చిరుధాన్యాల సాగుపై ఫోకస్ .. డీడీఎస్ లో కొత్త సంఘాల ఏర్పాటు

చిరుధాన్యాల సాగుపై ఫోకస్ .. డీడీఎస్ లో కొత్త సంఘాల ఏర్పాటు
  • ఒక్కో సంఘంలో 30 నుంచి 60 మంది సభ్యులు
  • ఆహార భద్రత, ఆరోగ్యమే లక్ష్యం

సంగారెడ్డి, వెలుగు: చిరుధాన్యాలపై అవగాహన కల్పిస్తున్న డెక్కన్ డెవలప్​మెంట్ సొసైటీ (డీడీఎస్) సభ్యులు కొత్త సంఘాల ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టారు. మహిళలను సంఘాలుగా ఏర్పాటు చేసి సేంద్రియ పద్ధతిలో చిరుధాన్యాలను సాగు చేయించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పస్తాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న డెక్కన్ డెవలప్​మెంట్ సొసైటీ 1983లో ఝరాసంఘం మండలం మాచ్నూర్ కేంద్రంగా ఏర్పడింది. ఇప్పటివరకు జహీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో సేంద్రియ విధానంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తూ వస్తోంది. గ్రామాల్లో పాత పంటల జాతర నిర్వహిస్తూ వాటిపై అవగాహన కల్పిస్తోంది. ఇప్పటివరకు 7 మండలాల్లో 42 సంఘాలు డీడీఎస్ కింద పనిచేస్తున్నాయి. వాటిని మరింత విస్తరించేందుకు కొత్త సంఘాల ఏర్పాటు మొదలుపెట్టింది. 

అప్పుగా సాగు విత్తనాలు

ఝరాసంఘం మండలం మాచ్నూర్ లో డీడీఎస్ ఆధ్వర్యంలో విత్తనాల సంరక్షణ బ్యాంకు ఏర్పాటు చేశారు. చిరుధాన్యాలను ప్రోత్సహించే నేపథ్యంలో అక్కడి నుంచి సభ్యులకు సాగు నిమిత్తం విత్తనాలను అప్పుగా ఇస్తారు. విత్తే సమయంలో 10 కేజీల విత్తనాలు అప్పుగా తీసుకుంటే పంట పండించాక ఐదు కేజీలు కలిపి 15 కేజీలు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,800 ఎకరాల్లో చిరుధాన్యాల సాగు కొనసాగుతున్నట్టు డీడీఎస్ ప్రతినిధులు తెలిపారు. సజ్జ, కొర్ర, సామ, తైదలు, శనగలు, సాయిజొన్న, పజొన్న, పెసర్లు, మినుములు, అవిశలు, కందుల తో పాటు దాదాపు 70 రకాల విత్తనాలను డీడీఎస్ సరఫరా  చేస్తోంది. 

ఇదిలా ఉంటే కేవలం సేంద్రియ వ్యవసాయంపైనే కాకుండా పాడి పరిశ్రమ అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టారు. ఇప్పటివరకు సంస్థ ద్వారా మేకలు, గొర్రెలు, కోళ్లు, బర్రెలతోపాటు వివిధ రకాల పశువులను అందించారు. సాగులో ఏర్పడే సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రతి నెలా సంఘం సభ్యులు ఒకచోట సమావేశమై చర్చించుకుంటారు. సంఘం సభ్యుల యోగక్షేమాలతో పాటు గ్రామాల్లోని ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం డీడీఎస్ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకుంది. 

కొత్తగా 12 సంఘాలకు..

డీడీఎస్ సంస్థ ఆధ్వర్యంలో 12 కొత్త సంఘాలను ఏర్పాటు చేసి ఒక్కో సంఘంలో 30 నుంచి 60 మంది సభ్యులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ మరో 6 నెలల పాటు కొనసాగించి మరికొన్ని సంఘాలను ఏర్పాటు చేసేందుకు డీడీఎస్ సభ్యులు కార్యచరణ రూపొందించారు. ఈ సంఘాల ఆధ్వర్యంలో నేల, నీరు, పర్యావరణం కాలుష్యం కాకుండా క్రిమిసంహారక మందులను వాడకుండా సేంద్రియ విధానంతో పంటలు పండించడం గురించి అవగాహన కల్పిస్తారు. గ్రామీణ ప్రాంతంలో ఆహార కొరత ఏర్పడకుండా వారు తినే ఆహారాన్ని వారే పండించుకోవడం అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. 

మహిళా సభ్యులు పండించిన పంటలను సొంతానికి కొంత ఉంచుకొని మిగతా ధాన్యాన్ని మార్కెట్ తోపాటు డీడీఎస్ సంస్థకు విక్రయించేలా వెసులుబాటు కల్పించారు. కొనుగోలు చేసిన విత్తనాలను శుద్ధీకరణ, విభజన చేసి మార్కెట్ కు తరలిస్తుంటారు. వీటితోపాటు 36 రకాల వండిన పదార్థాలను ప్యాకింగ్ చేసి జిల్లా నలుమూలలతో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాలలో విక్రయిస్తూ ఉంటారు.