వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్ : అమెరికా శాస్త్రవేత్త

వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్ : అమెరికా శాస్త్రవేత్త

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ఎలా పుట్టుకొచ్చిందనే అనుమానాలు ఇంకా తొలగిపోలేదు. ఈ క్రమంలో చైనాలోని వూహాన్ ల్యాబ్‌లో పనిచేసిన అమెరికా శాస్త్రవేత్త సంచలన విషయాలు వెల్లడించారు. కరోనా వైరస్ మానవ నిర్మితమని అమెరికా ఎపిడమాలజిస్ట్ ఆండ్రూ హఫ్ ది సన్ పత్రికకు  తెలిపినట్లు న్యూయార్క్ పోస్ట్ రిపోర్ట్ చేసింది.

చైనా సర్కార్ నిర్వహించే వూహాన్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచే రెండేళ్ల క్రితం లీక్ అయ్యిందని తాను రాసిన ‘ది ట్రూత్ అబౌట్ వూహాన్’ లో పేర్కొన్నట్లు ఆ పోస్ట్ సారాంశం. చైనాలోని కరోనా వైరస్లకు అమెరికా ప్రభుత్వం నిధులు సమకూర్చడం వల్ల ఈ మహమ్మారి సంభవించిందని హఫ్  ఆ బుక్ లో పేర్కొన్నారు.

సరైన జీవ భద్రత, బయోసెక్యూరిటీ, రిస్క్ మేనేజ్‌మెంట్‌ను నిర్ధారించడానికి విదేశీ ప్రయోగశాలలలో తగిన నియంత్రణ చర్యలు లేవు.. దీంతో చివరికి వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో వైరస్‌ లీక్‌కు దారితీసింది” అని ఆండ్రూ హఫ్ తన పుస్తకంలో వివరించారు. ఇది జన్యుపరంగా అభివృద్ది జరిగిందని.. దీని గురించి చైనాకు ముందు నుంచి తెలుసని తెలిపారు. అపాయకరమైన ఈ బయో టెక్నాలజీని చైనీయులకు బదిలీ చేయడానికి యూఎస్ ప్రభుత్వమే కారణమన్నారు.  

అంటువ్యాధులపై అధ్యయనం చేసే న్యూయార్క్‌లోని ‘ఎకోహెల్త్‌ అలయన్స్‌’కు ఆండ్రూ హఫ్స్‌  2014 - -16 మధ్య కాలంలో ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సంస్థ ఎన్నోఏళ్లుగా గబ్బిలాల్లో కరోనా వైరస్‌లపై  అధ్యయనం చేస్తోంది. దీనికి అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ నిధులు సమకూరుస్తుండగా.. చైనాలోని వుహాన్‌ వైరాలజీ ల్యాబ్‌తో కలిసి పనిచేసింది. అయితే, కొవిడ్‌ బయటపడిన సమయంలో వుహాన్‌ ల్యాబ్‌పై ఎన్నో ఆరోపణలు రావడంతో ట్రంప్‌ హయాంలో దానికి నిధులను నిలిపివేశారు.

మూడేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న కరోనా మహమ్మారి లక్షల సంఖ్యలో ప్రజల్ని బలి తీసుకుంది. ఇప్పటీకీ దాని ప్రభావం తగ్గలేదు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా.. వ్యాధి తన రూపాన్ని మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ఇకపై కోవిడ్-19తో సహజీవనం చేయాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. కరోనా వైరస్ ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్, మళ్లీ ఓమిక్రాన్ లో సబ్ వేరియంట్లుగా రూపాంతరం చెందుతూనే ప్రజలపై దాడి చేస్తోంది.