు చెప్తున్నా.. ఆ 15 నియోజకవర్గాల్లో కొత్తగా చేరిన నేతలకే హైకమాండ్​ టికెట్లు కన్ఫర్మ్​ చేస్తుందన్న వాదన బలంగా వినిపిస్తున్నది. కొత్తవారికి పెద్దపీట వేస్తుండటం పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న లీడర్లను నారాజ్​కు గురిచేస్తున్నది. 

పొంగులేటితో స్టార్ట్​

ఈ మధ్య కొత్త లీడర్లకు పెద్దపీట వేయడం ఉమ్మడి ఖమ్మం జిల్లా నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డితో మొదలైందని పార్టీలోని పాత లీడర్లు అంటున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్​ రావు ఠాక్రే వంటి లీడర్లు పొంగులేటితో సమావేశాలు నిర్వహించి పార్టీలోకి వచ్చేలా చూశారు. ఆయనతో పాటు ఆయన ముఖ్య అనుచరులూ టికెట్ హామీతోనే జాయిన్​ అయ్యారని.. పొంగులేటికి పాలేరు, ఖమ్మంలో ఏదో ఒక టికెట్​ కన్ఫర్మ్​ అయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. 

తన ముఖ్య అనుచరుడైన కోరం కనకయ్యకూ ఇల్లందు టికెట్​ ఇవ్వాలని పొంగులేటి అడిగినట్లు ప్రచారం జరుగుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకే చెందిన  తుమ్మల నాగేశ్వర్​రావును కూడా కాంగ్రెస్​ పెద్దలు చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఇద్దరి ఎంట్రీతో ఖమ్మంలోని కాంగ్రెస్​ పాత లీడర్లలో ఆందోళన పెరిగింది. వాళ్ల చేరికతో ఖమ్మంలో కాంగ్రెస్​ బలపడిందని కొందరు నేతలు చెప్తున్నా.. ఆయా నియోజకవర్గాల్లో టికెట్​ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పాత లీడర్లు మాత్రం ఆందోళన చెందుతున్నారు. భట్టి విక్కమార్కకు ముఖ్య అనుచరుడైన రాయల నాగేశ్వరరావుతోపాటు రామసహాయం మాధవి రెడ్డి, మద్దినేని బేబీ స్వర్ణ కుమారి పాలేరు టికెట్​ రేసులో ఉన్నారు.

ఖమ్మం నుంచి మువ్వా విజయ్​బాబు టికెట్​ను ఆశిస్తూ అప్లికేషన్​ పెట్టుకున్నారు. పొంగులేటి, తుమ్మల చేరికతో ఆ పాత లీడర్ల పరిస్థితి రివర్స్​ అయింది. వాళ్లిద్దరికే ఆ రెండు (పాలేరు, ఖమ్మం) నియోజకవర్గాలూ అడ్జస్ట్​ అయ్యే అవకాశం ఉండడంతో బరి నుంచి పాత లీడర్లు తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇటు.. 

ఇల్లందు టికెట్​పై ఆశలు పెట్టుకున్న బెల్లయ్య నాయక్​, పొరిక సాయి శంకర్​కు నిరాశ తప్పేలా లేదన్న చర్చ జరుగుతున్నది. ఆ స్థానం పొంగులేటి కోటాలో కోరం కనకయ్యకు టికెట్​ ఇస్తారన్న ప్రచారం సాగుతున్నది. 

ఉమ్మడి పాలమూరులో కాస్త ఎక్కువే!

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో కొత్త, పాత పంచాయితీ కొంచెం ఎక్కువగా ఉన్నది. టీడీపీలో కీలకంగా పనిచేసిన కొత్తకోట దయాకర్​ రెడ్డి భార్య సీతా దయాకర్​రెడ్డి  ఇటీవల కాంగ్రెస్​ పార్టీలో చేరారు. సీతా దయాకర్​రెడ్డిని పార్టీలో చేర్పించేందుకు రేవంత్​, మల్లు రవి వంటి సీనియర్​ లీడర్లు ఆమె ఇంటికెళ్లి చర్చలు కూడా జరిపారు. ఆమెకు దేవరకద్ర సీటు ఇచ్చేందుకు హామీ ఇచ్చారన్న ప్రచారం జరుగుతున్నది. కానీ, ఇప్పటికే అక్కడ కారం ప్రదీప్​గౌడ్​ టికెట్​ కోసం ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో కార్యక్రమాలూ చేపడుతున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును కూడా రేవంత్​, భట్టి వంటి సీనియర్లు ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపి పార్టీలోకి తీసుకొచ్చారు. కొల్లాపూర్​ టికెట్​ను జూపల్లి ఆశిస్తున్నట్లు ప్రచారం నడుస్తున్నది. అయితే.. ఇప్పటికే అక్కడి టికెట్  కోసం చింతపల్లి జగదీశ్వర్​ రావు, కేతూరి వెంకటేశ్​వంటి పాత నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇక, మహబూబ్​నగర్​ టికెట్​ హామీతోనే యెన్నం శ్రీనివాస్​ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చారని, అక్కడి నుంచి సంజీవ్​ ముదిరాజ్​ ఇప్పటికే రేసులో ఉన్నారని పార్టీలో చర్చ జరుగుతున్నది. గద్వాల జడ్పీ చైర్​పర్సన్​ అయిన సరిత తిరుపతయ్య.. బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరారు. గద్వాల టికెట్  హామీతోనే సరిత పార్టీలోకి వచ్చారని, అయితే అక్కడ పాత లీడర్​ ఎం. రాజీవ్​ రెడ్డి టికెట్​కోసం ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నాగర్​కర్నూల్​ నుంచి కూచుకుళ్ల రాజేశ్​రెడ్డి టికెట్​ ఆశిస్తున్నారు. 

బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​ రెడ్డి కుమారుడైన ఆయన.. కొద్ది నెలల కిందనే బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లోకి మారారు. కానీ, నాగర్​ కర్నూల్​ టికెట్​ కోసం పాత లీడర్​ నాగం జనార్దన్ రెడ్డి రేసులో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ టికెట్​ తనకే కావాలని నాగం పట్టుబడుతున్నారు. కానీ, కొత్తగా పార్టీలోకి వచ్చినోళ్లవైపే పార్టీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. 

వేముల వీరేశంకూ సీటు?

నకిరేకల్​ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్​ఎస్​ పార్టీకి కొన్నాళ్లుగా అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఆయన కూడా కాంగ్రెస్​ పార్టీలో చేరేందుకు ముహూర్తం దాదాపు ఫిక్స్​ అయింది. వీరేశంకు నకిరేకల్​ టికెట్​ లేదా తుంగతుర్తి టికెట్​ ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఒకవేళ నకిరేకల్​ టికెట్​ ఇస్తే.. అక్కడ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి అనుచరవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తుంగతుర్తి కన్ఫర్మ్​ అయితే.. అక్కడ టికెట్​ ఆశిస్తున్న అద్దంకి దయాకర్​కు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. 

అద్దంకి దయాకర్​ కూడా ఇప్పటికే అక్కడ గ్రౌండ్​లో వర్క్​ మొదలు పెట్టేశారు. ఇదే ఏరియా నుంచి పోటీకి నాగరిగారి ప్రీతం, పిడమర్తి రవి వంటివాళ్లు కూడా ఇంట్రస్ట్​ చూపుతున్నారు. బీఆర్​ఎస్​ లీడర్​ కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమవుతున్నారని, ఆయనకు కల్వకుర్తి టికెట్​ ఇచ్చేలా డీల్​ కుదిరిందన్న చర్చ పార్టీలో సాగుతున్నది. అయితే.. అక్కడ పాత లీడర్​ వంశీచంద్​రెడ్డి టికెట్​ఆశిస్తున్నారు. బోథ్​ నుంచి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే రాథోడ్​ బాపురావు.. కాంగ్రెస్​లోకి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

మైనంపల్లికి రెండు టికెట్లిస్తే..!

రెండు టికెట్ల హామీతోనే మల్కాజ్​గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్​లో చేరుతున్నట్లు తెలుస్తున్నది. తనకు మల్కాజ్​గిరి టికెట్​, తన కొడుకు రోహిత్​కు మెదక్​ టికెట్​ అడిగానని, ఇందుకు కాంగ్రెస్​ పెద్దలు సానుకూలంగా స్పందించారని హన్మంతరావే స్వయంగా ప్రకటించారు.  ఇక, మేడ్చల్​ టికెట్​ తన ముఖ్య అనుచరుడైన నక్కా ప్రభాకర్​ గౌడ్​కు ఇవ్వాలని కోరినట్లు ఆయన చెప్పారు. అయితే.. మల్కాజ్​గిరి, మెదక్​ టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్​ హైకమాండ్​ ఒప్పుకుందని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే మల్కాజ్​గిరి నుంచి నందికంటి శ్రీధర్​ టికెట్​ను ఆశిస్తున్నారు. రేవంత్​ రెడ్డికి కీలక అనుచరుడిగా పేరున్న నందికంటి.. నియోజకవర్గంలో టికెట్​ తనకే వస్తుందన్న ధీమాతో గ్రౌండ్​ను కూడా సెట్​ చేసుకున్నారు. 

మల్కాజ్​గిరి ఎంపీగా రేవంత్​ గెలవడంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని, కాబట్టి రేవంత్​ కోటాలో నందికంటి శ్రీధర్​కే టికెట్​ కన్ఫర్మ్​ అన్న  నమ్మకంలో పార్టీ కేడర్​ కూడా ఉంది. అయితే.. ప్రస్తుతం మైనంపల్లి హన్మంతరావు ఎంట్రీ ఇస్తుండటంతో నందికంటి శ్రీధర్​కు టికెట్​ దక్కడం కష్టమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎంతో నమ్మకంగా పార్టీ కోసం పనిచేసిన తనకు టికెట్​ ఇవ్వకుంటే తన దారి తాను చూసుకోక తప్పదన్న భావనలో శ్రీధర్​ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. నందికంటి శ్రీధర్​ను బుజ్జగించేందుకు బీసీ నేతలు మధుయాష్కీ గౌడ్​, మహేశ్​ కుమార్​ గౌడ్​తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మల్లు రవి.. ఆయన ఇంటికి వెళ్లారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. 

