కాంట్రాక్ట్  ఉద్యోగుల శ్రమ దోపిడి ఇంకెన్నాళ్లు

కాంట్రాక్ట్  ఉద్యోగుల శ్రమ దోపిడి ఇంకెన్నాళ్లు

రెగ్యులర్​ జాబిస్తే  స్కేల్​ ప్రకారం జీతమివ్వాలి. ఉద్యోగి సంక్షేమ బాధ్యత తీసుకోవాలి. సర్కారులో భాగస్వామ్యం ఇవ్వాలి. రిటైర్​మెంట్ తర్వాత అంతో ఇంతో ఇవ్వాల్సి ఉంటది. ఇదంతా ఎందుకనుకుంటోంది సర్కారు. అందుకే కాంట్రాక్టు, ఔట్​ సోర్సింగ్​ను తెరపైకి తెచ్చింది.. తెస్తోంది. అవసరం వచ్చినప్పుడు, అవసరం ఉన్నకాడికి, తక్కువ జీతంతో వాడుకునే విధానమే ఈ కాంట్రాక్టు, ఔట్​ సోర్సింగ్. ఉద్యోగికి ఎటువంటి హక్కులుండవు, ముఖ్యంగా పని భారంతో ఒళ్లు గుల్లవుతున్నా కిమ్మనకుండా ఇచ్చిన కాడికి తీసుకోవడం ఈ జాబ్​ చేసేవాళ్లకు ఉండాల్సిన లక్షణంగా రూల్స్​ ఉంటాయి. రోజురోజుకు దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుండడంతో ఏ జాబైనా చేసేందుకు యువత ముందుకోస్తోంది. అదే అదనుగా శ్రమ దోపిడీ జరుగుతోంది. ఒక్క రంగమని కాదు.. అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వమే ముందుండి శ్రమ దోపిడీ చేస్తోంటే, ఇక ప్రైవేటు గురించి మాట్లాడేదేముంటుంది?
 
ప్రపంచీకరణ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1990  నుంచే  ప్రైవేటీకరణ విధానాన్ని అమలు చేస్తూ  కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకొచ్చాయి. అందులో భాగంగా రకరకాల చట్టాలు రూపొందించి కాంట్రాక్టు వ్యవస్థకు ద్వారాలు తెరిచాయి. 1994–99 మధ్య అన్ని ప్రభుత్వ శాఖలకూ కాంట్రాక్టు వ్యవస్థ పాకేసింది. రాష్ట్రంలో అది మరింత పెచ్చుమీరింది. తక్కువ ఇచ్చి ఎక్కువ చేయించుకోవడంతో మన పాలకులు మరింత ముదిరిపోయారు. అయితే అదే రానురాను ఓట్ల హామీగా రూపాంతరం చెందింది. మేం అధికారంలోకి వస్తే మీ జాబులు రెగ్యులరైజ్​ చేస్తామని ఆశ పెట్టి ఓట్ల దోపిడీకి తెరతీశాయి.  కానీ ఏండ్లుగా కాంట్రాక్టు, ఔట్​ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్.. అట్లనే మిగిలిపోయింది. రాష్ట్ర కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, 10వ పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచుతామని అధికారం చేపట్టే క్రమంలో ఇచ్చిన మాటను పాలకులు నిలుపుకోవాలని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్​ఉద్యోగులు కోరుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంట్రాక్ట్,  ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఉంది. అన్ని ప్రభుత్వ శాఖలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, ప్రభుత్వ సొసైటీ, వర్సిటీలు, కార్పొరేష‌‌న్లు, స్థానిక సంస్థల్లో సుమారు రెండు లక్షల మందికిపైగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు పని చేస్తున్నారు. 
 
సీఎం ఇచ్చిన మాట ఏమైంది? 

సమాన పనికి సమాన వేతనంపై సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కార్యరూపం దాల్చలేదు. దాని అమలుపైనే ఏళ్లుగా పోరాటం చేయాల్సిన పరిస్థితి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి ఉద్యమం  చేయడంలోనూ వీళ్లు కీలక భూమిక పోషించారు. దీనికి కారణం.. ప్రత్యేక రాష్ట్రం వస్తే త‌‌మ‌‌ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని. ఆశించినట్లే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తాము అధికారం చేపడితే కాంట్రాక్ట్ , ఔట్​ సోర్సింగ్​ వ్యవస్థను రద్దు చేసి, ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్లను పర్మినెంట్​ చేస్తామని టీఆర్​ఎస్​ మ్యానిఫెస్టోలో పెట్టింది. దీంతో ఓట్లన్నీ ఆ పార్టీనే గంపగుత్తగా పడ్డాయి. 2014 జూలై 16న జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో ఆమోదించిన నలభై మూడు అంశాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ  అంశం కూడా  ఉంది. ఈ ప్రకటనతో ఉద్యోగుల హర్షం వ్యక్తం చేశారు. ఇది జరిగి దాదాపు ఏడేండ్లు అయినా అతీగతీ లేదు. 2016 జనవరి 2న సీఎం మీడియా సమక్షంలో మాట్లాడుతూ.. 2016 జనవరి 31 లోపు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పారు. అది ఉత్త మాటగానే మిగిలిపోయింది. 

