- శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతుండడంతో సాధ్యం కాదని చేతులెత్తేసిన లంక బోర్డు
- ఇప్పటికే నెలాఖరు వరకు విదేశీ విమానాలను నిషేధించిన శ్రీలంక ప్రభుత్వం
కొలంబో: కరోనా పంజా ఆసియా కప్ పై కూడా పడింది. టోర్నీ నిర్వాహక దేశం శ్రీలంకలో వచ్చే నెలలోపు కేసులు తగ్గే సూచనలు లేకపోవడంతో టోర్నీ నిర్వహించలేమంటూ శ్రీలంక బోర్డు చేతులెత్తేసింది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యాప్లే డిసిల్వా ప్రకటించారు. మరోవైపు అసియా క్రికెట్ కౌన్సిల్ దీనిపై అధికారికంగా ఇంకా స్పందించలేదు. బీసీసీఐ కార్యదర్శి జైషా నేతృత్వంలోని ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశమై చర్చించిన తర్వాతే నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. దాయాది పాకిస్తాన్ లో జరగాల్సిన ఈ టోర్నీని శ్రీలంకకు మార్చారు. భారత్ -పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ వెళ్లేందుకు సంకోచిడంతో వేదికను శ్రీలంకకు మార్చారు. అయితే ప్రస్తుతం శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతుండడంతో టోర్నీ నిర్వహించలేమని ఆ దేశ బోర్డు చేతులెత్తేసింది. ఇప్పటికే ప్రభుత్వం విదేశీ విమానాల రాకపోకలను వచ్చే 10 రోజుల వరకు నిషేధం విధించింది. ఈ పరిస్థితుల్లో టీ0 టోర్నీని 2023కు వాయిదా వేస్తే బాగుంటుందని లంక బోర్డు సూచించింది. 2023 వన్డే ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ఆసియాకప్ ను నిర్వహిస్తే బాగుంటుందని లంక బోర్డు చీఫ్ డిసిల్వా పేర్కొన్నారు.
