సిద్దిపేట జిల్లాలో తగ్గుతున్న కంది సాగు విస్తీర్ణం

సిద్దిపేట జిల్లాలో తగ్గుతున్న  కంది  సాగు విస్తీర్ణం

సిద్దిపేట, వెలుగు:సిద్దిపేటజిల్లాలో  కంది  సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. బహిరంగ మార్కెట్లో  కంది పప్పుకు  మంచి డిమాండ్‌‌‌‌ ఉన్నా..రేటు కూడా బాగా వస్తున్నా రైతులు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో ఐదేండ్ల కిందటి వరకు 40 వేల ఎకరాలకు పైగా  కంది సాగయ్యేది.ఇప్పుడు వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతుండడంతో కంది విస్తీర్ణం గత వానాకాలం సీజన్​లో 10 వేల ఎకరాలకు పడిపోయింది.  ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, నీళ్లు బాగా ఉండడంతో వరి పంట వేసేందుకే రైతులు ఆసక్తి చూపడం, తెగుళ్ల భయం కంది సాగు తగ్గడానికి కారణమవుతున్నాయి.   జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల డివిజన్ల లో రైతులు వానాకాలం సీజన్​లో కంది ఎక్కువగా వేసేవారు. మార్కెట్​కు సరుకు బాగా రావడంతో  మార్కెట్ ఫెడ్  కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేది. జిల్లాలో మొత్తం 5.18 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. వరి, పత్తి, మొక్కజొన్న పంటలే ఎక్కువగా సాగవుతుండగా..కంది విస్తీర్ణం ఐదు శాతానికి మించడంలేదు. గతంలో  మొక్కజొన్నలో  అంతర పంటగా కంది వేసేవారు.  మొక్కజొన్నపై సర్కారు ఆంక్షలు, నీటి లభ్యత పెరగడంతో అంతరపంటగా కూడా వేయడంలేదు.  

తెగుళ్ల భయంతో అనాసక్తి 

కంది పంట చేతికి రావడానికి ఎక్కువ సమయం పట్టడం, కందిని తెగుళ్లు ఆశిస్తుండడం  రైతుల్లో ఈ పంట మీద ఆసక్తి తగ్గుతుందన్న వాదన వినిపిస్తోంది. ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేస్తే మార్కెట్​కు సరుకు వచ్చే టైమ్​లో  రేటు లేకుంటే నష్టపోతామన్న భయం రైతుల్లో కనిపిస్తుంది.  తెగుళ్లు  సోకితే మందుల ఖర్చు పెరుగుతుందని, దిగుబడి తగ్గుతుందని .. దాంతో పెట్టుబడి కూడా నష్టపోవాల్సివస్తుందని రైతులు అంటున్నారు.  నాణ్యమైన విత్తనాల కొరత,  కలుపు, కోత సమస్యలు కూడా కంది సాగు మీద ప్రభావం  చూపుతున్నాయి.  గత వానాకాలం సీజన్ లో 10 వేల ఎకరాల్లో కంది సాగు చేయగా.. జిల్లా వ్యాప్తంగా ఐదు వేల క్వింటాళ్ల లోపే పంట మార్కెట్​కు వచ్చింది.  కందులకు క్వింటాలుకు రూ. 6,300 మద్దతు ధర నిర్ణయించింది.  సరుకు తక్కువగా రావడంతో  సిద్దిపేట మార్కెట్లో  ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధరకంటే ఎక్కువిచ్చి కందులు కొనుగోలు చేశారు.  దీంతో  ఆదిలాబాద్​ రైతులు 200 కిలోమీటర్ల దూరం తమ సరుకును తెచ్చి సిద్దిపేట మార్కెటులో అమ్ముకున్నారు. 

ప్రోత్సాహకాల్లేవ్​

కంది  రైతులకు ప్రత్యేకంగా సర్కారు ఎలాంటి  ప్రొత్సాహకాలు ఇవ్వడంలేదు.  రైతుబంధు ఇస్తున్న ప్రభుత్వం ఇతర ప్రోత్సాహాకాలను పట్టించుకోవడంలేదు. మేలైన విత్తనాలను అందుబాటులో ఉంచడం, డ్రిప్, స్ప్రింక్లర్స్ లకు రాయితీలు ఇవ్వడం, కందిసాగులో మెరుగైన పద్దతులపై శిక్షణ ఇవ్వడం లాంటి చర్యలు తీసుకుంటే మార్కెట్​లో డిమాండ్​ ఉన్న కందుల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.