మాకు కరోనా ఎట్ల వచ్చిందో ఇప్పటికీ తెలుస్తలే

మాకు కరోనా ఎట్ల వచ్చిందో ఇప్పటికీ తెలుస్తలే

 

ముంబై: అంతా సాఫీగా సాగితే  ఈపాటికి  ఐపీఎల్‌‌ 14వ సీజన్‌‌ లాస్ట్‌‌ స్టేజ్‌‌కు వచ్చేది. లీగ్‌‌ దశ ముగిసి ప్లేఆఫ్స్‌‌ వార్ ​మొదలయ్యేది. కానీ, హోరాహోరీ పోరాటాలతో ఫ్యాన్స్‌‌ను అలరిస్తున్న మెగా లీగ్‌‌ను కరోనా వైరస్‌‌ దెబ్బకొట్టింది.  నాలుగు ఫ్రాంచైజీలకు చెందిన ప్లేయర్లు, కోచింగ్, సపోర్ట్‌‌ స్టాఫ్ ​వైరస్‌‌ బారిన పడడంతో ఈనెల 4న బీసీసీఐ.. లీగ్‌‌ను వాయిదా వేసింది. ఆ తర్వాత కూడా మరికొన్ని టీమ్స్‌‌లో కరోనా కేసులు వెలుగు చూశాయి. ఇలా బబుల్‌‌లో  పాజిటివ్‌‌గా తేలిన వాళ్లలో ఇండియా మాజీ పేసర్, సీఎస్‌‌కే బౌలింగ్‌‌ కోచ్​లక్ష్మీపతి బాలాజీ, కోల్‌‌కతా నైట్‌‌ రైడర్స్‌‌ స్పిన్నర్​ వరుణ్​ చక్రవర్తి, సన్‌‌రైజర్స్‌‌ కీపర్​ వృద్ధిమాన్‌‌ సాహా ఉన్నారు. వైరస్‌‌ను జయించిన ఈ ముగ్గురూ ప్రస్తుతం తమ ఇళ్లకు చేరుకున్నారు. వైరస్‌‌ బారిన పడే ముందు ఏం జరిగింది.. మహమ్మారి బారి నుంచి ఎలా బయటపడ్డారు.  ఇప్పుడు వాళ్ల హెల్త్​  ఎలా ఉందన్న విషయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం..

బబుల్‌‌ను బ్రేక్‌‌ చేయలేదు: బాలాజీ

కరోనా పాజిటివ్‌‌గా తేలినప్పటి నుంచి నేను సెల్ఫ్‌‌ ఐసోలేషన్‌‌లో ఉన్నా. మే 2న నాకు ఒంట్లో బాగా అనిపించలేదు. ఒళ్లు నొప్పులతో పాటు ముక్కు దిబ్బడ ఉండడంతో అదే రోజు మధ్యాహ్నం  టెస్టు చేయించుకున్నా. తర్వాతి రోజు ఉదయం రిజల్ట్‌‌ వచ్చింది. పాజిటివ్‌‌ అని తేలడంతో  షాకయ్యా. ఎందుకంటే నేను బయో బబుల్‌‌ రూల్స్‌‌ను బ్రేక్‌‌ చేయలేదు. మేమంతా (సీఎస్‌‌కే టీమ్‌‌) ఏప్రిల్‌‌ 26న ముంబై నుంచి ఢిల్లీకి వచ్చాం. ఆ తర్వాతి రోజు మమ్మల్ని టెస్టు చేశారు. 28న  ఓ మ్యాచ్‌‌లో పాల్గొన్నాం. తర్వాతి రోజు మరోసారి  టెస్టులు చేశారు. ఆపై, మే 1న ముంబైతో మ్యాచ్‌‌ ఆడాం. అయితే, మే2న జరిగిన టెస్టింగ్‌‌లో నాతో పాటు కాశీ విశ్వనాథ్​ (సీఎస్‌‌కే సీఈవో), ఓ హెల్పింగ్ స్టాఫ్​ మెంబర్​ పాజిటివ్‌‌గా తేలారు. అదే రోజు మరోసారి టెస్టు చేయించుకున్నా.. పాజిటివ్‌‌ రావడంతో టీమ్‌‌ నుంచి వేరు చేసి నన్ను హోటల్‌‌లో ఇంకో ఫ్లోర్​కు తీసుకెళ్లారు. నెమ్మదిగా సమస్య తీవ్రత అర్థం చేసుకున్నా. ఐసోలేషన్‌‌ రెండో రోజు కొంత టెన్షన్‌‌ అనిపించింది. నేను పాజిటివ్‌‌గా తేలకముందు నాతో కలిసున్న టీమ్‌‌ మెంబర్స్‌‌ గురించి ఎక్కువ ఆందోళన చెందా. వాళ్లలో ఎవరైనా పాజిటివ్‌‌గా తేలితే ఎలా అనే ప్రశ్నలు నన్ను వెంటాడాయి. అప్పుడే మైకేల్‌‌ హస్సీ (సీఎస్‌‌కే బ్యాటింగ్‌‌ కోచ్‌‌) కూడా వైరస్‌‌ బారిన పడ్డాడని తెలిసింది. అయితే, మాకు కరోనా వైరస్‌‌ ఎప్పుడు, ఎలా సోకిందో ఇప్పటికీ  తెలియదు. ఎందుకంటే  మార్చి తొలి వారంలో  సీఎస్‌‌కే ప్రిపరేటరీ క్యాంప్‌‌ మొదలైనప్పటి నుంచి మేం బబుల్‌‌లోనే ఉన్నాం. గత సీజన్‌‌లో మా టీమ్‌‌ మెంబర్స్‌‌ పాజిటివ్‌‌గా తేలిన అనుభవంతో ఫ్రాంచైజీ ఈ సారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఐపీఎల్‌‌ తొలి దశ కోసం చెన్నై, ముంబైకి ట్రావెల్‌‌ చేసినప్పుడు కూడా చాలా అప్రమత్తంగా ఉంది. ఢిల్లీలో కూడా మేం స్ట్రిక్ట్‌‌ ప్రోటోకాల్స్‌‌ పాటించాం. అయినా,  మేం ఎక్కడ ఇన్‌‌ఫెక్ట్‌‌ అయ్యామో నాకు అర్థం కావడం లేదు.. అలాగే,  టీమ్‌‌లో ఇద్దరమే ఎందుకు పాజిటివ్‌‌గా తేలాం? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు.
ఢిల్లీలో పరిస్థితి ఘోరంగా ఉండడంతో నన్ను, హస్సీని మే 6న ఎయిర్ అంబులెన్స్‌‌లో చెన్నైకి తరలించారు. 12 రోజులు హాస్పిటల్‌‌లో గడిపిన తర్వాత చివరకు మే 14న చెన్నైలోని మా ఇంటికి తిరిగొచ్చాను. నా కెరీర్​లో నేను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. కానీ, మహమ్మారిని ఎదుర్కొనేందుకు భిన్నమైన యుద్ధం చేయాల్సి వచ్చింది. నేను ఎంత అదృష్టవంతుడినో ఇప్పుడు తెలుస్తోంది. 

