హైదరాబాద్: అఖండ-2 సినిమాపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి గురువారం రాత్రి ప్రీమియర్ షో వేశారని విజయ్ గోపాల్ అనే న్యాయవాది కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం1.15 గంటలకు దీనిపై విచారణ జరగనుంది. అఖండ–2 సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు గురు వారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సిటీ పోలీసు కమిషనర్‌తో పాటు నిర్మాత 14 రీల్స్ ప్లస్ ఎల్‌ఎల్‌పీ, బుక్ మై షోలకు ఈమెయిల్ ద్వారా నోటీసులు అందజేయాలని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అఖండ–-2 సినిమా టికెట్ ధరలను పెంచుతూ ఈ నెల 10న ప్రభుత్వం ఇచ్చిన మెమోను సవాల్ చేస్తూ దాఖలైన 3 పిటిషన్‌లపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ విచారణ చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. టికెట్ ధరల పెంపునకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ గత సెప్టెంబరులో ఇక్కడ పిటిషన్ దాఖలైందన్నారు.
ఇందులో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిందని, ఇది విచారణలో ఉండగానే మళ్లీ అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. అఖండ–2 సినిమా విడుదల తేదీ మారక ముందు టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ఈ నెల 4న జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసినా పట్టించుకోలేదన్నారు. గురువారం సాయంత్రం ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600 నిర్ణయించారని, టికెట్లను ఆన్‌లైన్ ద్వారా కాకుండా నగదుకు విక్రయిస్తున్నారన్నారు. 12 నుంచి 15వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్ రూ.50, మల్టీప్లెక్స్‌లు 100 వరకు పెంచుకోవడానికి అనుమతించారని తెలిపారు.

