తీరం దాటిన రెమాల్.. వణికిపోయిన బెంగాల్​ తీరం

తీరం దాటిన రెమాల్.. వణికిపోయిన బెంగాల్​ తీరం

ఢాకా, కోల్​కతా :  బంగాళాఖాతంలో ఏర్పడిన ‘రెమాల్’ తుఫాన్​ సోమవారం ఉదయం బెంగాల్, బంగ్లాదేశ్​ మధ్య తీరం దాటింది. ఈ సమయంలో  గంటకు 135 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్​ ధాటికి బెంగాల్​ తీరం చిగురుటాకులా వణికిపోయింది. భారీ వర్షాలతో బంగ్లాదేశ్​తోపాటు బెంగాల్​లో పలుచోట్ల వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఇప్పటివరకూ బంగ్లాదేశ్​లో ఏడుగురు, బెంగాల్​లో ఇద్దరు మృతిచెందారు. కోల్​కతాలోని ఎంటల్లీ బిబిర్​ బగన్​ ప్రాంతంలో గోడకూలి ఒకరు మృతిచెందగా,  మౌసినీ ఐలాండ్​ నంఖానాలో గుడిసె కూలి ఓ వృద్ధురాలు కన్నుమూసిందని అధికారులు తెలిపారు.

ఈదురుగాలులకు పలుచోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తీరప్రాంతాల్లోని లక్షలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్​ తీరం దాటడంతో రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. కాగా, తుఫాన్ వల్ల కోల్​కతా ఎయిర్​పోర్ట్​లో రద్దు చేసిన విమాన సర్వీసులను అధికారులు సోమవారం ప్రారంభించారు. ప్రతికూల వాతావరణంతో 8 సర్వీసులను దారిమళ్లించాల్సి వచ్చిందని తెలిపారు. 

బలహీనపడుతున్న తుఫాన్​

తుఫాన్ సోమవారం ఉదయం బలహీనపడిం దని ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలో బెంగాల్​లో భారీ వర్షాలు కురుస్తాయని  వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు ప్రజలకు సూచనలు జారీచేశారు. ఈ ఏడాది వర్షాకాలంలో బంగాళాఖాతం​లో ఏర్పడిన మొదటి తుఫాన్​కు రెమాల్ అని ఒమన్ నామకరణం చేసింది. రెమాల్​ అంటే అరబిక్​లో ఇసుక అని అర్థం.