ఓషో పుస్తకాలు చదివా: వరుణ్ చక్రవర్తి

కరోనాతో పోరాడుతున్నప్పుడు మనం దాని గురించి అతిగా ఆలోచించి భయపడకూడదు.ఫ్యామిలీకి, టీమ్‌‌మేట్స్‌‌కు దూరంగా ఒంటరిగా ఉన్నప్పుడు టెన్షన్‌‌ సహజం.  నేనైతే  నా ఆలోచనలు ఇతర విషయాలపై ఉంచా.  ఓషో పుస్తకాలు చదివా. అవి నాకు ప్రశాంతతను కలిగించాయి.  ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నా. ఇంట్లో  కోలుకుంటున్నా. అయితే, కరోనా తర్వాతి లక్షణాల కారణంగా ఇంకా ట్రెయినింగ్ రీస్టార్ట్‌‌ చేయలేదు. నాకు జలుబు, జ్వరం లేవు. అయినా బాడీ ఇంకా వీక్‌‌గానే ఉంది.  మైకంగా అనిపిస్తోంది. ఇప్పటికీ కొన్నిసార్లు రుచి, వాసన తెలియడం లేదు. కానీ, తొందర్లోనే ప్రాక్టీస్‌‌ స్టార్ట్‌‌ చేస్తానన్న నమ్మకం ఉంది. నాకు కరోనా ఎలా సోకిందో గుర్తు చేసుకుంటే.. మే1న కాస్త ఇబ్బందిగా, అలసటగా అనిపించింది. దగ్గు లేకపోయినా  కొంచెం జ్వరంగా ఉండడంతో ట్రెయినింగ్‌‌ సెషన్‌‌కు దూరంగా ఉన్నా. వెంటనే టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌కు సమాచారం ఇవ్వగా వాళ్లు ఆర్టీపీసీఆర్​ టెస్టు చేయించి  హోటల్‌‌లో వేరే భాగంలో నన్ను ఐసోలేట్‌‌ చేశారు. కొద్దిసేపటికే పాజిటివ్‌‌ రిపోర్టు వచ్చిందని తెలియడంతో కాస్త కంగారు పడ్డా. మొత్తంగా 12 రోజుల పాటు ఐసోలేషన్‌‌లో ఉన్నా. అన్ని రోజులూ ఒకేలా అనిపించింది.  గదిలో ఒంటరిగా ఉండి.. రోజూ ఒకే రకమైన ఫుడ్‌‌ తీసుకోవాల్సి వచ్చింది. అయితే, రోజు గడిపేందుకు నేను అనేక మార్గాలు అన్వేషించా. కాస్త ఆలస్యంగా ఉదయం 9 గంటలకు లేచి బ్రేక్‌‌ఫాస్ట్‌‌ చేసిన వెంటనే నెట్‌‌ఫ్లిక్స్‌‌, అమెజాన్‌‌ ప్రైమ్‌‌లో వెబ్​సిరీస్‌‌లు, సినిమాలు చూస్తూ  టైంపాస్‌‌ చేశా. మధ్యలో మా కజిన్స్‌‌, ఫ్రెండ్స్‌‌తో వీడియా కాల్స్‌‌తో టచ్‌‌లో ఉన్నా. లంచ్‌‌ తర్వాత మెడిసిన్స్‌‌ వేసుకొని మా ఫ్యామిలీతో మాట్లాడేవాణ్ణి. వాళ్లంతా నా భయాన్ని తొలగించి ప్రశాంతంగా ఉండేలా చేశారు. కేకేఆర్​ ఫ్రాంచైజీ కూడా చాలా సపోర్ట్‌‌ చేసింది. ఐపీఎల్‌‌ వాయిదా పడినప్పటికీ రెండు నెగెటివ్‌‌ టెస్టులతో నన్ను క్షేమంగా ఇంటికి చేర్చేదాకా మేనేజ్‌‌మెంట్‌‌ మాతోనే ఉంది. షారుక్‌‌ ఖాన్‌‌ కూడా ప్లేయర్లందరితో మాట్లాడి, అందరినీ మోటివేట్‌‌ చేశారు. ఈ క్రమంలో నేను ఓ విషయం నేర్చుకున్నా. కరోనా నుంచి కోలుకుంటున్న ఇతర అథ్లెట్లు, వ్యక్తులు నెగెటివ్‌‌గా తేలిన తర్వాత పూర్తిగా కోలుకోవడానికి  కనీసం రెండు వారాల పాటు బాడీకి రెస్ట్‌‌ ఇవ్వాలని సూచిస్తున్నా. నెగెటివ్‌‌ రిపోర్టు వచ్చినా కూడా మాస్క్ పెట్టుకోవడం మరిచిపోవద్దు.  అప్పుడే మీ నుంచి ఇతరులు సేఫ్‌‌గా ఉంటారు. ప్రాణాంతక వైరస్‌‌ నుంచి   పూర్తిగా కోలుకున్నందుకు నేను ఉపశమనం పొందాను. కానీ, బయట చాలా మంది ప్రాణాలు కోల్పోవడం చూస్తే చాలా కష్టంగా అనిపిస్తోంది. ఈ టఫ్​ టైమ్‌‌లో మంచి ట్రీట్‌‌మెంట్‌‌ అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా.  

