డిగ్రీలో ఈ ఏడాది చేరిన రెండున్నర లక్షలమంది

డిగ్రీలో ఈ ఏడాది చేరిన రెండున్నర లక్షలమంది

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ఈసారి రికార్డు స్థాయిలో అడ్మిషన్లు జరిగాయి. ఏకంగా రెండున్నర లక్షల మంది స్టూడెంట్లు వివిధ కోర్సుల్లో చేరారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ స్థాయిలో అడ్మిషన్లు నమోదు కావడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో1,040 డిగ్రీ కాలేజీల్లో 4,24,703 సీట్లున్నాయి. వీటిలో ఈ అకడమిక్​(2021–22) ఇయర్​లో 2,49,899 అడ్మిషన్లు నిండాయి. ప్రస్తుతం ప్రైవేటు కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు కొనసాగుతుండటంతో, మరో 5 వేల అడ్మిషన్లు పెరగొచ్చని అధికారులు చెప్తున్నారు. నిరుడు స్టేట్ వైడ్ గా 4,24,315 సీట్లుంటే, 2.25 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. కరోనా వల్ల ఈ ఏడాది ఇంటర్మీడియట్​లో  ఫీజు కట్టిన స్టూడెంట్లందరినీ సర్కార్ పాస్ చేసింది. దీంతో ఇటు ఇంజినీరింగ్ తో పాటు డిగ్రీలోనూ భారీగా అడ్మిషన్లు పెరిగాయి. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని సర్కారు డిగ్రీ కాలేజీల్లో దాదాపు అన్నీ సీట్లు భర్తీ అయ్యాయి. హైదరాబాద్​లోని సర్కారు అటానమస్ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి. ఈసారి 4 కాలేజీల్లో కొత్తగా ప్రారంభించిన బీఏ ఆనర్స్ కోర్సుకు అంతగా ఆదరణ రాలేదు. చివరి విడత కౌన్సెలింగ్​లో ఈ కోర్సును ప్రకటించడంతో చాలామంది ఈ కోర్సును ఎంచుకునే చాన్స్ లేకుండా పోయింది. డిగ్రీలో కొత్త కోర్సుల పెంపుతో అడ్మిషన్లు పెరిగాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు.  బీఏ ఆనర్స్​కోర్సులకు వచ్చే ఏడాది నుంచి మంచి డిమాండ్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.