భారీ వర్షాలకు మునిగిన ఐఫోన్ సిటీ

భారీ వర్షాలకు మునిగిన ఐఫోన్ సిటీ

బీజింగ్: పొరుగు దేశం చైనాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 24 గంటల్లో చైనాలోని హెనన్‌ ప్రావిన్స్‌లో భారీగా వాన కురుస్తోంది. గత వెయ్యి ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కుంభవృష్టి కురవడంతో భీకర వరదలు సంభవించాయి. ప్రావిన్స్‌లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ వరదల్లో ఇప్పటివరకు కనీసం 12 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

వాహనాలు వరద నీటిలో కాగితపు పడవలను తలపిస్తూ కొట్టుకుపోయాయి. హెనన్ ప్రావిన్సులోని జెంగ్‌జౌలోని రైల్వే స్టేషన్లో సుమారు 160 రైళ్లు నిలిచిపోయాయి. రైళ్లలోకి నడుం లోతు వరద నీరు చేయడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. ఐఫోన్‌ సిటీగా పిలిచే  జెంగ్‌జౌలో మంగళవారం ఒక్కరోజే 457.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. శనివారం నుంచి ఇక్కడ సగటున 640.8 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షం కురవడంతో వరదలు సంభవించినట్లు అధికారులు తెలిపారు.