అమర జవాన్లను దేశం ఎన్నడూ మరిచిపోదు

అమర జవాన్లను దేశం ఎన్నడూ మరిచిపోదు

అమర జవాన్లను దేశం ఎన్నడూ మరిచిపోదన్నారు ప్రధాని మోడీ. న్యూఢిల్లీలో ఇండియా గేట్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ‘నేషనల్ వార్’ మెమోరియల్‌ను మోడీ సోమవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన 26,000 మంది వీరజవాన్ల  స్మృతి చిహ్నంగా ‘జాతీయ వార్ మెమోరియల్’ ఏర్పాటు చేశామన్నారు. వార్ మెమోరియల్ ఏర్పాటు ద్వారా అమరవీరులను ఎట్టకేలకు దేశం గౌరవించుకోలుగుతోందని అన్నారు. సైనికుల 60 ఏళ్ల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. సైనికులకు ‘వన్ మ్యాన్ వన్ ర్యాంక్’ అమలు చేసిన ఘనత తమకు దక్కుతుందన్నారు. బలగాల్లో మహిళల పాత్రపై కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాంటి నిర్ణయం తీసుకోవడం అసాధ్యమని అందరూ అన్నా తాము సుసాధ్యం చేసి చూపించామని చెప్పారు. రక్షణ ఉత్పత్తుల సేకరణలో మార్పులు చేశామని, రక్షణ ఉత్పత్తుల తయారీలో ప్రైవేటు కంపెనీల సంఖ్య కూడా ముందు ఎన్నడూ లేని విధంగా పెరిగిందని చెప్పారు.

జాతీయ భద్రత విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీ పడ్డాయని మోడీ ఆరోపించారు. తాము మాత్రం దేశ రక్షణ, బలగాల అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చామని, అస్సాల్ట్ రైఫిల్స్ కోసం భారీ ఆర్డర్లు ఇచ్చామని, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లేకుండా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైనికుల కోసం 2 లక్షల 30 వేల బుల్లెట్ ప్రూవ్ జాకెట్లు కొనుగోలు చేశామని, మరో 2 లక్షల 30 వేల బుల్లెట్ ప్రూవ్ జాకెట్లు సమకూర్చనున్నామని చెప్పారు. భారత సైనిక శక్తి ప్రపంచదేశాలకు చాటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్… రాబోయే ఏళ్లలో మన సైనికుల ధైర్యసాహసాలను, వారి అంకిత భావాన్ని ఈ వార్ మెమోరియల్ గుర్తు చేస్తుంటుందన్నారు.