ఏ లెక్క నమ్మాలి?

తాత్కాలిక, పార్ట్ టైమ్​, ఫుల్ టైమ్​, డైలీ వేజ్, గౌరవ వేతనం పేరిట నెలకు రెండు వేల నుంచి పది వేల మధ్యలో జీతం చెల్లిస్తూ 10 నుంచి 12 గంటలు పని చేయించుకుంటున్నారు. ఆరేండ్ల కిందటి 9వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లిస్తూ వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఎనిమిది గంటల పని దినం, సెలవులు, మెటర్నరీ లీవులు, గ్రాట్యుటీ, ప్రమాద బీమా లాంటి చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారానికి ఆందోళనలను పోరాటాలు అవసరం లేదని అర్జీలు ఇస్తే సరిపోతుందని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. అవి కూడా ఉత్త మాటలే అయ్యాయి.  గతంలో  108 అంబులెన్స్ ఉద్యోగులు ప్రభుత్వ అనుబంధ యూనియన్ ఆధ్వర్యంలో 2015 మే 13 నుంచి 24 వరకు 11 రోజుల పాటు సమ్మె చేశారు. అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమక్షంలో చర్చలు జరిగాయి. తక్షణం వెయ్యి రూపాయల వేతనం పెంచుతున్నామని, తొలగించిన వాళ్లను విధుల్లోకి తీసుకుంటామని, సమ్మె కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణిస్తామని, ఇతర సమస్యలను రెండు నెలల్లో  పరిష్కరిస్తామని చెప్పారు. అవేం  కాలేదు.  మున్సిపల్ ఉద్యోగులు, గ్రామ పంచాయతీ ఉద్యోగులు, ఆశాలు, వీఆర్​ఏలు, ఆరోగ్యశ్రీ ఉద్యోగస్తులు, దేవాదాయ పూజారులు, 108 ఉద్యోగస్తులు సంఘటితంగా పోరాటం చేశారు. అయినా అరకొర మినహా మెజారిటీ సమస్యలు అలానే ఉండిపోయాయి. రెగ్యులరైజేషన్​కు 2/94 ను అడాప్ట్ చేసుకుని సవరించాలని, అసెంబ్లీ తీర్మానం చేయాలని, ఎన్నికల కోడ్ ఉందంటూ సర్కారు వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉంది. గతంలో ప్రభుత్వాలు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 8వ, 9వ పీఆర్సీలను వర్తింప చేసి ఆయా క్యాడర్లకు సంబంధించిన కనీస మూల వేతనాన్ని అమలుచేసేవి. ఇప్పటి ప్రభుత్వం జీవో 14  ద్వారా మరింత అన్యాయం చేస్తోంది. రాష్ట్ర విభజన టైమ్​లో  80 వేల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని సర్కారు తెలిపింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వేసిన అధ్యయన కమిటీ 25,549 మంది ఉన్నారంది. తీరా ప్రభుత్వం 17 వేలలోపు ఉద్యోగులనే పర్మినెంట్ చేస్తామంటోంది. ఇందులో ఏ లెక్కను నిజమని నమ్మాలి?  ఇక   రెగ్యులరైజేషన్‌కు ఎవరు అర్హులో,  ఎవరు కాదో  తేల్చకుండా నాన్చుతోంది. ఫలితంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులలో ఒకే  ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల మధ్య  ఘర్షణ రాజేసే ప్రయత్నం చేస్తోంది. కాంట్రాక్టు వ్యవస్థ ప్రారంభంలో ఉద్యోగాల్లో నియమించబడిన వారి వయసు 20 నుంచి 30  ఏండ్లు.  ఇప్పుడు వారి వయసు 40 నుంచి 45,  మరికొందరది 50 ఏండ్లు. ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేసినా పది, పదిహేనేండ్ల సర్వీసు పూర్తి కాకుండానే పదవీ విరమణ చేయాలల్సి వస్తుంది. ఇంత తక్కువ సర్వీసులో వారికి ఆశించిన స్థాయిలో రిటైర్మెంట్ బెనిఫిట్ అందవు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పర్మినెంట్ చేయడం చాలా అవసరం.  ప్రభుత్వం ఇచ్చిన  మాట ప్రకారం ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అందరినీ పర్మినెంట్ చేసి వారి జీతాలు పెంచాలి. 
                                 - మన్నారం  నాగరాజు, తెలంగాణ లోక్‌‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు