
ఇప్పుడున్న బిజీ లైఫ్ లో భార్యాభర్తలకు మనఃస్పూర్తిగా మాట్లాడుకునేందుకు సమయమే ఉండట్లేదు. రోజంతా ఆఫీస్ పనులు, ఇంటి పనులతోనే సరిపోతుంది.ఓ గంట ఖాళీ దొరికితే జిమ్ కి వెళ్లడమో, ఇంట్లో వర్కవుట్లు చేయడమో చేయాలి. ఇక తీరిగ్గా కాసేపు పార్ట్నర్ తో స్పెండ్ చేసే టైం ఏది? అందుకే ఫిట్ నెస్ ను , రిలేషన్ షిప్ ని కలుపుతూ కొత్తగా 'కపుల్ ఫిట్ నెస్' అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. . .
చాలా ఫ్యామిలీస్ లో భార్యాభర్తలిద్దరూ జిమ్ కు వెళ్తుంటారు. అదేదో ఇద్దరూ కలిపి వెళ్తే సరి. జిమ్కి వెళ్లని వాళ్లు ఇంట్లో కూడా కలిపి వర్కవుట్స్ చేసుకోవచ్చు. ఇలా కలిసి వర్కవుట్స్ చేయడం వల్ల ఫిట్నెస్ గోల్స్ తో పాటు. ..రిలేషన్ షిప్ గోల్స్ కూడా సాధించొచ్చని నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతం ఉన్న హైటెక్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇప్పుడు అందరినీ బాగా ఇబ్బంది పెడుతున్నాయి. షుగర్, బీపీ, అధిక బదువు, కార్డియోవాస్కులర్ రోగాలు, ఇలా ఎన్నో సమస్యలకు ఫిట్ నెస్ లేకపోవడమే కారణం అని డాక్టర్లు చెప్తున్నారు. అందుకే భార్యాభర్తలిద్దరూ ఫిట్ నెస్ సెంటర్ వెంట పడుతున్నారు. అయితే విడివిడిగా కాకుండా కలిసి వర్కవుట్లు చేయడం వల్ల ఫిట్నెస్ తో పాటు రిలేషన్ లో కూడా చాలా మార్పులొచ్చాయి అని చాలా మంది చెప్పడంతో కపుల్ ఫిట్ నెస్' ట్రెండ్ అవుతోంది... కపుల్స్ చేసే వర్కవుట్ లో సాధారణంగా చేసే అన్ని వర్కవుట్లు కలిసి చేయుచ్చు స్క్వాట్స్, సిటప్స్, ప్లాంక్ లాంటివి.
స్క్వాట్స్..:స్క్వాట్స్ ను కింగ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటారు. అయితే కపుల్ ఫిట్నెస్ లో దీన్ని ఎవరికి వాళు చేయకుండా ఒకరి సహాయం ఇంకొకరు తీసుకుని చేయాలి. ముందుగా కపుల్స్ ఇద్దరూ చెరో వైపు తిరిగి రెండు కాళ్ల మధ్య కొంచెం దూరం ఉండేలా నిటారుగా నిలబడాలి. ఊపిరి బలంగా పీల్చి గోడ కుర్చీ వేసే విధంగా కూర్చోవాలి ఇక్కడ గోడ మీ పార్ట్నర్ వీవు అన్నమాట కొంచెం సేపు అలాగే ఉండి.. తర్వాత నిలబడేప్పుడు. ఊపిరిని మెల్లగా వదలాలి. ఇలా ఎక్సర్ సైజ్ ను రిపీట్ చేయాలి. పార్ట నర్ సపోర్ట్ తో చేయడం వల్ల చాలా సరదాగా అనిపిస్తుంది.
సెటప్స్ : ఫ్లోర్ మీద వెల్లకిలా పడుకొని మోకాళ్ళను ముందుకు ముడుచుకొని పడుకోవాలి. తర్వాత కాళ్లు కదలకుండా నడుము పైభాగం పైకి లేపే ప్రయత్నం చేయాలి. కాళ్లు కదలకుండా పార్ట నర్ సాయం తీసుకోవచ్చు. అలా సిటప్స్ ను రిపీట్ చేయాలి. దీని వల్ల పొట్ట తగ్గడంతో పాటు నడుము చుట్టూ ఉన్న కండరాలు బలపడతాయి.
