ఏటీసీలో ట్రెయినింగ్తో జాబ్ గ్యారెంటీ : దానకిశోర్

ఏటీసీలో ట్రెయినింగ్తో  జాబ్ గ్యారెంటీ : దానకిశోర్
  • పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు స్కిల్స్ నేర్పిస్తున్నం
  • ఇప్పటికే 65 ఏటీసీలు.. వచ్చే ఏడాది మరో 40
  • సీఎం రేవంత్​, మంత్రి వివేక్ సూ చనలతో ముందుకెళ్తున్నం 
  • ‘వీ6 వెలుగు’ ఇంటర్వ్యూలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏటీసీ(అడ్వాన్స్‌‌డ్‌‌ టెక్నాలజీ సెంటర్‌‌‌‌)లతో మంచి ఉపాధి అవకాశాలు అందనున్నాయని, వీటిని యువత సద్వినియోగం చేసుకోవాలని కార్మిక, ఉపాధి కల్పన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ సూచించారు. పదో తరగతి అర్హతతో ఏటీసీల్లో చాలా కోర్సులు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఇప్పటికే 65 ఏటీసీలు ప్రారంభించగా, వాటిల్లో 94 శాతం అడ్మిషన్లు పూర్తయ్యాయని తెలిపారు. మరో 46 ఏటీసీలకు కేంద్రం ఇటీవల అనుమతిచ్చిందని వెల్లడించారు. వీటిని వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. ఏటీసీలకు మంచి రెస్పాన్స్ వస్తున్నదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆశయాలు, ఆదేశాలకు తగ్గట్టు ముందుకెళ్తున్నామన్నారు. ఐటీఐలు, ఏటీసీలు, వాటిల్లో కోర్సులు, ఉపాధి అవకాశాలపై వీ6 వెలుగుకు దానకిశోర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. 

ప్రశ్న: ఐటీఐలకు, ఏటీసీలకు తేడా ఏంటి? 

దానకిశోర్: ఐటీఐలు 1950లో మొదలయ్యాయి. ఇప్పుడు ప్రతి ఫీల్డ్‌‌లో కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇపుడంతా 4.0 టెక్నాలజీ నడుస్తున్నది. ఇందులో ఏఐ, మిషన్ లెర్నింగ్, త్రీడీ ప్రింటింగ్, రోబోటిక్స్ తదితర ఉన్నాయి. ఈ అడ్వాన్స్‌‌డ్‌‌ టెక్నాలజీతోనే ఏటీసీలను తీసుకొచ్చాం. వీటిల్లో అడ్వాన్స్‌‌డ్‌‌ ట్రైనింగ్ ఇస్తున్నాం. దీంతో ఇక్కడ ట్రైనింగ్ తీసుకోగానే జాబ్ వస్తుంది. ఏటీసీల్లో 6 కోర్సులు స్టార్ట్ చేశాం. పోయినేడాది 3,500 సీట్లు ఉండగా, ఈ ఏడాది మరో 6,500 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే ఏడాది 40 కొత్త ఏటీసీలు ప్రారంభిస్తే, ఇంకో 5 వేల సీట్లు అందుబాటులోకి వస్తాయి. మొత్తం 15 వేల సీట్లు అందుబాటులో ఉంటాయి. 

ఏటీసీలో జాయిన్ అయ్యేందుకు అర్హులెవరు? 

10వ తరగతి పూర్తి చేసినోళ్లు అర్హులు. మార్కుల ప్రకారం సీట్ల భర్తీ ఉంటుంది. ఫీజు ఏమీ ఉండదు. ఉచితంగా ట్రైనింగ్ ఇస్తాం. ఒక్కో ఏటీసీకి ప్రభుత్వం రూ.40 కోట్లు ఖర్చు పెడుతున్నది. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక టాటా టెక్నాలజీ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నది. 111 ఏటీసీలు రూ.5 వేల కోట్లతో స్టార్ట్ చేస్తున్నం. ఒక్కో కోర్సుకు 6.5 కోట్లు ఖర్చు పెడుతున్నం. ఇందులో టాటా సహకారం ఉంటుంది. 

బీటెక్ పూర్తయినోళ్లకు కూడా ట్రైనింగ్ ఇస్తారా? 

బీటెక్ పూర్తి చేసినోళ్లకు కూడా ఏటీసీల్లో ట్రైనింగ్ ఇస్తాం. ఈ అంశంపై కొన్ని కంపెనీలతో చర్చించాం. షార్ట్ టర్మ్ కోర్సులు స్టార్ట్ చేస్తున్నాం. ఈ సర్టిఫికెట్ అంతర్జాతీయంగా చెల్లుబాటు అవుతుంది. మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో మంచితీరు కనబరిచిన ప్రిన్సిపాల్స్‌‌కు, ఐటీఐలలో ట్రైనింగ్ తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదిగిన స్టూడెంట్లకు ఎక్సలెన్స్ అవార్డులు ఇచ్చాం. ఇలా చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. 

ఏటీసీలో కోర్సు పూర్తి చేశాక ప్లేస్‌‌మెంట్స్ ఉంటాయా? 

క్యాంపస్ ప్లేస్‌‌మెంట్స్ ఉంటాయి. కోర్సు పూర్తి కాగానే జాబ్ వస్తుంది. ఇన్ఫోసిస్‌‌తో అగ్రిమెంట్ చేసుకున్నాం. క్యాప్ జెమినీ కంపెనీ కూడా వచ్చింది. ఆదిలాబాద్ వాళ్లు జిల్లాలోనే ట్రైనింగ్ తీసుకొని, అక్కడే జాబ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. గత 6 నెలల్లో 35 మందిని జర్మనీకి పంపించాం. జపాన్, యూరప్ కంట్రీస్‌‌లో కూడా స్కిల్స్ ఉన్న యువత అవసరం ఉంది.
 
కోర్సులో భాగంగా సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌‌మెంట్ ట్రైనింగ్ ఉంటుందా? 

ఇది కచ్చితంగా కోర్సులో నేర్పిస్తాం. నెలకు 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఐటీఐల నుంచి ఏటా 80 వేల మంది బయటకు వస్తున్నారు. ఏడాదికి 2 లక్షల మందికి స్కిల్స్ నేర్పించాలని సీఎం ఇటీవల ఆదేశించారు. జిల్లాల్లో ఎంప్లాయ్‌‌మెంట్ ఆఫీసుల ద్వారా మోడల్ కెరీర్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. డిగ్రీ పూర్తయిన తరువాత జిల్లాల్లో స్కిల్స్ నేర్పిస్తాం. కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ద్వారా కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. 

యువతకు లోకల్‌‌గా జాబ్ దొరికేలా స్థానిక కంపెనీలతో మాట్లాడుతున్నారా? 

దానకిశోర్: 25 ఏటీసీల్లో లోకల్ కంపెనీలతో చర్చలు జరిపాం. కంపెనీలు అన్ని జిల్లాల్లో తమ వ్యాపారాన్ని విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. స్కిల్స్ ఉన్న యువత దొరికితే కంపెనీలకు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. స్కిల్స్ ఉన్న వాళ్లు దొరక్కపోతే కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించాలని అనుకోవు. 

ఏటీసీలకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారా? 

దానకిశోర్: ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా వస్తున్నారు. కానీ ముందు మన రాష్ట్రం వాళ్లకే ప్రాధాన్యం. అన్ని రాష్ట్రాల్లో ఐటీఐలు ఉన్నాయి. ఏటీసీలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నం.