
రాష్ట్ర డిస్కంలు బాకీలు చెల్లించడంతో క్లియరెన్స్
హైదరాబాద్, వెలుగు : ఇండియన్ ఎలక్ట్రిసిటీ ఎక్స్చేంజ్ (ఐఈఎక్స్) నుంచి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల(డిస్కంలు) కరెంట్ కొనుగోళ్లు షురూ అయ్యాయి. విద్యుత్ కొనుగోలు కోసం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర డిస్కంలకు క్లియెరెన్స్ లభించింది. దీంతో ఐఈఎక్స్ నుంచి కరెంటు కొనుగోళ్లు ప్రారంభించారు. బాకీ ఉందనే కారణంతో పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ రాష్ట్ర విద్యుత్ కంపెనీలపై నిషేధం విధించడంతో శుక్రవారం ఐఈఎక్స్ నుంచి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఐఈఎక్స్ నుంచి డిస్కంల కొనుగోళ్లు, చెల్లించాల్సిన బాకీల లెక్కలు తేల్చుకోవడంతో అప్పటివరకు ఉన్న బాకీ రూ.1,308 కోట్ల నుంచి శుక్రవారం రూ.52.86 కోట్లకు తగ్గింది. శనివారం ఉన్న బాకీ క్లియర్ కావడం కరెంటు కొనుగోళ్లకు రాష్ట్ర డిస్కంలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో రెండు డిస్కంలు శనివారం ఎనర్జీ ఎక్స్చేంజ్ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
మరో 6 రాష్ట్రాలకు పర్మిషన్ రాలే..
దేశవ్యాప్తంగా మరో ఆరు రాష్ట్రాలకు చెందిన విద్యుత్ సంస్థలు బాకీలు చెల్లించకపోవడంతో ఆయారాష్ట్రాలకు ఐఈఎక్స్ ద్వారా కరెంట్ కొనుగోళ్లకు అనుమతి రాలేదు. కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, జమ్ముకాశ్మీర్, మిజోరాం, తమిళనాడు విద్యుత్ సంస్థల బాకీలు ఇంకా 1,372.75 కోట్లు ఉండగా చెల్లించలేదు. దీంతో శనివారం ఈ రాష్ట్రాలు పవర్ ఎక్స్చేంజ్ ద్వారా కరెంట్ ను కొనలేకపోయాయి.