ఎఫ్​టీఎల్ పరిధులను గుర్తించాలి : దామోదర రాజనర్సింహ

ఎఫ్​టీఎల్ పరిధులను గుర్తించాలి :  దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి, వెలుగు: చెరువులను కాపాడేందుకు ఎఫ్ టీఎల్ పరిధులను గుర్తించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. సోమవారం ఆయన సంగారెడ్డి కలెక్టర్​ఆఫీసులో కలెక్టర్ క్రాంతితో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో చెరువులను కబ్జా చేసేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ మైనింగ్ కు పాల్పడే వారిపై కేసులు నమోదుచేయాలన్నారు. స్పందించని అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అమీన్ పూర్, పటాన్ చెరు పరిసర ప్రాంతాల్లో చెరువులను కాపాడే బాధ్యత రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులదే అన్నారు. బోర్డర్ ప్రాంతాల్లో ఉన్న చెక్ పోస్ట్ లలో నిఘా మరింత పెంచాలని ఆదేశించారు. ఇప్పటివరకు రవాణా అధికారులు వే బిల్లులు లేని 18 వాహనాలను పట్టుకుని  24 లక్షలకు పైగా ఫైన్ వేశారని మంత్రి గుర్తు చేశారు. సమావేశంలో ఎస్పీ రూపేశ్, అడిషనల్​ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్​వో పద్మజారాణి పాల్గొన్నారు.