వచ్చే నెల ఐపీఓల వెల్లువ

వచ్చే నెల ఐపీఓల వెల్లువ

ముంబై : దలాల్​స్ట్రీట్​లో గడచిన రెండు నెలల నుంచి ఇనీషియల్​ పబ్లిక్​ ఆఫర్ల (ఐపీఓలు) సందడి కనిపించడం లేదు. వచ్చే నెల నుంచి మాత్రం మార్కెట్లు మరింత బిజీ కాబోతున్నాయి. ఎందుకంటే తొమ్మిది కంపెనీలు రాబోయే నాలుగు-–ఆరు వారాల్లో రూ.17వేల కోట్లకు పైగా సమీకరించే అవకాశం ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. డిసెంబరులో ప్రారంభించిన కొన్ని  పబ్లిక్ ఆఫర్లు  విజయవంతం కాలేదు. దీంతో కంపెనీలు ఈసారి మరింత జాగ్రత్తగా ఉంటున్నాయి. రాబోయే 4–-6 వారాల్లో అవలాన్ టెక్నాలజీస్, క్యాపిలరీ టెక్నాలజీస్, కోజెంట్ సిస్టమ్స్, దిగ్వి టార్క్‌‌‌‌ట్రాన్స్‌‌‌‌ఫర్ సిస్టమ్స్, మ్యాన్‌‌‌‌కైండ్ ఫార్మా, నెక్సస్ మాల్స్ రీట్​, సిగ్నేచర్ గ్లోబల్, టీవీఎస్​ సప్లై చైన్,  ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్   ప్రైమరీ మార్కెట్‌‌‌‌లోకి వస్తున్నాయి. ఐపీఓల గురించి అడిగిన ప్రశ్నలకు తొమ్మిది కంపెనీలలో ఎనిమిది స్పందించలేదు.  అవలాన్ టెక్నాలజీస్ ప్రతినిధి మాట్లాడుతూ, ఇష్యూ  టైమ్‌‌‌‌లైన్‌‌‌‌పై 10 రోజుల్లో మరింత క్లారిటీ వస్తుందని చెప్పారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో పబ్లిక్​ ఇష్యూలు రాలేదు. అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్   రూ.20 వేల-కోట్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్‌‌‌‌ను హిండెన్‌‌‌‌బర్గ్ రిపోర్ట్ కారణంగా కంపెనీ రద్దు చేసుకోవాల్సి వచ్చింది.   ఈ కాలంలో విదేశీ పోర్ట్‌‌‌‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ.28,104 కోట్ల విలువైన షేర్లను విక్రయించడంతో జనవరి ఒకటో తేదీ నుంచి నిఫ్టీ–50 ఇండెక్స్ 4శాతానికిపైగా పడిపోయింది, నిఫ్టీ మిడ్‌‌‌‌క్యాప్– 150  ఐదుశాతం నిఫ్టీ స్మాల్‌‌‌‌క్యాప్– 150  ఆరు శాతం తగ్గాయి. పోయిన ఎనిమిది నెలల్లో రూ.49,300 కోట్ల విలువైన ఐపీఓ ప్లాన్స్​ ఉన్న 33 కంపెనీలు తమ రెగ్యులేటరీ పర్మిషన్లను వెనక్కి తీసుకున్నాయి.   పెట్టుబడిదారులకు ఆసక్తి లేకపోవడం, మార్కెట్లో ఆటుపోట్ల కారణంగా ఇష్యూలను కంపెనీలు రద్దు చేయాల్సి వచ్చిందని డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్ సీఈఓ ధర్మేష్ మెహతా అన్నారు.  అయితే, ఇలాంటి పరిస్థితుల్లోనూ మంచి ధరతో వచ్చే ఐపీఓలకు డిమాండ్ ఉందని వివరించారు.

మొదట దిగ్వి టార్క్​ ట్రాన్స్​ఫర్​ సిస్టమ్స్ ఐపీఓ..

ఆటోమోటివ్ కాంపోనెంట్ సంస్థ దిగ్వి టార్క్​ ట్రాన్స్​ఫర్​ సిస్టమ్స్​ 2023లో తన మెయిన్‌‌‌‌బోర్డ్  పబ్లిక్ ఇష్యూని ప్రారంభించిన మొదటి కంపెనీ. ఐపీఓ మార్చి 1–3 మధ్య ఉంటుంది. రూ.500 కోట్ల ఐపీఓలో ఫ్రెష్​ఇష్యూ రూ.180 కోట్లు  కాగా 39.3 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్‌‌) ద్వారా అమ్ముతారు.  మ్యాన్‌‌‌‌ఫోర్స్ కండోమ్‌‌‌‌లు సహా పలు ప్రొడక్టులను తయారు చేసే డ్రగ్ మేకర్  మ్యాన్‌‌‌‌కైండ్ ఫార్మా పబ్లిక్ ఇష్యూ మార్చి చివరిలో లేదా ఏప్రిల్ మొదటివారంలో ఉండొచ్చు. ఇది మార్కెట్‌‌‌‌ నుంచి రూ.ఐదు వేల కోట్ల వరకు సమీకరించవచ్చని  తెలుస్తోంది. సింగపూర్  సీపీపీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్ సీఐజీ క్రిస్​క్యాపిటల్​మద్దతుగల కన్సార్టియానికి మ్యాన్​కైండ్​లో 10శాతం వాటా ఉంది. క్యాపిటల్ ఇంటర్నేషనల్​కు మరో 11శాతం వాటా ఉంది. ఈ ఐపీఓలో రూ.1,600 కోట్ల వరకు ఫ్రెష్​ఇష్యూ ఉంటుంది.  చెన్నైకి చెందిన టీవీఎస్​ గ్రూపులో భాగమైన టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్, రాబోయే 5–-6 వారాల్లో పబ్లిక్ ఇష్యూను మొదలుపెట్టనుంది. మార్కెట్ నుంచి కనీసం రూ.నాలుగు వేల కోట్లను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఐపీఓలో రూ.రెండు వేల కోట్ల విలువైన షేర్ల ఫ్రెష్​ఇష్యూ,  5.95 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ ఉంటుంది. చెన్నైకి చెందిన ఐటీ కంపెనీ అవలాన్ టెక్నాలజీస్​తోపాటు గురుగ్రామ్‌‌‌‌కు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ సిగ్నేచర్ గ్లోబల్ కూడా మార్చిలో పబ్లిక్​ ఇష్యూకు వస్తున్నాయి. అవలాన్​ రూ.850 కోట్లు, సిగ్నేచర్​  రూ.వెయ్యి కోట్లు సమీకరించాలని కోరుకుంటున్నాయి. 

కంపెనీ    ఐపీఓ సైజు
    (రూ.కోట్లలో)
మ్యాన్‌‌‌‌కైండ్ ఫార్మా    5,000
నెక్సస్​ మాల్స్ రీట్    4,000
టీవీఎస్​ సప్లై చెయిన్​    4,000
సిగ్నేచర్ గ్లోబల్    1,000
అవలాన్ టెక్నాలజీస్    850
క్యాపిల్లరీ టెక్నాలజీస్    850
దిగ్విటార్క్​ ట్రాన్స్​ఫర్​ సిస్టమ్స్​    500
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్    500
కోజెంట్ సిస్టమ్స్    350