ఈ సారి కూడా యూఏఈలో నిర్వహించాల్సింది: సాహా

నేను పూర్తిగా కోలుకున్నా.  నా రెగ్యులర్​ యాక్టివిటీస్‌‌ అన్నీ చేస్తున్నా. అలసట, బాడీ పెయిన్స్‌‌, వీక్‌‌నెస్‌‌ ఏమీ లేవు. అయితే, మ్యాచ్‌‌ ట్రెయినింగ్‌‌ మోడ్‌‌లోకి వచ్చాకే  నా బాడీ ఎలా  స్పందిస్తుందో తెలుస్తుంది. కరోనా పాజిటివ్‌‌గా తేలిన తర్వాత తొలి రెండు రోజులు కొద్దిగా జ్వరం మాత్రమే ఉంది. కానీ, ఐదు రోజుల తర్వాత స్మెల్‌‌ కోల్పోయా. నాలుగు రోజుల తర్వాత అది తిరిగొచ్చింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌‌తో వీడియో కాల్స్‌‌లో మాట్లాడుతూ, సినిమాలు చూస్తూ  నన్ను నేను ఉత్సాహంగా ఉంచుకున్నా. మానసికంగా ఎప్పుడూ కుంగిపోలేదు. ప్రస్తుతానికి ఇంట్లో కొన్ని ఫిట్‌‌నెస్‌‌ ఎక్సర్​సైజెస్‌‌ చేస్తున్నా. ముంబై క్యాంప్‌‌లో జాయిన్‌‌ అయిన తర్వాతే అసలైన ఫిట్‌‌నెస్‌‌ ట్రెయినింగ్‌‌ మొదలవుతుంది. ఇక, ఈ  ఐపీఎల్​ సీజన్‌‌ ఇండియాలో నిర్వహించడం వల్లే సమస్యలు వచ్చాయి. గతేడాది మాదిరిగా యూఏఈకి షిఫ్ట్‌‌ చేయాల్సింది.  లాస్ట్‌‌ సీజన్‌‌ అంతా సాఫీగా సాగింది. కానీ, ఈసారి మన దగ్గర కరోనా కేసులు పెరుగుతున్న  టైమ్‌‌లోనే  లీగ్‌‌ మొదలైంది. బయో బబుల్‌‌లోకి వైరస్‌‌ ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ, ఈ సీజన్‌‌ను కూడా యూఏఈలో నిర్వహిస్తే బాగుండేదని నా అభిప్రాయం.