
- 2026 ప్రారంభంలో దేశీయ మార్కెట్లో సంస్థ ఉత్పత్తులు
- డెక్కన్ గ్రెయింజ్ ఇండియా డైరెక్టర్ కిరణ్ కుమార్ పోలా
హైదరాబాద్, వెలుగు: డెక్కన్ బ్రాండ్ పేరుతో రైస్ ఎగుమతి చేసే డెక్కన్ గ్రెయింజ్ ఇండియా తాజాగా చైనాలో అడుగుపెట్టింది. ఇప్పటికే కంపెనీ స్వీడన్, యూకే, జర్మనీ, ఐర్లాండ్, లండన్, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఈయూ, టర్కీలో 30 రకాల భారతీయ రైస్‌ను పరిచయం చేసింది. ఈ స్థాయిలో విదేశీ గడ్డపై విస్తరించిన ఏకైక దక్షిణ భారత బ్రాండ్‌గా స్థానం సంపాదించామని డెక్కన్ గ్రెయింజ్ ఇండియా డైరెక్టర్ కిరణ్ కుమార్ పోలా తెలిపారు.
బియ్యం ఉత్పత్తిలో భారత్ తర్వాత ప్రపంచంలో రెండవ స్థానంలో నిలిచిన చైనాలో కంపెనీ ప్రవేశించడాన్ని మైలురాయిగా పేర్కొన్నారు. యూఎస్ మార్కెట్లో నాన్ బాస్మతి రైస్ విభాగంలో డెక్కన్ ఫుడ్స్ నంబర్ వన్ స్థానం కైవసం చేసుకున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల్లోని వేలాది మంది రైతుల నుంచి నాణ్యమైన బియ్యం కొనుగోలు చేసి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు వివరించారు.
2026 ప్రారంభంలో దేశీయ మార్కెట్లో సంస్థ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. హైదరాబాద్ సమీపంలోని సుల్తాన్‌పూర్ వద్ద అత్యాధునిక జపాన్ సాంకేతికత ఆధారిత రైస్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఉందని, ఈ కేంద్రం సామర్థ్యం నెలకు 5,500 మెట్రిక్ టన్నులని కిరణ్ కుమార్ తెలిపారు.