మన పత్తి మహారాష్ట్రకు 

మన పత్తి మహారాష్ట్రకు 
  • మాయిశ్చర్ పేరిట వ్యాపారుల కొర్రీలు
  • ప్రతి క్వింటాకు రూ. 600 దాకా కోతలు
  • మహారాష్ట్రలో కొర్రీలేం లేకుండా కొనుగోళ్లు
  • ఆడికి పోవుడే ఆలస్యం కాంటేసుడు.. పైసలిచ్చుడే 
  • క్వింటాకు రూ.8 వేలకు పైనే ఇస్తున్న అక్కడి వ్యాపారులు
  • బార్డర్​ మండలాల్లోని పత్తి బండ్లన్నీ అటువైపే..

ఆదిలాబాద్​ జిల్లా తలమడుగు మండలానికి చెందిన ఓ రైతు తన 20 క్వింటాళ్ల పత్తిని వెహికల్​లో మహారాష్ట్రలోని పాండ్రకవాడ్​కు తీసుకెళ్లాడు. ఆదిలాబాద్ పత్తి మార్కెట్​లో తేమ పేరిట వ్యాపారులు రేట్లు తగ్గిస్తున్నారు. లీడర్లు, ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు. మహారాష్ట్రలో వ్యాపారులేమో మాయిశ్చర్​ ఊసే ఎత్తకుండా క్వింటాకు రూ.8,500 దాకా రేటు పెడుతున్నారు. దీంతో బార్డర్​గ్రామాల్లోని రైతులంతా మహారాష్ట్ర బాటపడుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్​ జిల్లాలోని తాంసి, తలమడుగు, బేల, జైనథ్, బోథ్, బజార్ హత్నూర్, ఇంద్రవెళ్లి, జైనూర్, నార్నూర్, ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి, ఆసిఫాబాద్, వాంకిడి, కాగజ్​నగర్, రెబ్బెన, తిర్యాణి, నిర్మల్ జిల్లాలోని భైంసా, తానూర్, ముథోల్, కుబీర్, కుంటాల మండలాల రైతులంతా తమ పత్తిని నేరుగా మహారాష్ట్రకే తరలిస్తున్నారు. కొందరు మహారాష్ట్ర వ్యాపారులు కూడా ఇక్కడికొచ్చి రైతులను కలిసి పత్తినంతా తమకే అమ్మాలని అడ్వాన్స్​లు కూడా ఇచ్చిపోతున్నారు. వారే కూలీలు, వాహనాలను తీసుకొచ్చి మాయిశ్చర్​తో సంబంధం లేకుండా నేరుగా పత్తిని తీసుకెళ్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి 10 శాతం పత్తిని మహారాష్ట్ర వ్యాపారులు తీసుకెళ్లారు. ఇప్పటికైనా ఇక్కడి వ్యాపారుల తేమ విషయంలో వెనక్కి తగ్గకపోతే 80 శాతం పత్తి మహారాష్ట్రకు వెళ్లే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో 100కు పైగా జిన్నింగ్​ మిల్లులకు ఈ ఏడాది 80 లక్షల క్వింటాళ్లకుపైగా పత్తి రానుందని ఆఫీసర్లు అంచనా వేస్తుండగా 60 లక్షల క్వింటాళ్లు మహారాష్ట్ర వెళ్లే అవకాశముంది. 
ఇక్కడి వ్యాపారుల అత్యాశ 
ఈసారి ఇంటర్నేషనల్ మార్కెట్ లో కాటన్ బేల్ రూ. 40 వేలకుపైగా పలుకుతున్నట్లు ట్రేడర్స్ చెబుతున్నారు. ఇది ఇంకా పెరగొచ్చు. ఒక్కో బేల్ తయారు చేయడానికి ట్రేడర్స్ 5 క్వింటాళ్ల పత్తిని వాడతారు. ఇందులో 170 కిలోల లింట్ (నాణ్యమైన పత్తి), 325 కిలోల సీడ్ వస్తుంది. లింట్ ద్వారా తయారయ్యే బేల్ కు రూ. 35 వేలు రాగా 325 కిలోల సీడ్​కు క్వింటాకు రూ. 3,300 లెక్కన మరో రూ. 10 వేలకుపైగా వస్తుంది. అంటే ప్రతి క్వింటాల్​పై వెయ్యి దాకా మిగిలే చాన్స్ ఉన్నా ఇక్కడి వ్యాపారులు అత్యాశతో తేమ పేరిట రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు.