కరోనా దెబ్బ..పౌల్ట్రీకి రూ.1750 కోట్ల నష్టం

కరోనా దెబ్బ..పౌల్ట్రీకి రూ.1750 కోట్ల నష్టం

న్యూఢిల్లీ: ఫేక్ వార్తలతో దెబ్బతిన్న పౌల్ట్రీ ఇండస్ట్రీని ఆదుకోవాలని, దీని కోసం ఒక రిలీఫ్‌‌ ప్యాకేజిని ప్రకటించాలని ఆల్‌‌ ఇండియా పౌల్ట్రీ బ్రీడర్స్‌‌ అసోషియేషన్‌‌(ఏఐపీబీఏ) ప్రభుత్వాన్ని  కోరింది.  మినిస్ట్రీ ఆఫ్‌‌ యానిమల్‌‌ హస్బండ్రికి ఏఐపీబీఏ ప్రతినిధులు సోమవారం కలిసి తమ డిమాండ్లు తీర్చాలని కోరారు. ఎడిషనల్‌‌ వర్కింగ్‌‌ క్యాపిటల్‌‌ను సమకూర్చాలని,  తీసుకున్న అప్పులను  గడువు ప్రకారం చెల్లించలేకపోయినా వాటిని నాన్‌‌ పెర్ఫార్మింగ్‌‌ అసెట్స్‌‌గా పరిగణించొద్దని కోరారు.  పౌల్ట్రీ సెక్టార్‌‌‌‌కు ఇచ్చే అప్పులలో 5 శాతం రాయితీని ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడిగారు. దీంతో పాటు ఇప్పటికే తీసుకున్న టెర్మ్‌‌  లోన్‌‌ చెల్లింపు విషయంలో  ఒక ఏడాది పాటు గ్రేస్‌‌ పిరియడ్‌‌ ఇవ్వాలని ఈ అసోషియేషన్‌‌ కోరింది. పౌల్ట్రీ ఇండస్ట్రీకి ప్రభుత్వం అందించే గోధుమ, బియ్యాన్ని కేజీ రూ. 10 కే అందించాలని ఏబీపీబీఏ డిమాండ్‌‌ చేసింది. ప్రభుత్వ నిల్వల నుంచి 30 లక్షల టన్నులను ఈ ఇండస్ట్రీ కోసం కేటాయించాలని కోరింది.

పౌల్ట్రీ ఇండస్ట్రీ నష్టం రూ. 1,750 కోట్లు..

చికెన్‌‌ తింటే కొవిడ్‌‌ వైరస్‌‌ అంటుతుందని సోషల్‌‌ మీడియాలో ఫేక్‌‌ వార్తలు ప్రచారం అవ్వడంతో చికెన్‌‌ సేల్స్‌‌ భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. గత నెల రోజులలో  ఏకంగా రూ. 1,750 కోట్లను నష్టపోయామని ఏఐపీబీఏ తెలిపింది. ఫార్మ్‌‌ గేట్‌‌ లెవెల్‌‌లో  కేజీ పౌల్ట్రీ బర్డ్‌‌ రూ. 80 నుంచి రూ. 10–30 పడిపోయిందని పేర్కొంది. ప్రస్తుతం పౌల్ట్రీ ఇండస్ట్రీలో 10 లక్షల మందికి పైగా పౌల్ట్రీ రైతులు పనిచేస్తున్నారు. వీరు దేశ జీడీపీలో రూ. 1.2 లక్షల కోట్లను అందిస్తున్నారు. సోషల్‌‌మీడియాలో ప్రచారమవుతున్న ఫేక్ న్యూస్‌‌ వల్ల ఇండియాలో చికెన్‌‌ డిమాండ్‌‌ తగ్గిపోయిందని ఏఐపీబీఏ చైర్మన్‌‌ బహుదూర్‌‌‌‌ అలీ వాపోయారు. ఇది పౌల్ట్రీ ఇండస్ట్రీ దివాలాకు దారితీస్తోందని అన్నారు. కోళ్లకు దాణా తయారీకి వాడే మొక్కజొన్న, సోయాబీన్‌‌ రైతులపై కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మొక్కజొన్న ధర కేజీ రూ. 25 నుంచి రూ. 15 కి పడిపోవడమే దీనికి నిదర్శనమని  అన్నారు.