చైనాలో రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్ కేసులు

చైనాలో రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్ కేసులు
  •  రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
  • రాబోయే 3 నెలల్లో 60% మందికి వైరస్​
  • ప్రముఖ ఎపిడమాలజిస్ట్​ ఎరిక్​ హెచ్చరిక
  • మరణాలు లక్షల్లోనే ఉంటయ్
  •     జీరో కొవిడ్​ పాలసీ ఎత్తేశాక వైరస్ వ్యాప్తి తీవ్రం
  •     ప్రభుత్వం పట్టించుకోవట్లే..
  •     ఆస్పత్రుల్లో బెడ్లన్నీ ఫుల్.. నేలపై పడుకోబెట్టి చికిత్స

బీజింగ్: చైనాలో కరోనా విలయం కొనసాగుతోంది. జీరో కొవిడ్​పాలసీ ఎత్తేశాక వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరణాలూ పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నా.. ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడంలేదు. ఇప్పటికే ఆస్పత్రులు, బెడ్స్ ఫుల్​ అయ్యాయి. బెడ్స్ ఖాళీలేక డాక్టర్లు ఎమర్జెన్సీ వార్డుల్లో ఒక్కో బెడ్​పై ఇద్దరిని, బెడ్స్ మధ్య నేలపైన రోగులను పడుకోబెట్టి చికిత్స చేస్తున్నారు. అంత్యక్రియల కోసం బీజింగ్​లో ఒక్క క్రిమటోరియానికే రోజుకు 200 మృతదేహాలను తీసుకొస్తున్నారని అక్కడి సిబ్బంది చెప్పారు. మరోవైపు, రాబోయే రోజుల్లో చైనాలో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరించారు. దేశ జనాభాలోని 60% మందికి రాబోయే 3  నెలల్లో కరోనా సోకుతుందని చైనా టాప్​ ఎపిడమాలజిస్ట్ ఎరిక్​ ఫెయిగిల్​ డింగ్​ ఆందోళన వ్యక్తంచేశారు. ఇది ప్రపంచ జనాభాలో 10 శాతానికి సమానమని చెప్పారు. వైరస్ మరణాలు కూడా లక్షల్లోకి పెరుగుతాయన్నారు.

కొవిడ్​ ఆంక్షలు ఎత్తేశాక..

జీరో కొవిడ్​ ఆంక్షలు ఎత్తేశాక దేశంలో వైరస్ కేసులు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్నా జిన్ పింగ్​ సర్కారు పట్టించుకోవట్లేదని ఎరిక్​ విమర్శించారు. వైరస్ బారిన పడేటోళ్లు పడనీ, కరోనాతో చనిపోయేటోళ్లు చావనీ అన్నట్లు చైనీస్​ కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైరస్ కేసులు రెట్టింపు కావడానికి(ఆర్​ వాల్యూ) గతంలో కొన్ని రోజులు పడితే.. ఇప్పుడు కేవలం గంటల వ్యవధిలోనే రెట్టింపు కేసులు నమోదు అవుతున్నాయని అంటున్నారు.

మరణాలను చెప్పట్లే..

కరోనాతో చనిపోయిన వాళ్ల సంఖ్యను ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తోందని ఎరిక్​ ఆరోపించారు. ఒక్క బీజింగ్​ లోనే రోజూ వందలాది మంది వైరస్​ తో చనిపోతున్నారని తెలిపారు. సిటీలోని ఓ క్రిమటోరియంకు గతంలో రోజుకు 30 నుంచి 40 మృతదేహాలను అంత్యక్రియల కోసం తెచ్చేవారని, ఇప్పుడు రోజుకు సుమారు రెండొందల మృతదేహాలను తీసుకొస్తున్నారని అన్నారు. పని ఒత్తిడి బాగా పెరిగిందని, రోజులో 24 గంటలూ మృతదేహాలను కాలుస్తున్నామని అక్కడి సిబ్బంది చెప్పారన్నారు. ఈ ఆరోపణలకు సపోర్టుగా ఆయన ట్విట్టర్​లో వీడియోలను షేర్​ చేశారు. బీజింగ్​లోని ఓ ఆస్పత్రి వీడియోతో పాటు మృతదేహాలకు సంబంధించిన వీడియోను ఎరిక్  ట్వీట్​ చేశారు. చైనా కేంద్రంగా కరోనా కేసులు పెరుగుతున్నా.. ప్రపంచానికీ ముప్పు తప్పదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.