ఫ్లాంక్: నేలపై పడుకొని మోచేతులని, కాలి వేళ్లను బేస్ చేసుకుని శరీరం మొత్తాన్ని పైకి లేపాలి. ఇలా చేయడం వల్ల పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. కండరాలు కూడా గట్టిపడతాయి. ఇలా పార్ట్ నర్ తో కలిసి చేస్తూ ఎవరు ఎక్కువ సేపు ఉండగలుగుతారో చిన్న పోటీ పెట్టుకోవచ్చు. అలాగని మరీ ఎక్కువసేపు కూడా ఉండకూడదు. ఇవే కాదు. మిగతా వ్యాయామాలు కూడా పార్ట నర్ తో కలిసి చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఉత్సాహంతో పాటు సరదాగా ఉంటుంది.
ఇవి కూడా ట్రై చేయండి.. .
- రోజూ ఒక్కరే జాగింగ్ కు వెళితే బోర్ కొడుతుంది. అందుకే ఈ సారి మీకు తోడుగా మీ పార్ట నర్ ను వెంట తీసుకెళ్లండి. జాగ్ చేస్తూ శరీరంలో కొవ్వు కూడా కరిగించుకోవచ్చు. రెస్ట్ తీసుకునేటప్పుడు ఇద్దరూ మాట్లాడుకోవచ్చు.. అలాగే స్విమ్మింగ్. రోజూ ఒక్కరే వెళ్తే నాలుగు రోజులకు విసుగొస్తుంది. అదే మీ పార్ట నర్ ను కూడా వెంట తీసుకెళ్తే సరదాగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగానూ ఉంటుంది.
లాభాలివి...
- ఇద్దరూ కలిసి వర్కవుట్ చేయడంవల్ల శారీరకంగానే రాదు మానసికంగానూ బంధం బలపడుతుంది.
- ఏదైనా ఒకరోజు ఒకరు బద్దకిస్తే మరొకరు బలవంతంగా వాళ్లతో వ్యాయామం చేయించవచ్చు.
- రోజూ కలిసి వ్యాయామం చేస్తే కపుల్స్ మధ్య తలెత్తే చిన్నచిన్న సమస్యలకు కౌన్సెలింగ్ సెంటర్ వరకు వెళ్లవలసిన అవసరం ఉండదు.
- కలిసి వ్యాయామం చేయడం వల్ల తమపై తమకు నమ్మకం పెరిగి, ఇద్దరిలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
- కలిసి వ్యాయామం చేయడం వల్ల ఎండార్సిన్ హార్మోన్లు (హ్యాపీ హార్మోన్లు)విడుదలవుతాయి. కాబట్టి ఎక్కువ ఆనందంగా ఉండొచ్చు.
- కబుర్లు చెప్పుకునే టైం దొరుకుతుంది. ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకోవచ్చు.
- పెట్టుకున్న ఫిట్ నెస్ లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చు. బద్ధకంగా ఉన్నా, మనసు బాగా లేకున్నా ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేస్తూ వ్యాయామం చేసే వీలుంటుంది.
- మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్నచిన్న విషయాలకు చిరాకు పడడం తగ్గుతుంది. ఒత్తిడి అలసట కూడా రావు
ఇవి చూసుకోండి.
- జంటగా వర్కవుట్ చేయడం వెనక ఉన్న ఆలోచన కలిసి సమయం గడపడం, ఆ సమయాన్ని ఆస్వాదించడం. ఒకరితో ఒకరికి సంబంధం లేనట్టు ఎవరి వర్కవుట్ వాళ్ల చేసుకునేటట్లయితే ఈ వర్కవుట్స్ లో ఆనందం మిస్ అవుతుంది.
- అలాగే భార్యాభర్తలిద్దరూ కలిసి వర్కవుట్స్ చేసినంత మాత్రాన ఇద్దరూ ఒకే వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. శరీరం తీరుని బట్టి ఇద్దరికీ డిఫరెంట్ వర్కవుట్స్ ఉంటాయి. అని కూడా చూసుకోవాలి
-–వెలుగు,లైఫ్–