ప్రజాస్వామ్యానికి ..కార్పొరేట్​ సంకెళ్లు.

ప్రజాస్వామ్యానికి ..కార్పొరేట్​ సంకెళ్లు.

 భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిన్న ఘనంగా జరుపుకున్నాం. చాలామందికి ఛాతీ ఉప్పొంగింది, ఒళ్లు పులకరించింది. గర్వంగా భావించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి తేడా ఉన్నది. భారతదేశం రిపబ్లిక్​గా మారిన సందర్భాన్ని ప్రతి సంవత్సరం 26 జనవరి నాడు ఉత్సాహంగా జరుపుకుంటాం. 15 ఆగస్టు నాడు బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది భారతదేశం స్వతంత్ర దేశంగా పరిణమించిన రోజు. సులువుగా మాట్లాడుకుంటే ఒక రాజ్యాంగం ఆధారంగా మన దేశానికి, మన పాలనకు ప్రజలే అధిపతులుగా నిర్ణయించిన రోజు. అయితే, రానురాను ప్రజల ఆధిపత్యం తగ్గుతున్నది. రాజ్యాంగేతర శక్తుల ఆధిపత్యం పెరుగుతున్నది. 

అనేక రూపాలలో రిపబ్లిక్​కు ముప్పు ఏర్పడింది. ప్రజలు, ప్రజా వేదికలు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. పాలనకు, ప్రజలకు మధ్య అగాధం పెరుగుతున్నది. రిపబ్లిక్​కు ముప్పు పౌరులకు లేదా పౌర సమాజానికి ఉండే ముప్పు కంటే భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వ అస్తిత్వానికి, కొనసాగింపునకు ఉన్న బెదిరింపులను అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం రాజ్యాంగాన్ని  పరిశీలించాలి. ఎన్నికైన రాజకీయ ప్రజా ప్రతినిధులు ఎన్నికల ముందు, లేదా ప్రత్యర్థులను బలహీనపరచడానికి సాధారణంగా ఇచ్చే సందేశం ఏమిటంటే.. దేశానికి విపత్తు పొంచి ఉంది.- అది ఉగ్రవాద దాడి కావొచ్చు లేదా ఆర్థిక విపత్తు కావొచ్చు అని, ఆ విపత్తు స్వేచ్ఛకు ముప్పు కలగజేస్తుందని సందేశమిస్తారు. ఈ నాయకులు స్పృశించని అంశాలు ఏమిటంటే నాయకత్వంలో నైతిక క్షీణత, పర్యావరణ విధ్వంసం, పాలనలో తరుగుతున్న ప్రజల భాగస్వామ్యం. 

ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లు

పేదలు, బలహీన వర్గాలు తమ సంప్రదాయ, వారసత్వ ఆస్తులు కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వారికి ఉన్న భూమికి రేట్లు పెరిగిన కారణంగా, మార్కెట్ శక్తులు, ఆరాచక వర్గాలు, ప్రభుత్వం నుంచి కాపాడుకోవడానికి  నానా తంటాలు పడుతున్నారు. రాజ్యాంగం కల్పించిన రక్షణ ఏమాత్రం పనికిరావడం లేదు. అభివృద్ధి ప్రాజెక్టుల పేరు మీద, రకరకాలుగా ప్రజల వద్ద ఆస్తుల సేకరణ జరుగుతున్నది. ఊర్లకు ఊర్లు పారిశ్రామిక కారిడార్లుగా, విశాలమైన రోడ్లు, భారీ ఆనకట్టలు, విమానాశ్రయాలు వగైరా వాటికోసం తీసుకుంటున్నారు.

దానిని ఉమ్మడి ప్రయోజనాలకు ప్రతీకగా అభివర్ణిస్తున్నారు. ఓవైపు ప్రజలను నిర్వాసితులను చేస్తూ ప్రజా ప్రయోజనాల పేరిట ఒక తరగతి ప్రజలకు మేలు చేయడం, దానికి అభివృద్ధి అని నామకరణం చేసి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారు. గణతంత్ర రాజ్యంలో రెండు మాటలు విచ్చలవిడిగా వాడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఒకటి అభివృద్ధి. రెండవది జాతీయ భద్రత.  విచిత్రమేమంటే జాతీయ భద్రత పేరు మీద, దేశ ప్రయోజనాల పేరు మీద అరాచకాలను స్పష్టంగా ఎత్తిచూపేవారు కూడా ‘అభివృద్ధి’ మంత్రాన్ని సమర్థించడం. 

ప్రజల ఆయుధం రాజ్యాంగం

 ప్రజలకు ఇచ్చిన ఆయుధం రాజ్యాంగం. ప్రజలు తమ జీవితాన్ని నిర్వచించుకోవడం. సమష్టిగా నిర్ణయాలు తీసుకోవడం కోసం అనేక సంస్థలను ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగం ప్రభుత్వం పని చేయడానికి సమగ్రమైన వ్యవస్థను (ఫ్రేమ్‌‌వర్క్‌‌) అందిస్తున్నది. ఇటువంటి రాజ్యాంగం ఉన్న దేశంలో ఏకవ్యక్తి పాలన ఎట్లా సాధ్యం అయ్యింది? ఒక ముఖ్యమంత్రి తనకు తోచిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ రిపబ్లిక్ దేశంలో సాధ్యపడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రజాస్వామ్యంలో ‘రాచరిక’ పోకడలు రాజ్యాంగ సంస్థల వైఫల్యం వల్ల సాధ్యం అయ్యింది. ప్రజాస్వామ్యంలో ఉండే నాలుగు స్తంభాలు పని చేయకపోవడం వల్ల మన గణతంత్ర రిపబ్లిక్ వ్యవస్థలో ‘రాజులు’ రాజ్యమేలుతున్నారు. 

ఇబ్బడి ముబ్బడిగా ఒప్పందాలు

ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, రూపొందించే విధానాలు, అమలుపరిచే కార్యక్రమాలు, తయారు చేసే ప్రణాళికలు ప్రజల భాగస్వామ్యంతో చేయాలని రాజ్యాంగం చెబుతున్నది. ప్రస్తుతం ప్రపంచీకరణ నేపథ్యంలో నిర్ణయాలు దేశంలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తీసుకుంటున్నారు. మన దేశంలో ప్రజల అనుమతి తీసుకోకుండా, వారితో సంప్రదింపులు చేయకుండా అమలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా అనేక ఒప్పందాలపై భారత ప్రభుత్వ ప్రతినిధులు సంతకాలు పెడుతున్నారు. ఒక లెక్క ప్రకారం 2,25,000 అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి.

ఐక్యరాజ్య సమితి సంస్థల ఆధ్వర్యంలోనే దాదాపు 57 వేల ఒప్పందాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు ఈ మధ్య పెరిగినాయి. మన దేశం ఎన్ని ఒప్పందాలలో భాగస్వామిగా ఉన్నదో బహుశా ప్రభుత్వానికే తెలియకపోవచ్చు. 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు ఒప్పందం, తదుపరి 3 ఒప్పందాలు ఇక్కడ పార్లమెంటు సభ్యులు ప్రజలు వ్యతిరేకిస్తున్నా కూడా ప్రభుత్వం సంతకం పెట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటువంటి ప్రపంచ మహమ్మారి ఒప్పందం మీద కసరత్తు మొదలు పెట్టింది. దీని ముసాయిదా ప్రకారం ఒకసారి మహమ్మారి ప్రకటన వస్తే జాతీయ ప్రభుత్వాలు ఈ అప్రజాస్వామిక సంస్థ నిర్దేశం ప్రకారం నడుచుకోవాలి. ఈ సంస్థకు నిధులు దాదాపు 85 శాతం ప్రైవేటు సంస్థల నుంచే వస్తాయి.

ప్రజాస్వామ్యాన్ని ప్రజలు  కాపాడుకోవాలి

ప్రపంచ కుబేరుడు నడిపించే ఒక సంస్థ మన దేశంలో ఆరోగ్యమంత్రిత్వ శాఖ భవనంలో ఒక అంతస్తు మొత్తం తీసుకుని మన ప్రభుత్వ ‘ఆరోగ్య’ కార్యక్రమాలను నిర్దేశించింది అంటే పరిస్థితి ఏ మేరకు దిగజారిందీమనకు అర్థం అవుతుంది. పర్యావరణ వనరులను కాపాడడానికి చేసిన చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగార్చాయి. తెలంగాణాలో TSipass వంటివి, కేంద్రంలో ఇటీవల సవరించిన పర్యావరణ నిబంధనలు ఈ కోవలోకి వస్తాయి. కాలుష్యం చేసే పరిశ్రమలు, పర్యావరణానికి విఘాతం కలిగించే ఉత్పత్తుల కర్మాగారాలకు ప్రజల అనుమతి అవసరం లేకుండా చేశారు.  ప్రజల స్వేచ్ఛను హరిస్తున్న సంస్థలు, సంస్థాగత వ్యవస్థల గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. కరుడు గట్టిన కార్పొరేట్ సంకెళ్ల బారి నుంచి ప్రజాస్వామ్యాన్ని, రిపబ్లిక్​ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల ముందు ఉన్నది. 

ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తున్న కార్పొరేట్​ వ్యవస్థ

ప్రపంచ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఒక వాదన ఉన్నది. అమెరికాలో కొన్ని ప్రైవేటు ఫౌండేషన్​లు ఈ దిశగా పనిచేస్తున్నాయి. అప్పట్లో అమెరికా ప్రభుత్వం ప్రపంచంలో అడవులను కాపాడడం తన బాధ్యతగా భావించింది. ఇప్పటికే ఎవరు అడగకున్న ప్రపంచ పోలీసు పాత్ర చేపట్టిన ఈ దేశం గాజాలో ఇజ్రాయెల్ దాష్టీకాన్ని ఆపకపోవటం మనకు విదితమే. ప్రైవేటు శక్తులు కూడా గణతంత్ర స్వతంత్రాన్ని ఏదోవిధంగా నీరుకార్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే ఏటా స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్​లో ప్రపంచ కుబేరులు, వ్యాపారవేత్తలు నిత్యం సమావేశం అవుతుంటారు. ఈ సమావేశాలకు వివిధ దేశాల నాయకులను పిలిచి, వారి బుర్రలో వీరి ఆలోచనలను ప్రవేశపెట్టి ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తుంటారు. ప్రపంచ ఆర్థిక వేదిక కూడా ప్రపంచ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అని భావిస్తుంది. కార్పొరేట్ కంపెనీలు అనేక విధాలుగా, అనేక రూపాలలో ప్రభుత్వ విధానాలు తమకు అనుకూలంగా ఉండేలా ప్రయత్నాలు చేస్తుంటాయి.

మంత్రివర్గం ‘ఉత్సవ’ పాత్ర

కేంద్రంతో సహా అనేక రాష్ట్రాలలో, సమష్టి నిర్ణయాలు తీసుకునే మంత్రివర్గం ‘ఉత్సవ’ పాత్రకు పరిమితం అయ్యింది. ప్రభుత్వ భవనాలలో కాకుండా వ్యక్తిగత బంగళాల్లో పరిపాలన నిర్ణయాలు తీసుకుంటారు. మంత్రుల సంఖ్యకు తగ్గట్టుగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఆఫీసుల్లో అధికారులు నియమిస్తున్నారు. ఈ ‘అధికార’ గణం ద్వారానే ప్రభుత్వ పరిపాలన సాగుతున్నది. తెలంగాణాలో గత ముఖ్యమంత్రిని కలవడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు నెలల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి పరిపాలన వ్యవస్థ దిగజారుడుకు సంకేతం. దీనికన్నా ఎక్కువ ప్రజలను కలవకపోవడం.

తెలంగాణాలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తమిళనాడులో జయలలిత, ఒడిశాలో నవీన్ పట్నాయక్ వంటి వారు తాము నిర్ణయించిన తేదీ, సమయం, స్థలం ప్రకారం ప్రజలు కలిసేవిధంగా వ్యవహరించారు. పరిపాలన భవనాలు దాదాపు అన్ని రాజధానులలో, ఢిల్లీ సహా, ప్రజలు చేరుకోవడం గగనం అయిపోయింది. సెక్యూరిటీ పేరిట ప్రజలు తమ ‘సేవకులు’ పనిచేసే ప్రదేశానికి రాకుండా అనేక ఆంక్షలు ఉన్నాయి. అయితే, సూటు, సూటుకేసులు, విజిటింగ్ కార్డులు ఉన్నవారికి ఇవి వర్తించవు. వారితో రాని ‘భద్రత’ ఆందోళన సామాన్య ప్రజల వల్ల వస్తుందని ప్రభుత్వం భావించడం శోచనీయం. 

- డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్