కీసరలో వీఐపీ దర్శనాలు బంద్ : మంత్రి మల్లారెడ్డి

కీసరలో వీఐపీ దర్శనాలు బంద్ : మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ : కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలిరానుండటంతో ఈసారి వీఐపీ పాసులు రద్దు చేసినట్లు మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. కీసర గుట్ట ఆలయంలోని శివున్ని దర్శించుకున్న అనంతరం మంత్రి మల్లారెడ్డి.. బ్రహ్మోత్సవాల కో ఆర్డినేషన్ మీటింగ్ కు హాజరయ్యారు. ఈసారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఈసారి వీఐపీ పాసులు రద్దు చేసి, ఆన్ లైన్ టిక్కెట్ బుకింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎవరైనా వారి ఐడీ కార్డ్ చూపించి దర్శనం చేసుకోవాలని సూచించారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా భక్తుల సంఖ్య తగ్గిందని, ఈసారి మాత్రం భారీ సంఖ్యలో వచ్చే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నట్లు మల్లారెడ్డి చెప్పారు. 

ఫోన్ పే ద్వారా కానుకలు

హుండీ లో డబ్బులు వేయాలనుకునే భక్తులు ఇకపై ఫోన్ పే ద్వారా కూడా చేయొచ్చని అడిషనల్ అభిషేక్ అగస్థ్యన్ చెప్పారు. దర్శనం టికెట్లను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఆలయ ఛైర్మన్ తాటకం రమేష్ శర్మ, అడిషనల్ కలెక్టర్ నరసింహ్మ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులుపాల్గొన్నారు.