చైనా నుంచి వచ్చేటోళ్లపై ఆంక్షలు

చైనా నుంచి వచ్చేటోళ్లపై ఆంక్షలు

బీజింగ్: చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ‘జీరో కొవిడ్ పాలసీ’ ని సడలించడంతో అన్ని దేశాలు అలర్ట్ అయ్యాయి. చైనా నుంచి వచ్చేటోళ్లపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఎయిర్​పోర్టుల్లో ఆర్టీ పీసీఆర్​ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నాయి. ప్రయాణానికి ముందు కూడా నెగిటివ్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలనే నిబంధనలు తీసుకొచ్చాయి. చైనాతో పాటు ఆసియా​దేశాల నుంచి వచ్చేవారంతా 72 గంటల్లోపు కరోనా టెస్టు చేసుకున్న నెగెటివ్  రిపోర్టు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని ఇండియా నిబంధన విధించింది. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, స్వీడన్, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా, ఇండియా, మొరాకో దేశాలు కరోనా నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చాయి.

కరోనా టెస్ట్​ రిపోర్టుతో పాటు డబుల్ వ్యాక్సిన్​ వేసుకున్న సర్టిఫికెట్​ను కూడా అందజేయాల్సి ఉంటుందని కొన్ని దేశాలు ప్రకటించాయి. హాంకాంగ్, మకావ్ నుంచి వచ్చే వారికి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని, జనవరి 5 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని అమెరికా ప్రకటించింది. రెండు రోజుల్లోగా కరోనా రిపోర్టు అందజేయాల్సిందిగా సూచించింది. లేదంటే 90 రోజుల కింద వైరస్ నుంచి కోలుకున్నట్టు ప్రూఫ్ చూపించాల్సి ఉంటుందని చెప్పింది. పాజిటివ్ వస్తే ఏడు రోజుల పాటు క్వారంటైన్ లో  ఉంచుతామని జపాన్​ ప్రకటించింది. చైనా నుంచి వచ్చే ప్రయాణికులందరిపై మొరాకో నిషేధం విధించింది. ఈ నిబంధన జనవరి 3 నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టంచేసింది. చైనా నుంచి వచ్చే ప్యాసింజర్లకు ఇజ్రాయెల్ కూడా కరోనా టెస్ట్ తప్పనిసరి చేసింది.