టికెట్ల విషయంలో హైకమాండ్​ ఏ నిర్ణయం తీసుకోలేదని బుజ్జగించే ప్రయత్నం చేశారు. హైకమాండ్​ ప్రకటించే లిస్టులో తన పేరు లేకుంటే ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే నందికంటి శ్రీధర్​ తన ప్లాన్లలో తాను ఉన్నట్టు తెలుస్తున్నది. మరోవైపు మల్కాజ్​గిరి టికెట్​ మైనంపల్లికి ఇస్తే నందికంటి శ్రీధర్​ బీఆర్​ఎస్​లోకి వెళ్తారన్న ప్రచారమూ జోరుగా సాగుతున్నది. 

పాత లీడర్లకు బుజ్జగింపులు

కొత్త లీడర్లకు టికెట్లు ఇస్తున్నా పాత లీడర్లను విస్మరించబోమని కాంగ్రెస్​ పెద్దలు అంటున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీ కోసం కొత్తోళ్లకు టికెట్​ సర్దుబాటు చేయాల్సి ఉంటుందని, దాని వల్ల  పాత లీడర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం కలగకుండా చూసుకుంటామని బుజ్జగిస్తున్నారు.  ఎలాగూ అధికారంలోకి వస్తాం కాబట్టి.. ఎమ్మెల్యే టికెట్​ 

దక్కనివాళ్లను ఎమ్మెల్సీ పదవిలోనో లేదా కార్పొరేషన్​, నామినేటెడ్​ పదవుల్లోనో  అడ్జస్ట్​ చేస్తామని రేవంత్​, భట్టి వంటి సీనియర్​ నేతలు పలు సందర్భాల్లో హామీ ఇస్తూ వచ్చారు. అయితే, అధికారంలోకి వస్తే ఓకేగానీ.. రాకుంటే పరిస్థితేంటని పాత లీడర్లు డైలమాలో ఉన్నట్టు తెలుస్తున్నది.

ఆదిలాబాద్​లో కొత్త, పాత లొల్లి

కొద్ది నెలల కింద బీజేపీ నుంచి కాంగ్రెస్​లో చేరిన కంది శ్రీనివాస్​రెడ్డికి ఆదిలాబాద్​ టికెట్​ దాదాపు కన్ఫర్మ్​ అయిపోయినట్లు ప్రచారం సాగుతున్నది.  అక్కడ బీసీ నేత గండ్రత్​ సుజాత, సాజిద్​ ఖాన్​ ఎప్పటి నుంచో టికెట్​ రేసులో ఉన్నారు. కాంగ్రెస్​ పార్టీలో యాక్టివ్​ రోల్​లో ఉన్న ఆ సీనియర్​ లీడర్లను కాదని.. 

ఎన్నారై అయిన శ్రీనివాస్​ రెడ్డికి టికెట్​ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతు న్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఇప్పటికే అక్కడ  కంది శ్రీనివాస్​ రెడ్డి, సాజిద్​ ఖాన్​ మధ్య వర్గపోరు స్టార్ట్​ అయింది. టికెట్​ కన్ఫర్మ్​ చేస్తే అది మరింత ముదిరి తార స్థాయికి చేరుతుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతున్నది.  

రేఖా నాయక్​కు ఇస్తే మా పరిస్థితేంది?

బీఆర్ఎస్​ ఎమ్మెల్యే రేఖానాయక్​కు.. ఈసారి ఆ పార్టీ నుంచి టికెట్​రాలేదు. ఆమె బీఆర్​ఎస్​కు రాజీనామా చేయకుండానే ఖానాపూర్​ కాంగ్రెస్​ టికెట్ ​కోసం అప్లయ్​ చేసుకున్నారు. ఆమె భర్త శ్యామ్​ నాయక్​ కాంగ్రెస్​లో చేరారు. ఆసిఫాబాద్​ టికెట్​ను అడుగుతున్నారు. పార్టీ పెద్దలు మాత్రం ఇద్దరిలో ఒకరికే టికెట్​ ఇస్తామని తేల్చి చెప్తున్నారు. ఎవరికిచ్చినా ఆ నియోజకవర్గాల్లోని పాత లీడర్లను పక్కన పెట్టాల్సిందేకదా అని పార్టీ వర్గాలు అంటున్నాయి. 

ఖానాపూర్​ నుంచి చారులత రాథోడ్​, వెడ్మ బొజ్జు వంటి పాత లీడర్లు పోటీకి సై అంటున్నారు. ఆసిఫాబాద్​ నుంచి మర్సుకోల సరస్వతి రేసులో ఉన్నారు. ఇప్పటికే వారు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. తమను కాదని కొత్తవాళ్లకు టికెట్​ ఇస్తే  సహకరించబోమని వారు బహిరంగంగానే తేల్చి చెప్తున్నారు.