రొనాల్డోకు రూ.1800 కోట్ల బంపర్ ఆఫర్

రొనాల్డోకు రూ.1800 కోట్ల బంపర్ ఆఫర్

ఇంగ్లండ్ కు చెందిన విఖ్యాత ఫుట్ బాల్ క్లబ్ ‘మాంచెస్టర్ యునైటెడ్’ ఇటీవల(నవంబరు 22న) పోర్చుగల్ మెరుపు వీరుడు క్రిస్టియానో రొనాల్డోను టీమ్ నుంచి తొలగించడం సంచలనం సృష్టించింది. ఈ చేదు వార్తను విన్న రొనాల్డో కు.. వారమైనా గడవకముందే ఒక తీపి కబురు వినిపించింది. అదేమిటంటే.. ఆయనకు ఏకంగా రూ.1800 కోట్ల  ప్యాకేజీతో రెడ్ కార్పెట్ ను పరిచేందుకు సిద్ధమని సౌదీ అరేబియా ఫుట్ బాల్ క్లబ్ అల్ నస్ర్ ప్రకటించింది. అయితే దీనిపై రొనాల్డో ఇంకా తన స్పందనను అల్ నస్ర్ టీమ్ కు తెలియజేయలేదు.  

ఏడాదికి రూ.612 కోట్లు చొప్పున..

ఏడాదికి రూ.612 కోట్లు చొప్పున మూడేళ్లలో దాదాపు రూ.1800 కోట్లు రొనాల్డోకు పారితోషికంగా చెల్లించేందుకు అల్ నస్ర్ టీమ్ సిద్ధమైనట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం రొనాల్డో వయసు 37 ఏళ్లు..  ఒకవేళ ఈ ఒప్పందానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే 40 ఏళ్ల వయసు వరకు అల్ నస్ర్ టీమ్ కోసం ఫుట్ బాల్ లీగ్ గేమ్స్ ఆడాల్సి ఉంటుంది.

6 నెలల కిందటే..

ఈ ఏడాది వేసవికాలంలోనే (దాదాపు 6 నెలల కిందటే)  దీనిపై రొనాల్డో, అల్ నస్ర్ టీమ్ మేనేజ్మెంట్ మధ్య చర్చలు జరిగాయని అంటున్నారు. ఈ బంపర్ డీల్ పై స్పష్టత రావాలంటే ఇంకొన్ని నెలలు ఆగాల్సిందేనని క్రీడారంగ పరిశీలకులు చెబుతున్నారు. కాగా, అల్ నస్ర్ అనేది ఆసియా ప్రాంతంలో అత్యంత సక్సెస్ ఫుల్ ఫుట్ బాల్ లీగ్ క్లబ్.  ఇప్పటివరకు ఇది 9 లీగ్ టైటిల్స్ ను సాధించింది.