
న్యూఢిల్లీ: ప్రధాని మోడీతోపాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో టీకా వేయించుకోనున్నారని తెలుస్తోంది. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో మోడీ వ్యాక్సిన్ వేయించుకునే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాల అనధికార సమాచారం. ఈ నెల 11న సీఎంలతో జరిగిన మీటింగ్‌లో పొలిటీషియన్స్‌కు వ్యాక్సినేషన్ గురించి మోడీ పలు వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
‘తొలి దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ పూర్తయిన తర్వాత ప్రధాని మోడీ టీకా వేయించుకుంటారు. రాజకీయ నేతలు తమ వంతు వచ్చినప్పుడు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో మోడీ చెప్పారు’ అని ప్రభుత్వ వర్గాలు అనధికారికంగా తెలిపాయి. ఫస్ట్ ఫేజ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో హెల్త్‌కేర్ వర్కర్స్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు టీకా అందిస్తున్నారు. రెండో దశలో 50 ఏళ్లకు పైబడిన వారితోపాటు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులకు వ్యాక్సినేషన్ చేస్తారని నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రభుత్వ కొవిడ్-19 టాస్క్ ఫోర్స్‌కు హెడ్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ వినోద్ పాల్ తెలిపారు.