మృతదేహాన్ని హ్యాక్‎సా బ్లేడ్‎తో ముక్కలు చేసి.. మూసీలో పడేశాడు: స్వాతి మర్డర్ కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు

మృతదేహాన్ని హ్యాక్‎సా బ్లేడ్‎తో ముక్కలు చేసి.. మూసీలో పడేశాడు: స్వాతి మర్డర్ కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు

హైదరాబాద్: హైదరాబాద్: మేడిపల్లిలో భర్త చేతిలో దారుణ హత్యకు గురైన స్వాతి హత్య కేసు వివరాలను డీసీపీ పద్మజ మీడియాకు వివరించారు. పథకం ప్రకారమే స్వాతిని ఆమె భర్త మహేందర్ రెడ్డి హత్య చేశాడని తెలిపారు. డెడ్ బాడీని ఒక్కసారి తరలించడం వీలుకాక ముక్కలుగా హ్యాక్ సా బ్లేడుతో ముక్కలు చేసి తల, కాళ్లు, చేతులను వేర్వేరు కవర్లలో చుట్టి శరీర భాగాలను విడతలవారీగా మూసీలో పడేశాడని చెప్పారు. శవాన్ని మాయం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నించాడని పేర్కొన్నారు. పోలీసులు వెళ్లే చూసేవరకు మహేందర్ రెడ్డి ఇంట్లో కేవలం మొండెం మాత్రమే మిగిలిందని తెలిపారు. 

మొండానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అలాగే స్వాతి బాడీ పార్ట్స్ కోసం మూసీలో గాలిస్తున్నామని వెల్లడించారు. స్వాతి, మహేందర్ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, వీరిది కులాంతర వివాహమని చెప్పారు. స్వాతి హైదరాబాద్ పంజాగుట్టలో ఓ కాల్‌ సెంటర్‌లో పనిచేస్తుండగా.. మహేందర్‌రెడ్డి క్యాబ్‌ డ్రైవింగ్ చేస్తున్నాడని తెలిపారు. పెళ్లయి ఏడాదిన్నర అయ్యిందని.. పెళ్లయిన కొన్ని నెలలకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయన్నారు. పెద్ద మనుషులతో పంచాయతీ కూడా పెట్టించారని, పెళ్లయిన ఏడాదిన్నరలోనే నాలుగు సార్లు కౌన్సిలింగ్‎కు వెళ్లారని చెప్పారు. 

కులాంతర వివాహం కావడం వల్ల గొడవలు ఎక్కువ అయ్యాయని తెలిపారు. గర్భవతి కావడంతో తనను పుట్టింటికి పంపాలని స్వాతి కోరిందని.. ఈ విషయంలో గొడవ జరిగి మహేందర్ రెడ్డి భార్యను క్రూరంగా హత్య చేశాడని తెలిపారు. గతంలో కూడా ఓ సారి స్వాతికి అబార్షన్ చేయించాడని చెప్పారు. స్వాతిని హత్య చేసిన అనంతరం ఆమె చెల్లికి ఫోన్ చేసి మీ అక్క కనిపించట్లేదని చెప్పాడన్నారు. హత్యానంతరం ఎవరికి డౌట్ రాకుండా మేం బాగానే ఉన్నామంటూ స్వాతి ఫోన్ నుంచి ఆమె తల్లికి మెసేజ్ పెట్టాడని వివరించారు డీసీపీ పద్మజ. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని, హత్యలో ఇంకెవరైనా సహకరించారా అన్న కోణంలో ఆరా తీస్తున్నామని తెలిపారు. 

Also read:-మేడిపల్లి స్వాతి కేసులో సంచలన విషయాలు..