
- రాఫ్ట్ ఫౌండేషన్నుపరీక్షిస్తేనే స్పష్టత
- ఇసుక తొలగింపు పర్మిషన్ కోసం మహారాష్ట్ర సర్కారుకు లేఖ
- ఆ రాష్ట్రం ఓకే చెప్తే బ్యారేజీ కుంగుబాటుపై పూర్తిస్థాయి ఎంక్వైరీ
మేడిగడ్డ బ్యారేజీకి భారీ నష్టమే వాటిల్లినట్టు ఇరిగేషన్ఇంజినీర్లు అనుమానిస్తున్నారు. బ్యారేజీలో కుంగిన ఏడో బ్లాక్‌కు మాత్రమే నష్టం పరిమితం కాదని, దానికి ఆనుకుని ఉన్న 6, 8 బ్లాకులపైనా ఆ ప్రభావం పడినట్టుగా అనుమానిస్తున్నారు. బ్యారేజీ పునాది వద్ద భారీగా పేరుకుపోయిన ఇసుకను తొలగించి ఇన్వెస్టిగేషన్ చేస్తేనే నష్టమెంత అనేదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మేడిగడ్డ బ్యారేజీలోని ఆరు, ఏడు, ఎనిమిది బ్లాకులు పూర్తిగా మహారాష్ట్ర భూభాగంలో ఉన్నాయి.
కుంగిన ఏడో బ్లాక్సహా మహారాష్ట్ర వైపు పేరుకుపోయిన ఇసుకను తొలగించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇందుకోసం ఇరిగేషన్అధికారులు మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేశారు. ఆ రాష్ట్రం నుంచి క్లియరెన్స్వస్తే తప్ప బ్యారేజీ కుంగుబాటుకు దారితీసిన పరిస్థితులు ఏమిటో తేలే అవకాశం లేదు. ఆరో బ్లాక్‌నుంచి ఎనిమిదో బ్లాక్వరకు నీళ్లు ఆగకుండా మట్టికట్ట (కాఫర్‌డ్యాం) కట్టి మళ్లిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర పర్మిషన్‌కోసం వేచి చూస్తున్నారు.
1.20 మీటర్ల లోతుకు కుంగిన 20వ పిల్లర్
గోదావరి నదిపై 1.62 కి.మీ.ల పొడవైన మేడిగడ్డ బ్యారేజీని ఎనిమిది బ్లాకులుగా నిర్మించారు. దానికి 85 వరద గేట్లు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర వైపునకు ఉన్న మూడు బ్లాకుల్లో 36 గేట్లున్నాయి. ఈ ఏడాది అక్టోబర్21న సాయంత్రం బ్యారేజీ ఏడో బ్లాక్‌లోని 20వ పిల్లర్ భారీ శబ్దంతో కుంగిపోయింది. తర్వాత అదే పిల్లర్ రెండు సార్లు కుంగింది. మొత్తంగా 1.20 మీటర్ల లోతుకు 20వ పిల్లర్కుంగినట్టుగా గుర్తించారు. నేషనల్డ్యామ్సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) బ్యారేజీని సందర్శించి రాష్ట్ర ఇరిగేషన్డిపార్ట్మెంట్ఇచ్చిన పలు డాక్యుమెంట్ల ఆధారంగా కుంగుబాటుకు కారణాలను గుర్తించింది. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్చేస్తే తప్ప బ్యారేజీ ఎందుకు కుంగిందో గుర్తించలేమని, ఆ ఇన్వెస్టిగేషన్లో తమనూ భాగస్వాములను చేయాలని కొన్ని రోజుల క్రితం స్టేట్డ్యామ్సేఫ్టీ ఆర్గనైజేషన్‌కు లేఖ రాసింది. ఆ తర్వాత బ్యారేజీ కుంగడానికి కారణాలు అన్వేషించే పని మొదలు పెట్టారు. ఇసుక తీసిన తర్వాత బ్యారేజీ ఫౌండేషన్‌ను పరిశీలించి దానికి దిగువన పరిస్థితి ఏమిటో తేల్చాల్సి ఉంది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం కోసం ఇసుకపై కాంక్రీట్ రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మించారు. రాఫ్ట్ కు కింద నదిలోపల తవ్వి పిల్లర్ల కోసం ఫౌండేషన్ వేశారు. వరద ఉధృతికి పిల్లర్లు కదలకుండా రాఫ్ట్ ఫౌండేషన్ తో బలంగా ఉండేలా చేశారు. ఏడో బ్లాక్ లోని 20వ పిల్లర్ కుంగిన తర్వాత దానికి ఇరు వైపులా ఉన్న ఆరు, ఎనిమిది బ్లాకుల్లో గల పిల్లర్లకూ డ్యామేజ్ అయినట్టు ఫీల్డ్ ఇంజినీర్లు గుర్తించినట్టు తెలిసింది. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇసుకను తీస్తేనే లోపాలు బహిర్గతం
బ్యారేజీలో ఏడో బ్లాక్‌ను పునరుద్ధరించాలంటే.. పిల్లర్లను తొలగించడానికి బలమైన రాఫ్ట్ ఫౌండేషన్ ను కట్ చేయాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసేప్పుడు కూడా ఆరు, ఎనిమిదో బ్లాక్ లోని పిల్లర్లపై ప్రభావం పడుతుందని అనుమానిస్తున్నారు. ఇసుకను తీస్తే రాఫ్ట్ ఫౌండేషన్ లో ఏమైనా లోపాలు ఉన్నా బయటపడుతాయని ఇంజినీర్లు చెప్తున్నారు. మొదట్లో డ్యామేజీలు ఏడో బ్లాక్ కే పరిమితమయ్యాయని అనుకున్నామని, కానీ పరిస్థితి చూస్తుంటే నష్టం భారీగానే ఉంటుందని ఇంజినీర్లు అనుమానిస్తున్నారు. ఇప్పుడైనా హడావుడి రిపేర్లతో మమ అనిపించకుండా.. బ్యారేజీలో లోపాలపై సమగ్రమైన సర్వే చేయాలని, ఆ తర్వాతే రిపేర్లపై దృష్టి పెట్టాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోనే చర్చ సాగుతోంది.