- 48 వేల మంది ఆర్టీసీ కార్మికులను తొలగించడం దారుణం
- కార్మిక పోరాటాల అణచివేత సరికాదు: సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ, వెలుగు: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి కారణంగా కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఇదేనా అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. కార్మిక పోరాటాలను అణచివేసేందుకు ప్రయత్నించడం ఉద్యమ పార్టీగా చెప్పుకునే టీఆర్ఎస్ సర్కారుకు సరికాదన్నారు. తమ సమస్యల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెని టీఆర్ఎస్ సర్కారు గౌరవించాలని, కోర్టులు చెప్పినా వినకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మంగళవారం ఢిల్లీ రవిశంకర్ శుక్లా మార్గ్ లోని తన నివాసంలో ఏచూరి మీడియాతో మాట్లాడారు. 48 వేల మంది కార్మికులను ఒకేసారి తొలగిస్తున్నట్టు సీఎం ప్రకటించడం అనుచితమని, కార్మికుల సమస్యల పరిష్కారంపై ఇంత క్రూరంగా దృష్టి సారించకూడదని, కార్మికులను పిలిచి చర్చలు జరపాలని ఏచూరి సూచించారు. వాళ్ల డిమాండ్లపై ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉంటే.. కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించి వాస్తవాలపై మంతనాలు జరపాలన్నారు. ఇటువంటి కీలక సమయాల్లోనే సానుకూలంగా వ్యవహరించడం ప్రజా ప్రభుత్వమని చెప్పుకునే టీఆర్ఎస్ సర్కార్ కనీస బాధ్యత అని గుర్తు చేశారు. ఇప్పటికైనా కార్మిక సంఘాలను పిలిచి వారికి న్యాయం చేయాలని ఏచూరి డిమాండ్ చేశారు.

