బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకు దళితబంధు సెగ

బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకు దళితబంధు సెగ
  • రోజూ ఏదో ఒకచోట విజ్ఞప్తులు, నిలదీతలు
  • లిస్టులో తమ పేరు పెట్టాలంటూ అర్జీలు
  • ఇంకెప్పుడు ఇస్తరంటూ దళితుల నుంచి ఒత్తిడి
  • ఎలక్షన్ ఇయర్ కావడంతో ఎమ్మెల్యేల పరేషాన్
  • దరఖాస్తు తీసుకొస్తే.. ‘దళితబంధు కోసమా?’ అంటూ ముందే అడుగుతున్న ఎమ్మెల్యేలు
  • ప్రతి నియోజకవర్గంలో 1,500 మందికని చెప్పి ఒక్కరికీ ఇయ్యని సర్కారు
  • గతేడాది బడ్జెట్‌‌లో రూ.17,700 కోట్ల కేటాయించి.. పైసా రిలీజ్ చేయలే

హైదరాబాద్, వెలుగు: బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకు దళితబంధు సెగ తగులుతున్నది. లిస్టులో తమ పేర్లను ఎప్పుడు చేరుస్తారంటూ దళితులు ప్రశ్నిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎమ్మెల్యేల చేతిలోనే ఉండటం, గత ఏడాది నుంచి ఒక్కరికి కూడా స్కీం అందకపోవడంతో వారు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఎక్కడికిపోయినా.. ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఎవరో ఒకరు దళితబంధు ఇప్పించాలని అడుగుతున్నారు. మరోవైపు ఇప్పటికే దళితబంధు కోసం పేర్లు ఇచ్చిన వాళ్లు ఇంకెప్పుడిస్తరని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు పరేషాన్ అవుతున్నారు. ఎలక్షన్ ఇయర్ కావడంతో ఎక్కడ తమ ఓటు బ్యాంకుకు గండిపడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ.. దళితబంధు పైసలు ఎప్పుడిస్తరంటూ ఆర్థిక మంత్రి, ఎస్సీ డెవలప్‌‌మెంట్ ఉన్నతాధికారులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొరపెట్టుకోవడం కనిపించింది.

2022–23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో రూ.17,700 కోట్లను దళితబంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ ఇంతవరకు ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు. 2023–24 ఆర్థిక సంవత్సరంలోనూ అంతే స్థాయి మొత్తాన్ని బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో దళితబంధు కోసం కేటాయించారు. రాష్ట్రంలోని దళితులందరికీ.. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళితబంధును వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అన్ని గ్రామాల్లోని దళితుల నుంచి ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరిగింది. ఇంటి దగ్గర, క్యాంప్ ఆఫీసుల్లో, ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకున్నా.. ఎమ్మెల్యేలకు రోజూ ఏదో ఒకచోట దళితబంధు విజ్ఞప్తులు వస్తున్నాయి. ఎమ్మెల్యే హామీ పొందినోళ్లు.. ‘ఏడాది కావొస్తున్నది.. ఇంకెప్పుడు ఇస్తరు?’ అని అడుగుతున్నారు. మండలాల్లోని ఛోటా మోటా బీఆర్ఎస్ లీడర్లు కూడా దళితబంధు విషయంలో ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా అర్జీ తీసుకొస్తే చాలు.. ‘దళితబంధు కోసమా?’ అని మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుగానే అడుగుతున్నారంటే ఏ స్థాయిలో రిక్వెస్ట్​లు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎలక్షన్ ఇయర్ కావడంతో ‘ఇవ్వలేం..’ ‘కాదు.. కుదరదు..’ అని చెప్పలేకపోతున్నామని ఓ ఎమ్మెల్యే వాపోయారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా ఇస్తామంటున్నారు కదా అని అడిగితే.. ‘ముందు రాష్ట్రంలో  ఇచ్చినంక.. దేశం గురించి ఆలోచిద్దాం.. కొన్ని మాట్లాడటం మంచిది కాదు’ అంటూ సదరు ఎమ్మెల్యే కామెంట్ చేయడం గమనార్హం.

1.77 లక్షల మందికి ఇస్తమని ఊరించి..

ప్రస్తుతం, వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దళితబంధు కోసం రూ.17,700 కోట్ల చొప్పున రెండింటిలో కలిపి రూ.35,400 కోట్లను బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో సర్కారు కేటాయించింది. ఇక 2022–23కు సంబంధించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గతేడాది మే నెలలో ఇచ్చింది. మొత్తం 118 నియోజవకర్గాల్లో 1.77 లక్షల మందికి రూ.పది లక్షల చొప్పున అందించనున్నట్లు పేర్కొంది. అయితే ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఒక్కరు కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లబ్ధి పొందలేదు. తొలుత నియోజకవర్గానికి 1,500 మందికి ఇస్తామని చెప్పి.. దాన్ని 500కు తగ్గించారు. ఇప్పుడు అది కూడా ఇస్తారా ఇవ్వరా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఆర్థిక సంవత్సరం ఇంకో 40 రోజుల్లో ముగుస్తుండటంతో ఒక ఏడాది దళితబంధు నిధులు కొలాప్స్ అయినట్లేనని ఉన్నతాధికారులు అంటున్నారు. ఒక్క ఏడాదికి అమలు చేస్తే అదే గొప్ప అని చెప్తున్నారు.

ఇతర సబ్సిడీ స్కీమ్​లు కూడా ఎత్తేసిన్రు

దళితబంధు ఇస్తుండటంతో ఎస్సీ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ శాఖలో అమలు చేస్తున్న ఇతర సబ్సిడీ స్కీములన్నింటినీ ప్రభుత్వం ఎత్తేసింది. గతంలో వివిధ పథకాల కింద అప్లై చేసుకున్న లబ్ధిదారుల అప్లికేషన్లన్నీ మూలకు పడేశారు. అటు ఎకనామిక్ సపోర్ట్ స్కీం, టీ ప్రైడ్ వంటి సబ్సిడీలు.. ఇటు దళితబంధు ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కనీసం పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సబ్సిడీ పైసలైనా ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దళితబంధు ఇస్తున్నామని.. ప్రభుత్వం ఇతర స్కీంలు ఏం పెట్టుకోవద్దని చెప్పిందని ఆఫీసర్లు చెప్తున్నారు. గతేడాది పైలట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ కింద హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గం, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలు, యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో దళితబంధును ప్రభుత్వం అమలు చేసింది. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో వంద మంది చొప్పున ఇచ్చారు. ఇందులో మొత్తం 38,496 లబ్ధిదారులకు గాను 38 వేల మందికి యూనిట్లు గ్రౌండ్ చేసినట్లు ఆఫీసర్లు చెప్పారు.

ఓట్లు వస్తాయనుకుంటే.. అసలుకే ఎసరు!

దళితబంధు స్కీంతో దళితుల ఓట్లన్నీ తమకే పడుతాయని భావించిన ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఉన్న ఓట్లను కాపాడుకోవడం కూడా కష్టంగా మారిందని అంటున్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తమ చేతుల్లోనే ఉండటంతో.. అంతా తామే చేస్తున్నామని దళితులు అనుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నియోజకవర్గానికి 100 మందిని ఎంపిక చేసే టైంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతా వాళ్ల సంబంధికులకే ఇచ్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో అయినోళ్లకు ఇచ్చుకుంటే.. తమ పరిస్థితి ఏంటి అని అర్హులు నిలదీస్తున్నారు. కనీసం 1,500 మందికి గత ఏడాది నుంచి పథకం ఇస్తారని అలా జరగలేదు. ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇండ్లు, సొంత జాగాలు ఉంటే ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం ఇతర పథకాలపై గ్రౌండ్ లెవెల్​లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పుడు దళితబంధు తోడు కావడంతో అసలుకే ఎసరు వచ్చిందని వారు వాపోతున్నారు.