దూరదర్శన్ లోగో వివాదం: కలర్ మార్పుతో బాధపడ్డాను: మాజీ సీఈవో

దూరదర్శన్ లోగో వివాదం:  కలర్ మార్పుతో బాధపడ్డాను: మాజీ సీఈవో

దూరదర్శన్ లోగో కలర్ మార్పు తీవ్ర విమర్శలకు దారితీసింది. డిడి కొత్త లోగోను ఆవిష్కరించిన 48 గంటల్లోనే వివాదాస్పదమైంది. ప్రభుత్వ నిర్వహణలో నడిచే ఈ డీడీ ఛానెల్ కొత్త లోగో చర్చనీయాంశమైంది. గతంలో రూబీ రెడ్  కలర్ లో ఉన్న డీడీ లోగోను తాజాగా నారింజ కలర్ లోకి మార్చడంతో అటు ప్రతిపక్షాలు, దూరదర్శన్ మాజీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోగోలో మార్పుతో దూరదర్శన్ కాషాయీకరణ జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

ఈ విషయంపై స్పందించిన దూరదర్శన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గౌరవ్ ద్వివేది.. కొత్త లోగో కేవలం న్యూ లుక్ కోసమే మార్చామని అన్నారు. అయితే లోక్ సభ ఎన్నికలకు ముందు కొత్త లోగో కలర్ మార్పు చేయడాన్ని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. 

2012 నుంచి 14 వరకు ప్రసార భారవి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన వ్యక్తి.. ప్రస్తుత టీఎంసీ రాజ్యసభ ఎంపీ అయిన జవహర్ సర్కార్.. లోగో మార్పుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ప్రసార భారత అనేది దూరదర్శన్ , ఆల్ ఇండియా రేడియో(AIR) లను పర్యవేక్షిస్తున్న చట్టబద్దమైన సంస్థ. జాతీయ బ్రాడ్ కాస్టర్ తన బ్రాండింగ్ కోసం నారింజ కలర్ ఎంచుకుంది అని అనడం సరికాదు..ఇది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లే అని సర్కార్ అన్నారు.